Congress and BRS: కాంగ్రెస్ గెలుపు కోసం బీఆర్ఎస్‌! అసెంబ్లీ ఫైట్‌లో కేసీఆర్‌ సూపర్‌ ప్లాన్‌?

ఒక పార్టీని ఓడించేందుకు మరో పార్టీతో జత కట్టడం రాజకీయ పార్టీలకు మామూలే. ఇప్పడు తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొందనే టాక్ వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 03:37 PM IST

ఈసారి కూడా గెలిచి తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు కేసీఆర్ ! గల్లీలో గెలిచి.. ఢిల్లీ మీద దండయాత్రను మరింత స్ట్రాంగ్‌ చేయాలని ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే జనంలో కనిపిస్తున్నారు.. జనంలా కనిపిస్తున్నారు.. జనంతోనే ఎక్కువగా ఉంటున్నారు. ప్రత్యర్థికి ఏ చిన్న అవకాశం దక్కకుండా ఒక్కో అడుగు ఆచీతూచీ వేస్తున్నారు. పార్టీలో లుకలుకలపై దృష్టిసారిస్తూనే.. ప్రత్యర్థి పార్టీ బలహీనతలను ఆయుధంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

ఐతే తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు అంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. కొత్త విషయం ఒకటి తెరమీదకు వస్తోంది. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేయబోయే కొందరిని గెలిపించే బాధ్యత కేసీఆర్‌ తీసుకున్నారని తెలుస్తోంది. నిజానికి 2018 ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని చాలామంది అంటున్నా… అప్పుడు వేరు, ఇప్పుడు వేరు పరిస్థితి ! వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన పార్టీగా.. జనాల్లో బీఆర్ఎస్‌ మీద అంతో ఇంతో వ్యతిరేకత ఉంటుంది. అది కేసీఆర్‌కు పక్కాగా తెలుసు. పైగా చాలామంది ఎమ్మెల్యేలపై జనం గుర్రుగా ఉన్న పరిస్థితి. అది కూడా తెలుసు. అందుకే ముందే సర్వేలు చేయించుకున్నారు. పార్టీ గురించి, పరిపాలన గురించి… ప్రజాప్రతినిధి గురించి జనం ఏమనుకుంటున్నారన్న అన్ని వివరాలు తెప్పించుకున్నారు కేసీఆర్ !

ఐతే చాలామంది సిట్టింగ్‌లపై జనాల్లో వ్యతిరేకత ఉందని.. అదే సమయంలో పార్టీలో అంతర్గత విభేదాలు చల్లారే పరిస్థితి లేదని కేసీఆర్ గ్రహించారని.. అందుకే కొత్త ప్లాన్‌కు శ్రీకారం చుట్టారనే ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించే బాధ్యత బీఆర్ఎస్‌ తీసుకోబోతుందనే చర్చ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. బీఆర్ఎస్ గెలుపు కష్టం అనుకున్న చోట్ల.. బీజేపీ గెలుపు అవకాశాలకు గండి కొట్టాలన్న చోట.. కేసీఆర్ ఈ వ్యూహాన్ని అమలు చేయబోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఫండింగ్‌ చేసి.. ఫలితాలు తర్వాత.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడమా.. గెలిపించుకున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ నుంచి చీల్చడమా అనే దానిపై నిర్ణయాలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా జరిగింది అదే ! కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరినీ లాగేసి.. హస్తం పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలిగారు. ఇప్పుడు అదే వ్యూహానికి ఇంకాస్త పదును పెంచాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు కనిపిస్తున్నారు. రాజకీయం ఇలా చేయాలని ఎక్కడా లేదు. ఎవ్రీథింగ్‌ ఈజ్‌ ఫెయిర్ ఇన్ లవ్‌ అండ్ వార్‌ మాత్రమే కాదు.. పాలిటిక్స్‌ కూడా ! కేసీఆర్ వ్యూహాలతో ఇప్పుడు రాజకీయం మాట్లాడుకున్న మాట ఇదే !