LTTE Prabhakaran: పెద్దపులి బతికే ఉందా…?

పెద్దపులి బతికే ఉంది.... అడవిలో మాటేసి వేటాడటానికి సిద్ధంగా ఉంది... ఇప్పుడిదే వార్త శ్రీలంకలో కల్లోలం రేపుతోంది.

  • Written By:
  • Updated On - February 13, 2023 / 06:32 PM IST

పెద్దపులి బతికే ఉంది…. అడవిలో మాటేసి వేటాడటానికి సిద్ధంగా ఉంది… ఇప్పుడిదే వార్త శ్రీలంకలో కల్లోలం రేపుతోంది. ఎప్పుడో చనిపోయిందనుకుని అందరూ నమ్మిన ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ నెడిమారన్ చేసిన ప్రకటన ఓ బాంబులా పేలింది. ఇప్పుడు ఎల్టీటీఈ బలంగా లేకపోవచ్చు… పరిస్థితులు మారిపోయి ఉండొచ్చు… కానీ పులి పులే… అది కనబడాల్సిన పనిలేదు… కానీ అది వేటకు సిద్ధంగా ఉందన్న వార్త మాత్రం భయంతో ఒళ్లంతా చెమటలు పట్టేలా చేస్తుంది.

నెడుమారన్… ఎల్టీటీఈ సానుభూతిపరుడు…. ఆయన తాజాగా చేసిన ఓ ప్రకటన మానవ బాంబును మించి పేలింది. ప్రభాకరన్ బతికే ఉన్నాడని నెడుమారన్ ప్రకటించారు. తాను ఆయనతో టచ్్లో ఉన్నానని… ప్రభాకరన్ అనుమతి తీసుకునే ఈ ప్రకటన చేసినట్లు తెలిపారు. అంతేకాదు ప్రభాకరన్ భార్య, కుమార్తె కూడా క్షేమంగా ఉన్నారని చెప్పారు. వారు ఎక్కడున్నారో బయటకు మాత్రం చెప్పలేనన్నారు. సరైన సమయంలో ప్రభాకరన్ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. రాజపక్స ప్రభుత్వం కూలిపోవడంతో ప్రభాకరన్ బయటకు రావడానికి సరైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకొచ్చారు నెడుమారన్.

నెడుమారన్ ప్రకటనను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ప్రభాకరన్్తో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి. ఎల్టీటీఈ తరపున విదేశాల్లో చాలా కార్యకలాపాలు చక్కబెట్టినట్లు చెప్పుకుంటారు. ఎల్టీటీఈకి సంబంధించి చాలా విషయాలు ఆయన ద్వారానే బయటకు వచ్చేవి. అలాంటి వ్యక్తి ఏదో పబ్లిసిటీ కోసమో లేక మరో కారణంతోనో ఈ ప్రకటన చేసి ఉంటారనుకోవడానికి వీల్లేదు. శ్రీలంకలో ఎల్టీటీఈ తుడిచి పెట్టుకుపోయి ఉండొచ్చు కానీ ఇంకా దాని అవశేషాలు మాత్రం ఉన్నాయి. సానుభూతిపరులు చాలామందే ఉన్నారు. కాలం కలసి రాక వారు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఇప్పుడు ప్రభాకరన్ బతికి ఉన్నారన్న వార్త నిజంగానే లంకలో తుపాను సృష్టించేలా ఉంది.

వేలుపిళ్లై ప్రభాకరన్… శ్రీలంకలో తమిళుల హక్కుల కోసం పోరాడిన ఎల్టీటీఈకి అధినేత. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ తనకు స్పూర్తి అని చెప్పుకున్నాడు. లంక తమిళుల కోసం చంపడానికైనా, చావడానికైనా సిద్ధమంటూ తుపాకి పట్టాడు. ఏకంగా ఓ సైన్యాన్నే తయారు చేసుకున్నాడు. ప్రతి తమిళుడి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానంటూ రక్తపాతం సృష్టించాడు. జాఫ్నా కేంద్రంగా సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన నాయకుడు. కొన్ని దశాబ్దాల పాటు లంకను రావణకాష్టంగా మార్చాడు. ఆత్మాహుతి దాడులతో హోరెత్తించాడు. ప్రభాకరన్ పేరు చెబితే లంక పాలకులకు వెన్నులో వణుకు పుట్టేది. ప్రభాకరన్్ను పెద్దపులి అని ముద్దుగా పిలుచుకునేవారు తమిళులు.

2009మే 18న ప్రభాకరన్్ను శ్రీలంక సైన్యం కాల్చిచంపింది. పోనీ నెడుమారన్ చెప్పిన దాని ప్రకారం కాల్చి చంపామనుకుంది. కొన్ని నెలల భీకర యుద్ధం తర్వాత రెబల్స్ పై పైచేయి సాధించిన లంక సైన్యం… ప్రభాకరన్ స్థావరాన్ని చుట్టుముట్టింది. ముల్లైటివు ప్రాంతంలో ఆయన్ను హతమార్చింది. ప్రభాకరన్ తో పాటు ఆయన కుమారుడ్ని కూడా సైన్యం కాల్చి చంపింది. పిల్లాడికి బిస్కట్లు ఇచ్చి తిన్నాక కాల్చి చంపారన్న వార్త అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ప్రభాకరన్ చనిపోయాక ఆయన మృతదేహం చిత్రాలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది. అంతేకాదు డీఎన్ఏ పరీక్షలు కూడా నిర్వహించింది. ఆ డెడ్్బాడీ ప్రభాకరన్్దే అని తేల్చింది. ఎల్టీటీఈ కూడా తమ అధినేత చనిపోయినట్లు ప్రకటించింది. ప్రభాకరన్ కుటుంబసభ్యుల మృతదేహాలు కూడా దగ్గర్లోని ముళ్లపొదల్లో కనిపించినట్లు చెప్పుకున్నారు. కానీ ఆ ఫోటోలేవీ బయటకు రాలేదు. ఆ తర్వాత ఎల్టీటీఈ పూర్తిగా బలహీనపడింది. దాదాపు అంతరించిపోయింది. పెద్దపులిని అందరూ మర్చిపోయారు. కానీ దాదాపు 14ఏళ్ల తర్వాత నెడుమారన్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది.

ప్రభాకరన్ బతికి ఉన్నారన్న వార్త కొత్తేం కాదు. గతంలో పలు సందర్భాల్లో ఆయన బతికే ఉన్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. టీవీలో తన చావు వార్తను తానే చూస్తున్నట్లుగా ఒక ప్రభాకరన్ ఫోటో విదేశీ వార్తాసంస్థలకు అందింది. అయితే అది మార్ఫింగ్ ఫోటో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత ఎల్టీటీఈ అనుకూల తమిళ వెబ్ సైట్ కూడా ఇలాంటి వార్తే రాసింది. ప్రభాకరన్్దిగా లంక సైన్యం చూపిన మృతదేహం.. ఓ సైనికుడిదని ప్రకటించింది. అచ్చం ప్రభాకరన్ లా ఉండే ఓ లంక సైనికుడు యుద్ధంలో చనిపోతే అతన్నే ప్రభాకరన్ గా నమ్మించారని చెప్పుకొచ్చింది. ప్రముఖ తమిళనేత వైగో కూడా ప్రభాకరన్ బతికే ఉన్నారని నమ్మారు.

మరిప్పుడు నెడుమారన్ ప్రకటనతో నిజంగా పెద్దపులి బతికే ఉందా అన్న అనుమానాలు రేగుతున్నాయి. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని కొట్టిపారేస్తున్నా… ఆ ప్రకటనను మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు. లంకలోని ఎల్టీటీఈ సానుభూతిపరులు ఇప్పుడు యాక్టివేట్ అయితే పరిస్థితులు ఎలా మారతాయోనన్న ఆందోళన కూడా మొదలవుతోంది. చనిపోయేటప్పటికే ప్రభాకరన్ వయసు 54ఏళ్లు… అంటే ఇప్పుడు బతికుంటే వయసు దాదాపు 68 ఏళ్లు ఉండొచ్చు. ఈ వయసులో మరి ప్రభాకరన్ మరో ఉద్యమాన్ని సృష్టించగలరా…? లంకలోని తమిళుల్లో కొత్త ఆశలు నింపగలరా…? (KK)