Costly KCR : డబ్బు, విలాసాలే కేసీఆర్ కొంప ముంచనున్నాయా..?

పక్క రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగసభలు పెడుతున్నావ్... ? మరి జనసమీకరణకు వాటికి అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తున్నావ్..? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావ్... మరి ఆ సొమ్ములెక్కడివి...? నీ బిడ్డ కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ వెళ్లి వస్తోంది.. మరి దానికెవరు ఖర్చు చేస్తున్నారు..? ఇవి ప్రతిపక్షాలు మాత్రమే సంధిస్తున్న ప్రశ్నలు కాదు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు కూడా...!

  • Written By:
  • Updated On - April 15, 2023 / 06:19 PM IST

కేసీఆర్ అన్ని డబ్బులు ఎక్కడివి…? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇప్పుడు ప్రత్యర్థులు సంధిస్తున్న సూటి ప్రశ్న ఇది. పక్క రాష్ట్రాల్లో కూడా భారీ బహిరంగసభలు పెడుతున్నావ్… ?మరి జనసమీకరణకు వాటికి అంత సొమ్ము ఎక్కడ్నుంచి తెస్తున్నావ్..? స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నావ్… మరి ఆ సొమ్ములెక్కడివి…? నీ బిడ్డ కూడా స్పెషల్ ఫ్లైట్‌లోనే ఢిల్లీ వెళ్లి వస్తోంది… మరి దానికెవరు ఖర్చు చేస్తున్నారు..? ఇవి ప్రతిపక్షాలు మాత్రమే సంధిస్తున్న ప్రశ్నలు కాదు తెలంగాణ సమాజం నుంచి వ్యక్తమవుతున్న సందేహాలు కూడా….!

డబ్బు… డబ్బు…. డబ్బు… ఇప్పుడు రాజకీయమంతా డబ్బు చుట్టూనే తిరుగుతోంది. పైగా ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలన్నీ ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తున్నాయి. తెలంగాణలో మిగిలిన పార్టీల సంగతి పక్కన పెడితే బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్ మాత్రం ఎన్నికలకు భారీ ఏర్పాట్లు చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న బీఆర్ఎస్ అందులో భాగంగా ముందుగా పక్కనే ఉన్న మహారాష్ట్రను టార్గెట్ చేసింది. అక్కడ సభలు పెడుతోంది. ఇక ఏపీలో కూడా సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. ప్లాన్ చేయడం బాగానే ఉంది కానీ… ఒక్క సభకు ఎంత ఖర్చవుతుందో తెలుసా…. దాదాపు 50 కోట్ల రూపాయలు… ఈ రోజుల్లో సభ అంటే అషామాషీ కాదు…. జనం ఖాళీగా ఏం లేరు.. ఇలా రమ్మనగానే ఎగేసుకుని రావడానికి…. పెద్దనోటు చేతిలో పడితే కానీ జనం లారీ ఎక్కడం లేదు.. పైగా బిర్యానీలు కూడా ఇవ్వాలి. సొంత రాష్ట్రంలో అయితే కనీసం అధికారుల సాయంతో కొన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చు… కానీ అసలు బలం లేని పక్క రాష్ట్రంలో సభ పెట్టాలంటే అన్నింటికీ ఖర్చు చేయాల్సిందే. అలాంటిచోట్ల సభ పెట్టాలంటే సగటున కనీసం 50కోట్ల రూపాయల ఖర్చవుతుందన్నది అంచనా. అందులో ఎక్కువ భాగం జన సమీకరణకే ఖర్చు చేయాల్సి వస్తోంది. వందల రూపాయలకు జనం రావడం మానేసారు. ఈ ఎండల్లో సభకు రావాలంటే పెద్దనోట్లు తీయాల్సిందే…

కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్రలో మూడు సభలు నిర్వహించారు. ప్రత్యేక విమానంలో వెళ్లి వచ్చారు. ఆ సభలకు భారీగా జన సమీకరణ కూడా చేశారు. అందుకు అయిన ఖర్చెంత అన్నది పెద్ద ప్రశ్నే. సగటున సభకు 50కోట్లు ఖర్చు చేసారనుకుంటే ఈ సభలకు ఎంతై ఉంటుుందో ఊహించుకోవచ్చు. పోనీ పార్టీలో చేరిన మహారాష్ట్ర నాయకులు ఖర్చు చేశారా అంటే అనుమానమే. బీఆర్ఎస్‌లో చేరిన నేతలు అంత పేరున్న వారు కాదు…. వారు ఇంత ఖర్చు పెట్టారా అంటే అనుమానమే… ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ ఖజానా నుంచే పెట్టి ఉండాలి లేదా బీఆర్ఎస్ నేతలు చేసి ఉండాలి. వేరే వాళ్లు పెట్టి ఉంటే అది ఎవరన్నది చూడాలి. ఇకపై కేసీఆర్ దేశమంతా తిరుగుతానని చెబుతున్నారు. ఏపీ సహా చాలాచోట్ల సభలు పెట్టాలని భావిస్తున్నారు. ఇందుకు అయ్యే ఖర్చు తక్కువేమీ ఉండదు.. వందల కోట్లు పెట్టాల్సి ఉంటుంది. మరి ఇంత ఖర్చు బీఆర్ఎస్ ఎలా భరిస్తుందన్నది ఆసక్తికరమే.. ఆ రాష్ట్రాల్లో బలం ఉండి ఉంటే స్థానిక నాయకులు ఖర్చు చేసారనుకోవచ్చు… ఇప్పుడు ఏపీని తీసుకుంటే వారి ఖర్చుల కోసం ఎదురు పెట్టాల్సి ఉంటుంది.

దేశమంతా పోటీ చేయడం అంటే ఆషామాషీ కాదు.. కొందరు నేతలు బీఆర్ఎస్ తరపున పోటీ చేసి వారి ఖర్చు వారు పెట్టుకోవచ్చు… కానీ మెజారిటీ నేతలకు ఎంతో కొంత పార్టీ సాయం చేయాల్సి ఉంటుంది. మరి దానికి కూడా కేసీఆర్ సిద్దంగానే ఉన్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రాష్ట్రాల్లో భారీగా ఖర్చు పెడితే కానీ ఎంతో కొంత ప్రభావం చూపలేమని తెలుసు.. మరి అంత సొమ్ము కేసీఆర్‌కి ఎక్కడిది..? అంతెందుకు రేపు తెలంగాణలో జరగబోయే ఎన్నికలు చాలా కాస్ట్‌లీ ఎన్నికలు కానున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూడా గట్టిగా పోరాడుతుండటంతో బీఆర్ఎస్ వందలు వేల కోట్లు కుమ్మరించాల్సి ఉంటుంది. మరి కేసీఆర్ ఇప్పటికే ఆ సొమ్మంతా సిద్దం చేసుకున్నారని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తున్నాయి. మరి అంత డబ్బు ఎక్కడిది…?

కేసీఆర్ ఈ మధ్య ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానంలోనే వెళుతున్నారు. వస్తున్నారు. చివరకు ఢిల్లీ వెళ్లినా రెగ్యులర్ విమానంలో వెళ్లడం లేదు.. అంతా ప్రత్యేక విమానమే…ఇక రేపు ఎన్నికల సభలకోసం దేశమంతా తిరగాల్సి వస్తే దానికి కూడా ప్రత్యేక విమానం తప్పుదు. ప్రత్యేక విమానమంటే వేలల్లో రాదుకదా…! పైగా కేసీఆర్ ఒక్కరే కాదు ఆయన ఫ్యామిలీ కూడా ఇటీవల ఎక్కడకు వెళ్లినా స్పెషల్ ఫ్లైట్ తీసుకుంటోంది. లిక్కర్‌స్కామ్‌లో విచారణకు కోసం ఇటీవల రెండుసార్లు కవిత ఢిల్లీకి ప్రత్యేక విమానంలోనే వెళ్లారు. కేసీఆర్, హరీష్‌రావు, సంతోష్‌లతో కలసి తిరిగి వచ్చేటప్పుడు కూడా ప్రత్యేక విమానాన్నే బుక్ చేసుకున్నారు. వాటికి ఖర్చు చేసేంత డబ్బు వీరికి ఎక్కడిదన్నది ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్న.

అధికారంలో ఉండటంతో సహజంగానే కేసీఆర్ ఫ్యామిలీని అందరూ గమనిస్తుంటారు. ప్రతిదీ పరిశీలిస్తుంటారు. కానీ ఇటీవల కేసీఆర్ ఫ్యామిలీ విలాసవంతంగా ఖర్చు చేస్తోందన్న ఆరోపణలున్నాయి. కవిత చేతికి పెట్టుకున్న వాచీ ఖరీదు ఎన్ని లక్షలనేదానిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చే నడిచింది. జనం కూడా దీనిపై అనుమానంగానే చూశారు. ఇప్పుడు కేసీఆర్ ఎన్నికల కోసం చేసే ఖర్చును రాష్ట్రమంతా గమనిస్తుంది. దానికి కేసీఆర్ సమాధానం కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.