Rayapati Sambasiva Rao: వైసీపీ వైపు రాయపాటి చూపు.. కన్నాకు చెక్ పెట్టేందుకు వైసీపీ వ్యూహం..?

కన్నాకు, రాయపాటికి మధ్య ఎప్పట్నుంచో విబేధాలున్నాయి. అలాంటిది కన్నాను టీడీపీలో చేర్చుకోవడంపై రాయపాటి ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారడంపై ఆలోచన చేస్తున్నారు. వైసీపీలో చేరి, సత్తెనపల్లి నుంచి కన్నాపై పోటీ చేయాలని రాయపాటి భావిస్తున్నారు. ఈ విషయంపై వైసీపీతో రాయపాటి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Updated On - July 19, 2023 / 12:17 PM IST

Rayapati Sambasiva Rao: టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు రెడీ అయినట్లు కనిపిస్తోంది. కారణం.. బీజేపీ నాయకుడిగా ఉన్న కన్నా లక్ష్మీ నారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసి, టీడీపీలో చేరడమే. కన్నాకు, రాయపాటికి మధ్య ఎప్పట్నుంచో విబేధాలున్నాయి. అలాంటిది కన్నాను టీడీపీలో చేర్చుకోవడంపై రాయపాటి ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఆయన పార్టీ మారడంపై ఆలోచన చేస్తున్నారు.

రాయపాటి సాంబశివరావు 1980 నుంచి రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత. 2019 వరకు రాజ్యసభకు, లోక్‌సభకు ఐదుసార్లు ప్రాతినిధ్యం వహించారు. గుంటూరు, నర్సరావుపేట పార్లమెంట్ స్థానాల నుంచి గెలుపొందారు. గతంలో రాయపాటి కాంగ్రెస్‌లో ఉండేవారు. కన్నా లక్ష్మీ నారాయణ కూడా అప్పట్లో కాంగ్రెస్‌లోనే ఉండేవారు. అప్పటినుంచే వీరిద్దరి మధ్యా రాజకీయ విబేధాలున్నాయి. తర్వాతి కాలంలో రాయపాటి టీడీపీలో చేరారు. కన్నా బీజేపీలో చేరి ఏపీ అధ్యక్ష పదవి చేపట్టారు. దీంతో వేర్వేరు పార్టీల్లో వీరి రాజకీయం సాగింది. అయితే, కొంతకాలానికి కన్నాను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. ఈ కారణంతో బీజేపీకి కన్నా రాజీనామా చేసి, ఈ ఏడాది టీడీపీలో చేరారు. కన్నా టీడీపీలో చేరినప్పటి నుంచి రాయపాటి ఈ నిర్ణయన్ని వ్యతిరేకిస్తున్నారు.

కన్నాకు చంద్రబాబు గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ ఇంఛార్జి బాధ్యతలు అప్పగించారు. అంటే రాబోయే ఎన్నికల్లో కన్నా ఇక్కడి నుంచే పోటీ చేయాలనుకుంటున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం వైసీపీ తరఫున అంబటి రాంబాబు ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతున్నారు. కానీ, వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చే విషయంలో వైసీపీ ఆలోచిస్తోంది. అంబటి రాంబాబును కృష్ణా జిల్లా అవనిగడ్డకు మార్చాలని వైసీపీ భావిస్తోంది. అవసరమైతే మరొకరికి టిక్కెట్ ఇవ్వాలని చూస్తోంది. అందుకే వైసీపీలో చేరి, సత్తెనపల్లి నుంచి కన్నాపై పోటీ చేయాలని రాయపాటి భావిస్తున్నారు. ఈ విషయంపై వైసీపీతో రాయపాటి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా దీనిపై జగన్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. రాయపాటి వైసీపీలో చేరడం దాదాపు ఖాయమే.

కానీ, ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలి అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ అంబటి నియోజకవర్గం మారితే రాయపాటి సత్తెనపల్లి నుంచి పోటీ చేయడం మాత్రం పక్కా. అప్పుడు సత్తెనపల్లిలో కన్నా వర్సెస్ రాయపాటి పోటీ చూడొచ్చు. కాగా, కన్నా టీడీపీలో చేరినప్పుడు రాయపాటి సోదరుడు శ్రీనివాస్.. కన్నా ఇంటికి విందుకు వెళ్లారు. దీంతో కన్నా, రాయపాటి కుటుంబాల మధ్య ఉన్న విబేధాలు తొలగిపోయాయని, ఇద్దరూ కలిసిపోయారని అంతా భావించారు. తీరా చూస్తే ఇప్పుడు కన్నా రాకను వ్యతిరేకిస్తూ రాయపాటి పార్టీ మారుతున్నారు.