తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేని జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అధికార పార్టీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ స్ట్రాటజీలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ కాగా.. ఆలస్యమే లేదు అన్నట్లుగా అసంతృప్తులకు గాలం వేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే కొందరిని పార్టీలో చేర్చుకోగా.. మరికొందరికి కూడా రెడ్ కార్పెట్ పలుకుతూ వెల్‌కమ్ బోర్డ్ పట్టుకొని కనిపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. సిట్టింగ్‌లు ఏడుగురికి తప్ప.. 115స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్‌కు.. రేవంత్ తన మార్క్ ఝలక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రకటించిన స్థానాల్లో కొన్ని మార్పులు చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టిందనే చర్చ జరుగుతోంది. అందులో మల్కాజ్‌గిరి అసెంబ్లీ నుంచి మైనంపల్లి హనుమంతరావు ఎపిసోడ్ ప్రధానంగా వినిపిస్తోంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే కాంగ్రెస్ పార్టీ.. కేసీఆర్ మీద పైచేయి సాధించాలని ప్రయత్నం చేస్తోంది.
ఈ నెలాఖరుకు మొదటి జాబితాను 40 నుంచి 45 మంది అభ్యర్థులతో ప్రకటించాలని కాంగ్రెస్ ముందుగా అనుకుంది. ఐతే ఒకేసారి 119మంది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడానికి ఇప్పుడు కసరత్తు జరుగుతున్నట్లు చర్చ మొదలైంది. కాంగ్రెస్ వార్‌రూమ్ ఇంచార్జిగా ఉన్న శశికాంత్ సెంథిల్, సునీల్ కనుగోలు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే గెలుపు గుర్రాల మీద కాంగ్రెస్ ఒక అభిప్రాయానికి వచ్చేసింది. మూడు రకాల సర్వే రిపోర్టులు అధిష్టానం దగ్గర ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ యువనేత రాహుల్ టీమ్ ఒక సర్వేను చేసింది. ప్రియాంక కోటరీ మరో సర్వేను చేయించిందని టాక్.
రాజకీయ వ్యూహకర్తగా ఉన్న సునీల్, వార్‌రూమ్ ఇంచార్జి సెంథిల్ చేసిన మరో సర్వే కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఉంది. ఆ మూడింటినీ పరిశీలించిన తర్వాత 119స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో వైఎస్ ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. సేమ్ అదే రికార్డ్ క్రియేట్ చేయాలని ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్ల విషయంలో ఇప్పటికే కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి పైచేయి సాధించారు. సిట్టింగ్‌లందరికీ టికెట్ ఇవ్వాలని ఒకసారి.. కేవలం గజ్వేల్ నుంచే పోటీ చేయాలని మరోసారి.. రేవంత్ విసిరిన సవాల్‌ను కేసీఆర్ యాక్సెప్ట్ చేయలేదు. ఈ రెండు విషయాల్లో పైచేయి సాధించిన రేవంత్.. అదే జోష్ ఎన్నికల వరకు కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యారు.