Military Rule in Pakistan: పాకిస్థాన్‌లో మళ్లీ మిలిటరీ రూల్? ఏ క్షణమైనా సైనిక తిరుగుబాటు ?

ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పరిస్థితులు దేశాన్ని మిలిటరీ టేకోవర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని, ఏ క్షణమైనా ఇస్లామాబాద్‌లో మిలిటరీ పెరేడ్ నిర్వహించవచ్చని మాజీ ప్రధానమంత్రి షహీద్ ఖాన్ అబ్బాసీ హెచ్చరించారు. పాక్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే సైనిక తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.

  • Written By:
  • Updated On - April 24, 2023 / 02:21 PM IST

Military Rule in Pakistan: సైనిక తిరుగుబాటుకు, మిలిటరీ నియంతృత్వ పాలనకు పెట్టింది పేరైన పాకిస్థాన్‌ మరోసారి సైనిక కబంధ హస్తాల్లోకి వెళ్లపోతుందా? పాక్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి మార్షల్ లా విధించేందుకు అక్కడి సైనిక ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారా? ప్రస్తుతం పాకిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఓవైపు ఆఫ్రికా దేశం సూడాన్‌లో రెండు మిలిటరీ వర్గాల మధ్య ఆధిపత్యపోరు రగులుతూ ఉంటే.. మరోవైపు పాకిస్థాన్ కూడా అదే బాటలో పయనించబోతోందన్న వార్తలు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతున్నాయి.
మాజీ ప్రధాని ఏమన్నారు ?
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పరిస్థితులు దేశాన్ని మిలిటరీ టేకోవర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయని, ఏ క్షణమైనా ఇస్లామాబాద్‌లో మిలిటరీ పెరేడ్ నిర్వహించవచ్చని మాజీ ప్రధానమంత్రి షహీద్ ఖాన్ అబ్బాసీ హెచ్చరించారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న దారుణమైన పరిస్థితుల కంటే మెరుగ్గా ఉన్న సందర్భాల్లో కూడా దేశాన్ని మిలిటరీ కైవసం చేసుకుందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఏక్షమైనా మిలిటరీ పాలన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించకపోతే సైనిక తిరుగుబాటు తప్పదని ఆయన హెచ్చరించారు.
పాక్‌లో నిజంగానే అలాంటి పరిస్థితులున్నాయా ?
ఉగ్రవాదానికి పాలుపోసి పెంచి, ప్రపంచం ముందు తలదించుకున్న పాకిస్థాన్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. ప్రజలు తిండీతిప్పలు లేక అర్థాకలితో అలమటించాల్సిన పరిస్థితులు పాక్‌లో నెలకొన్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో విదేశీ అప్పులు గుదిబండగా మారిపోయాయి. అప్పులు తీర్చలేక దేశానికి దేశమే దివాళా తీసే పరిస్థితి ప్రస్తుతం పాకిస్థాన్‌లో కనిపిస్తోంది. ఓవైపు ద్రవ్యోల్బణం పెరిగిపోవడం.. మరోవైపు పాక్ రూపాయి సన్నగిల్లడంతో పాలకులు ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించలేక సతమతమవుతున్నారు.
నిధులు లేక విలవిల
పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎప్పుడూ లేనంత కనిష్టానికి పడిపోయాయి. ప్రస్తుతం పాక్ వద్ద 4 బిలియన్ డాలర్ల నిధులు కూడా లేవు. దేశాన్ని ఆదుకోవాలంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ ముందు పాక్ పాలకులు చేతులు చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి. 2019లోనే 6.5 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజ్‌ని ఐఎమ్ఎఫ్ ఆమోదించింది. అయితే అది ఇప్పటి వరకు అమలు కాలేదు. దేశం దివాళా తీయకుండా ఏదో ఒకటి చేయాలని ఐఎంఎఫ్‌ను పీఎంఎల్ (ఎన్) వేడుకుంటోంది.
పాలకులు-న్యాయవ్యవస్థ మధ్య కొత్త వివాదం
ఓవైపు దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ప్రజలు రోడ్డున పడుతుంటే వ్యవస్థని సరిచేయాల్సిన ఫెడరల్ ప్రభుత్వం న్యాయవ్యవస్థతో కయ్యానికి దిగింది. పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేసేలా పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ (PML-N) ప్రభుత్వం రూపొందించిన సుప్రీం కోర్టు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ బిల్లు-2023 వివాదాస్పదంగా మారింది. కొన్ని కేసుల్లో ప్రభుత్వమే సూమోటోగా చర్యలు తీసుకునేలా ఉన్న ఈ బిల్లును ప్రతిపక్షాలతో పాటు పాక్ పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేసుల విచారణకు ప్రభుత్వమే న్యాయమూర్తుల ప్యానెల్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా రచ్చకు దారితీసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేసే బిల్లును ఇప్పటికే పాక్ ప్రెసిడెంట్ రెండు సార్లు ఆమోదించకుండా పార్లమెంట్‌కు తిప్పిపంపారు. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది.


పరిస్థితులను మిలటరీ అనుకూలంగా మార్చుకుంటుందా ?
ప్రస్తతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం లాంటి పరిస్థితులను పాకిస్థాన్ ఇప్పటి వరకూ ఎప్పుడు చూడలేదు. పాక్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడటం కూడా కొత్తకాదు. కానీ ప్రస్తుతం పరిస్థితులన్నీ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి ప్రతికూలంగా మారాయి. దీంతో ఇదే అదనుగా పాక్ సైన్యం తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని మాజీ ప్రధాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, పాలనా వ్యవస్థ దారితప్పినప్పడు.. ప్రజలు ప్రభుత్వంతో విసిగిపోయినప్పుడు సహజంగానే మిలిటరీ ఆ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటుంది. దేశంపై పెత్తనం చేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయన్న భయం పాక్ రాజకీయ నేతల్లో ఉంది.
పాకిస్థాన్‌లో మిలిటరీ పాలన కొత్త కాదు కదా..!
పాకిస్థాన్ పేరు వింటే గుర్తుకొచ్చేది రెండే. ఒకటి ఉగ్రవాదం. రెండు సైనిక పాలన. పాకిస్థాన్ స్వతంత్ర్య దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు మిలిటరీ పాలనను చూసింది. రావల్పిండి కేంద్రంగా పాక్ మిలిటరీ.. ప్రజా ప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 1958లో మొదలైన సైనిక తిరుగుబాటు… 2008 వరకు అనేక సందర్భాల్లో కొనసాగింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, డెమొక్రటిక్ సిస్టమ్‌ను కూల్చివేసి సైన్యం పాక్‌పై అవకాశమున్నప్పుడల్లా పెత్తనం చేస్తూనే ఉంది. 1999-2008 మధ్య జరిగిన సైనిక తిరుగుబాటు దేశ చరిత్రలోనే అత్యంత క్రూరమైందిగా చెప్పుకోవచ్చు. ఆ సమయంలో పాక్ మిలిటరీ ఘాతుకాలకు దాదాపు 80వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 1951, 1980, 1995లో కూడా మూడు సార్లు పాక్ మిలిటరీ తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు.
చరిత్ర పునరావృతమవుతుందా ?
పాకిస్థాన్ రాజకీయంగా, ఆర్థికంగా ఓ అస్థిర దేశం. ప్రపంచ దేశాలతో పోటీపడి దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పాక్ పాలకులు ఎప్పుడూ ముందు చూపుతో వ్యవహరించిన పాపానపోలేదు. రష్యా యుక్రెయిన్ యుద్ధ సమయంలోనూ భారత్.. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకుంటే.. పాక్ ఆపని చేయలేకపోయింది. భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తన ప్రయోజనాలను కాపాడుకుందని.. మేమలా చేయలేకపోయామని.. శభాష్ భారత్ అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పటికైనా పాకిస్థాన్ విజ్ఞతతో వ్యవహరించి పరిస్థితిని చక్కదిద్దుకోకపోతే పాకిస్థాన్‌లో చరిత్ర పునరావృతం కావడం ఖాయం. పాక్ మిలిటరీ ఆ సమయం కోసమే గోతికాడ నక్కలా ఎదురుచూస్తోంది.