రాజధాని ఇస్తామన్నా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డిని విశాఖ ఓటర్లు నమ్మట్లేదా…? అవుననే అనిపిస్తోంది. అనిపించడమే కాదు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లలో కనిపించింది కూడా. జులైలో విశాఖ వస్తామని జగన్ ప్రకటిస్తే రావాల్సిన అవసరం లేదని ఉత్తరాంధ్ర తీర్పు చెప్పింది.
ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. అదీ అలా ఇలా కాదు భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థిని గెలిపించారు ఉత్తరాంధ్ర ఓటర్లు… దాదాపు ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యం టీడీపీదే…. అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా ఉత్తరాంధ్ర పట్టభద్రుల్ని మాత్రం మెప్పించలేకపోయారు. ఓవైపు అధికారం, మరోవైపు ధనబలం, మరోవైపు పోలీసు సహకారం అన్నీ ఉన్నా వైసీపీ మాత్రం విజయం సాధించలేకపోయింది. ఇది వైసీపీకి రుచించని అంశమే… రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా రాజధానిగా తాము ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విశాఖలో మాత్రం ఓటమి అధికార పక్షాన్ని కలవరపరిచేదే.. అదీ ఎన్నికలకు ఏడాది మాత్రమే మిగిలి ఉన్న సమయంలో ఈ దెబ్బ మామూలుది కాదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచాం కదా అని వైసీపీ చెప్పుకోవచ్చు. కానీ ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో ఏం జరిగిందో, వారంతా ఎలా గెలిచారో అందరికీ తెలిసిందే… కాబట్టి దాన్ని గెలుపుగా పరిగణించాలా వద్దా అన్నది వైసీపీకీ తెలుసు.
అమరావతిని నమ్మని సీఎం జగన్ విశాఖకు రాజధానిని తరలించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అన్నీ కలసి వస్తే ఈపాటికే విశాఖ నుంచి పాలన మొదలు కావాలి. విశాఖ రాజధాని రాకపోవడానికి కారణం ప్రతిపక్షాలే అని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. సాధారణంగా రాజధాని వస్తుందంటే ప్రజలు ఎగిరి గంతేయాలి. కానీ అలా జరగలేదు. ప్రజలు ఎందుకో వైసీపీని విశ్వసించలేదు. విశాఖ ఓటర్ల మద్దతు కోసం వైసీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. చాలాకాలంగా విశాఖ కేంద్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఏ నగరానికీ వెళ్లనన్నిసార్లు విశాఖ వెళ్లారు. గతంలో అక్కడ విశాఖకు మద్దతుగా భారీ ర్యాలీలు నిర్వహించారు. ఇటీవల పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఇంత జరిగినా ఉత్తరాంధ్ర పట్టభద్రులు అధికారపార్టీని దూరంగా పెట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు తేడా ఉండొచ్చు.. ఈ తీర్పు అక్కడ ప్రతిబింబించకపోవచ్చు. కానీ ఈ ఫలితాలను మాత్రం తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఓ వర్గం జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారనడానికి ఇది నిదర్శనం.
వైసీపీని ఎందుకు దూరంగా పెట్టారు అంటే అందుకు చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ ప్రజాప్రతినిధులపై తీవ్ర అసంతృప్తి నెలకొంది. తమకు ఎదురే లేదన్నట్లు ప్రవర్తించడం, ప్రశ్నించిన వారిని వారిని అణచివేయడాన్ని ప్రశాంతతను కోరుకునే ఉత్తరాంధ్ర ఓటర్లు హర్షించలేదు. పైగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి తోడు భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో ఓ ఎంపీ పేరు చెప్పి కొంతమంది కబ్జా ప్రయత్నాలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ట్రస్టుల పేరిట ఉన్న విలువైన స్థలాలను సొంతం చేసుకోవడానికి ప్రయత్నాలు జరగడం కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. అది ఆ నోటా ఈ నోటా అంతా పాకిపోయింది. మళ్లీ వైసీపీ వస్తే ఇక వారిని పట్టుకోలేమన్న ప్రచారం నడిచింది. అదే ఆ పార్టీ కొంపముంచింది. పైగా విశాఖలో విలువైన స్థలాలను రుణాల కోసం తాకట్టు పెట్టడం దెబ్బతీసింది.
గత సాధారణ ఎన్నికల్లోనూ విశాఖ ప్రజలు వైసీపీని నమ్మలేదు. అంత జగన్ సునామీలోనూ టీడీపీనే గెలిపించారు. కానీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రం వైసీపీ ఆధిక్యం కనబరిచింది. కానీ ఇప్పుడు అక్కడా సీన్ మారుతున్నట్లు కనిపిస్తోంది. జనం ఆలోచనల్లో మార్పు ప్రతిబింబిస్తోంది. ఆ ఒక్కచోటే కాదు… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన తూర్పు, పశ్చిమ రాయలసీమల్లోనూ టీడీపీ మంచి ఫలితాలే సాధించింది. మొత్తంగా చూస్తే ఈ ఫలితాలు వైసీపీకి ఓ గుణపాఠం… దీన్నుంచి పాఠాలు నేర్చుకుంటే వచ్చే ఎన్నికలకు పనికివస్తుంది. ఇంతకీ ఈ ఓటమి ప్రభావం ఏ మంత్రిపై పడబోతోందో మరి…!