Sasikala: చిన్నమ్మ పనైపోయిందా..? శశికళ దారెటు..?

నిజానికి పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి పళని స్వామిని అప్పుడు సీట్లో కూర్చోబెట్టింది శశికళే.. కానీ ఏకు మేకైనట్లు... పళనిస్వామి నైస్‌గా చిన్నమ్మను లూప్‌లైన్‌లోకి నెట్టేశారు.

  • Written By:
  • Publish Date - February 23, 2023 / 04:23 PM IST

శశికళ…. తమిళనాట అన్నాడీఎంకే వర్గాలకు ఆ మధ్య వరకు చిన్నమ్మ… కానీ ఇప్పుడు ఎవరికీ పట్టని పేరు… జయలలిత (Jayalalitha) బతికున్నప్పుడు చక్రం తిప్పిన చిన్నమ్మ జాతకం అమ్మ చనిపోయాక తల్లకిందులైంది. ఎలాగోలా పార్టీపై పట్టు సాధించాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న శశికళకు (Sasikala) కాలం కలసి రావడం లేదు. ఎలాగోలా పన్నీర్‌సెల్వంను (Pannerselvam) దువ్వి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తే…. ఆ ఆశ కాస్తా సుప్రీం తీర్పుతో అడియాశ అయిపోయింది.

పన్నీర్‌సెల్వం ( OPS), పళనిస్వామి(EPS) వివాదంపై సుప్రీంకోర్టులో సాగిన విచారణ కొలిక్కి వచ్చింది. ఇందులో పళనిస్వామికి (Palaniswamy) అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో పార్టీ పగ్గాలు పూర్తిస్థాయిలో ఈపీఎస్ చేతికి వెళ్లనున్నాయి. పన్నీర్‌ వర్గం ఒంటరైపోయింది. ఓపీఎస్ దగ్గరున్న మిగిలిన నేతలు కూడా త్వరలో ఈపీఎస్ కూటమిలో చేరేందుకు రెడీ అవుతున్నారు. జయలలిత చనిపోయాక పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. పన్నీర్ సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సహసమన్వయకర్తగా వ్యవహరించారు. అయితే ఇద్దరు నేతల మధ్య ఆధిపత్యపోరు పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. దీంతో పళనిస్వామి వర్గం ఏకనాయకత్వం అంశాన్ని తెరపైకి తెచ్చింది. పన్నీర్‌సెల్వం వర్గం వ్యతిరేకత మధ్యే ఎన్నికలు జరిపి పళనిస్వామిని డిప్యుటీ జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. దానిపై పన్నీర్ సెల్వం… హైకోర్టుకు, ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకపోయింది.

ప్రస్తుతం పన్నీర్ సెల్వం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలో పట్టు పోయింది. వెనక మిగిలింది ముగ్గురు ఎమ్మెల్యేలే… ఉన్న కొద్దిపాటి మద్దతుదారులు కూడా ఫిరాయించే యోచనలో ఉన్నారు. జయలలిత అక్రమాస్తుల కేసులో రెండుసార్లు జైలుకెళ్లినప్పుడు పన్నీర్ సెల్వమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. అమ్మ తిరిగిరాగానే సీఎం పదవిని అప్పగించారు. దీంతో పన్నీర్‌ను జయ ఎంతో నమ్మేవారు. జయ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిగా పన్నీర్‌ ఉన్నారు. ఆ తర్వాత అమ్మ మరణం, చిన్నమ్మ జోక్యంతో పదవిపోవడం, జయ సమాధి సాక్షిగా శపథం అన్నీ సాగిపోయాయి. ఆ తర్వాత ఈపీఎస్, ఓపీఎస్ ఏకమై శశికళకు చెక్‌ పెట్టే ప్రయత్నాలు చేశారు. కానీ ఈపీఎస్ చాపకింద నీరులా పాతుకుపోయి పార్టీని గుప్పిట్లోకి తెచ్చుకుని పన్నీర్‌నే తన్ని తగలేసేలా చేశారు. పన్నీర్, శశికళ, దినకరన్ (Dinakaran) తప్ప ఎవరు పార్టీలోకి వచ్చినా చేర్చుకుంటామని పళని వర్గం చెబుతోంది.

పన్నీర్‌సెల్వంను అడ్డుపెట్టుకుని మళ్లీ ఎలాగోలా పార్టీలోకి రీఎంట్రీ ఇవ్వాలని శశికళ ప్రయత్నాలు చేశారు. పన్నీర్ కోర్టు కేసు గెలిస్తే తమవైపు తిప్పుకోవచ్చని చిన్నమ్మ భావించింది. ఇప్పుడు తీర్పు వ్యతిరేకంగా రావడంతో ఏం చేయాలన్న దానిపై ఆమె ఫోకస్ పెట్టారు. ప్రస్తుతానికి అన్నాడీఎంకేలోకి (AIADMK) వెళ్లే దారులు మూసేశారు. కొత్తపార్టీ పెట్టేంత సీన్ లేదు. పోనీ పన్నీర్ పార్టీ పెడతాడా అంటే అదీ సాధ్యం కాదు…దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంది చిన్నమ్మ వర్గం. నిజానికి పన్నీర్ సెల్వంను పదవి నుంచి తప్పించి పళని స్వామిని అప్పుడు సీట్లో కూర్చోబెట్టింది శశికళే.. కానీ ఏకు మేకైనట్లు… పళనిస్వామి నైస్‌గా చిన్నమ్మను లూప్‌లైన్‌లోకి నెట్టేశారు. చక్రం తిప్పుదామనుకుంటే చేతులు కట్టేశారు. ఇప్పుడు కూడా ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలోకి రానిచ్చేది లేదని పళనిస్వామి వర్గం గట్టిగా చెబుతోంది. ఎటు చూసినా శశికళకు దారులు మూసుకుపోయే కనిపిస్తున్నాయి. మరి ఎలాగైనా పార్టీలో చేరి చక్రం తిప్పాలనుకుంటున్న శశికళ ఆశలు ఎలా ఫలిస్తాయో చూడాలి మరి…!

(KK)