Top story: మూడో ప్రపంచ యుద్ధం ముంచుకోస్తోందా ? రష్యాపైకి ఉక్రెయిన్ ను అమెరికా ఎగదోస్తోందా ?

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకోస్తోందా ? మూడేళ్లుగా జరుగుతున్న వార్...భవిష్యత్ లో మరింత ప్రమాదకరంగా మారనుందా ? రెండు దేశాల మధ్య యుద్ధం...థర్డ్ వరల్డ్ వార్ కు దారి తీస్తుందా ? రష్యాపైకి ఉక్రెయిన్ ను...అమెరికా ఎగదోస్తోందా ?

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 03:25 PM IST

మూడో ప్రపంచ యుద్ధం ముంచుకోస్తోందా ? మూడేళ్లుగా జరుగుతున్న వార్…భవిష్యత్ లో మరింత ప్రమాదకరంగా మారనుందా ? రెండు దేశాల మధ్య యుద్ధం…థర్డ్ వరల్డ్ వార్ కు దారి తీస్తుందా ? రష్యాపైకి ఉక్రెయిన్ ను…అమెరికా ఎగదోస్తోందా ? రష్యాపై యూఎస్​-మేడ్​ క్షిపణులను ఉక్రెయిన్ ప్రయోగించడంతో…పుతిన్ రగిలిపోతున్నారా ? రివెంజ్ తీర్చుకోవడానికే అణ్వాయుధాల ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా ?

పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఏడాదికిపైగా ఇజ్రాయెల్-హమాస్ వార్ జరుగుతోంది. యుద్దంలోకి తొలుత లెబనాన్, ఆ తర్వాత ఇరాన్ ఎంటరయ్యాయి. ఇజ్రాయెల్-దాని శత్రు దేశాల మధ్య ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నిత్యం బాంబు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరోవైపు రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంతకంతకూ తీవ్రమవుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. ఉక్రెయిన్‌తో యుద్ధంలో వేలాది ఉత్తర కొరియా సైనికులను రష్యా రంగంలోకి దింపింది. ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అనుమతి ఇచ్చింది.

ఉక్రెయిన్‌తో యుద్ధంలో వేలాది ఉత్తర కొరియా సైనికులను రష్యా రంగంలోకి దింపింది. ఈ చర్యపై అమెరికా మండిపడింది. తాము సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రోజు వ్యవధిలో రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్‌ విరుచుకుపడింది. అమెరికా తయారు చేసిన ATACMS క్షిపణులను రష్యా భూభాగాలపై ఉక్రెయిన్‌ ప్రయోగించింది. బ్రియాన్స్క్‌ ప్రాంతంపై ఉక్రెయిన్‌…యుఎస్ మేడ్ మిసైళ్లతో దాడులు చేసింది. వాటిలో 5 మిసైళ్లను ధ్వంసం చేసినట్లు రష్యా ప్రకటించింది. ఒక క్షిపణి మాత్రం బ్రియాన్స్క్‌ ప్రాంతంలోని సైనిక స్థావరంపై పడింది. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అంతకుముందు కరాచెవ్‌లోని లాజిస్టిక్స్ సపోర్ట్ సెంటర్‌పై కూడా…ఉక్రెయిన్ సైన్యం దాడికి తెగబడింది.

అమెరికా నిర్ణయం మూడో ప్రపంచ యుద్ధంవైపు నెడుతుందని…రష్యా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా నిర్ణయంతో గుర్రుగా ఉన్న రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. అణ్వాయుధ ప్రయోగ నిబంధనలను మరింత సరళతరం చేశారు. సవరించిన కొత్త అణు సిద్ధాంతాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆమోదం కూడా తెలిపారు. అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో…ఏ దేశమైనా తమపై దాడి చేస్తే, దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని రష్యా స్పష్టం చేసింది. నాటో, అమెరికా, ఐరోపా దేశాలు నేరుగా యుద్ధంలో పాల్గొన్నట్లే భావిస్తామని పుతిన్‌ ఇంతకు ముందే హెచ్చరించారు. దీంతో పుతిన్ దూకుడు పెంచారు. మెతక వైఖరితో ఉంటే…దెబ్బ తింటామనే ఉద్దేశంతో అణ్వాయుధాల ప్రయోగానికి సై అన్నారు. నాటో సైనిక, సాయుధ సంపత్తిని లక్ష్యంగా చేసుకొని…దాడులు చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. ఇందుకోసం విభిన్నమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది రష్యా. ఈ నేపథ్యంలో రష్యా ఏ క్షణమైనా అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశం ఉండటంతో…ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

21వ శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరాటంగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య నిలిచింది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత ఐరోపాలో చోటుచేసుకున్న అత్యంత భీకరమైన యుద్దం ఇదే. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై మాస్కో దళాలు చేపట్టిన సైనిక చర్య…ఆ దేశంలో భారీ వినాశనానికి దారితీసింది. పరస్పర దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది గాయపడ్డారు. ఉక్రెయిన్‌లో ఎన్నో నగరాలు ధ్వంసమయ్యాయి. అనేక గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. రెండున్నరేళ్లకు పైగా సాగుతున్న ఈ యుద్ధం ఊహకు అందని విషాదాన్ని మిగిల్చింది.