Narendra Modi: చంద్రయాన్-3 విజయాన్ని.. బీజేపీ శివశక్తి పేరుతో రాజకీయ మైలేజికి వాడుకుంటుందా..?

దేశ ప్రధాని చంద్రయాన్ 3 అడుగు పెట్టిన ప్రాంతాన్ని శివశక్తి అని నామకరణం చేశారు. దీని వెనుక రాజకీయ వ్యూహం ఇదేనా..

  • Written By:
  • Publish Date - August 26, 2023 / 07:54 PM IST

ఒకప్పుడు తాజ్ మహల్ అద్బుతమైన కట్టడానికి పని చేసిన కూలీలెందరో.. ఆ పాలరాతి కింద పడి నలిగిన చేతులు, వేళ్ళు ఎన్నో అని గొప్పగా చెప్పుకునే వాళ్ళం. దీనికి గల కారణం ఆ నిర్మాణం క్రెడిట్ మొత్తం దానికి పనిచేసిన కూలీలకు ఇచ్చేందుకు ప్రతీకగా భావించాం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అనే సామెతను వాడాల్సి ఉంటుంది. చంద్రయాన్ 3 కి శ్రమించిన శాస్త్రవేత్తలు వందల్లో ఉంటారు. మరి కొందరైతే నిద్రాహారాలు మాని తీవ్రంగా పనిచేసి ఉంటారు. ఒకరైతే తన సొంత చెల్లి పెళ్లికి కూడా వెళ్ళకుండా కష్టపడ్డారు. ఇలాంటి తరుణంలో వీరికి దక్కాల్సిన క్రెడిట్ ని మరెవరో ఎత్తుకు పోతే ఎలా ఉంటుంది. సరిగ్గా అలాగే ఉంది ఇక్కడి రాజకీయం. ఎత్తుకు పోకున్నా వారికి మంచి మర్యాదలు చేస్తూనే మరో వైపు తన పార్టీ మైలేజిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

నరేంద్ర మోదీ బెంగళూరు నుంచి నేరుగా ఢిల్లీ చేరుకుని కార్యకర్తలతో ముచ్చటించారు. ఈ సందర్బంగా చంద్రయాన్ -3 గురించి ప్రస్తావించారు. గత రెండు రోజుల క్రితం చంద్రుడిపై విజయవంతంగా అడుగిడిన ల్యాండర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని వెనుక అనేక రాజకీయ కోణాలు ఉన్నాయని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

శివశక్తి:

చంద్రయాన్-3 అడుగు పెట్టిన  ప్రాంతాన్ని శివశక్తి అని పేరు పెట్టినట్లు తెలిపారు. దీనిని ఇలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశారు. శివ అంటే మంచికి చిహ్నం అని చెప్పారు. అలాగే శక్తి అంటే నారీమణులకు ప్రతీకగా సూచించారు. ఈ రెండు పదాలతో తన భవిష్యత్  రాజకీయాలు చేయనుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. శివ అనే పదం ద్వారా శైవత్వానికి దగ్గరగా ఉండే వారిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. హిందూవాదాన్ని మరింత బలంగా వినిపించేలా పావులు కదుపుతున్నారు అని కొందరు భావిస్తున్నారు. అలాగే భూమి పై హిందుత్వ కార్డును వాడుకొని వర్గ రాజకీయాలు చేసిన బీజేపీ ఇప్పుడు చంద్రుడిపై కూడా మొదలు పెట్టింది అని కొందరు భావిస్తున్నారు.

మహిళలలను శాంతింపజేసే వ్యూహం..

అలాగే శక్తి అనే పదాన్ని తీసుకొని స్త్రీలను కమలం వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు అనేలా పరిస్థితి మారిపోయింది. ఈ గడ్డు పరిస్థితుల్లో ప్రతి ఒక్క గృహిణి బీజేపీ సర్కార్ పై తీవ్రమైన ఆగ్రహంతో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎవరూ బీజేపీకి ఓటు వేసే పరిస్థితి లేదు. మరోసారి తన మాటల చతురతతో మోదీ మహిళా లోకాన్ని ఆకర్షించే వ్యూహంలో భాగమే అని అంటున్నారు. స్త్రీ మూర్తికి ఇంతటి గొప్ప స్థానాన్ని ఇస్తున్నామని.. మహిళలను ఆకాశానికి ఎత్తేస్తూనే భూమిపై ఉన్న కష్టాన్ని మైమరిపించేలా చేస్తున్నారని కొందరి వాదన. నిజంగా మహిళలను ప్రోత్సహించే వారే అయితే దేశంలో జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకట్ట వేసేందుకు సహకరించండి. గతంలో మహిళా రెజ్లర్ల పై దాడులు జరిగినప్పుడు ఏమైంది మీకు ఆ నారీ మణుల పై గౌరవం అని ప్రశ్నిస్తున్నారు.

T.V.SRIKAR