YSRCP – Pawan Kalyan : పవన్ గ్రాఫ్ పెరిగిందా…! వైసీపీ టెన్షన్ అందుకేనా…?

ఏపీలో పొలిటికల్ డైనమిక్స్ మారిపోతున్నాయి. ప్రజల్లో పార్టీల గ్రాఫ్ మారిపోతోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ గ్రాఫ్ పెరిగిపోతోంది. ఇన్నాళ్లూ పవన్‌ను లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు అందుకే కంగారు పడిపోతోందన్నది ఏపీ ఇన్‌సైడ్ పొలిటికల్ టాక్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా.

  • Written By:
  • Publish Date - July 15, 2023 / 06:00 PM IST

ఏపీలో పొలిటికల్ డైనమిక్స్ మారిపోతున్నాయి. ప్రజల్లో పార్టీల గ్రాఫ్ మారిపోతోంది. ముఖ్యంగా జనసేనాని పవన్ గ్రాఫ్ పెరిగిపోతోంది. ఇన్నాళ్లూ పవన్‌ను లైట్ తీసుకున్న వైసీపీ ఇప్పుడు అందుకే కంగారు పడిపోతోందన్నది ఏపీ ఇన్‌సైడ్ పొలిటికల్ టాక్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా.

వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్ రూటు మార్చారు. జోరు పెంచారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను టార్గెట్ చేసి దూసుకెళుతున్నారు. వారాహి యాత్ర తర్వాత పవన్ గ్రాఫ్ పెరిగిందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ సాగుతోంది. ఇది నిజమేనని వైసీపీ పెద్దలకూ ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయి. అదే ఆ పార్టీని కలవరపెడుతోంది. అందుకే వైసీపీ నేతలు పవన్‌పై విరుచుకుపడుతున్నారు.

ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వారాహి యాత్రకు భారీగా అభిమానులు తరలివచ్చారు. 2019లో కూడా ఇలాగే జనం వచ్చినా ఓట్లు పడలేదు. కానీ ఈసారి పరిస్థితి మారింది. అప్పట్లో జగన్‌ను నమ్మిన కాపులు ఇప్పుడు వాస్తవం తెలుసుకున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా కాపు వర్గానికి పవన్ ఇప్పుడు దేవుడిలా కనిపిస్తున్నాడు. కాపు యూత్‌ మొత్తం పవన్ వెనుక నడుస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ కూడా గుర్తించింది. ఇదే ఊపులో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. దీంతో రెచ్చిపోతున్న వైసీపీ కాపు నేతలు పవన్‌పై విరుచుకుపడుతున్నారు. ఓ రకంగా ఇది పవన్‌కే మేలు చేస్తోంది. తమ నేతలతో తమనే తిట్టిస్తున్నారని కాపులు మండిపడుతున్నారు. అంటే వైసీపీ నేతలు ఎంత తిడితే పవన్ గ్రాఫ్ అంత పెరుగుతోందన్నమాట.

కొంతకాలంగా ఏపీలో టీడీపీ సైలెంట్ అయితే జనసేన యాక్టివ్ అయ్యింది. ముఖ్యంగా వార్ అంతా వైసీపీ, జనసేన ఇంకా చెప్పాలంటే వైసీపీ-పవన్ మధ్యే ఉన్నట్లు కనిపిస్తోంది. టీడీపీ అసలు సీన్‌లో లేకుండా పోయింది. చంద్రబాబు సైలెంటయ్యారు. లోకేష్ అసలు సోదిలో లేకుండా పోయారు. దీంతో జనంలో కూడా ఇది వైసీపీ, జనసేన మధ్య యుద్ధంలాగానే కనిపిస్తోంది. పైగా వైసీపీ నేతలు పదేపదే పవన్‌ను టార్గెట్ చేసి తమ శత్రువు టీడీపీ కాదు పవనే అని పరోక్షంగా చెబుతున్నారు.

పవన్ వ్యాఖ్యలు కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటున్నాయి. వైసీపీపైనా, జగన్‌పైనా ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను ఏకవచనంతో సంబోధిస్తున్నారు. పైగా తనను కాపు నేతలతో తిట్టించినా వారిపై మాత్రం స్పందించడం లేదు. పవన్‌ను అడ్డుకోవడానికి ముద్రగడను రంగంలోకి దించి వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆయన ఏం అన్నా పవన్ హుందాగా స్పందించారు. దీంతో కాపుల్లో ఆయనపై గౌరవం మరింత పెరిగింది. ముద్రగడను తన అభిమానులు టార్గెట్ చేసినా వారిని వారించారు పవన్.

వాలంటీర్ల వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు వివాదాన్ని రేపినా ఆయనా అది పవన్‌కే మేలు చేసింది. వాలంటీర్లతో బలవంతంగా ధర్నాలు, నిరసనలు చేయించింది వైసీపీ. అయినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇంత జరిగినా పవన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోలేదు. అవసరమైతే న్యాయపోరాటమైనా చేస్తానని గట్టిగా చెబుతున్నారు. వాలంటీర్ల వ్యవస్థపై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. అధికారపక్షం కార్యకర్తల్లా వారు వ్యవహరించడంతో గ్రామాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలే వీరూ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అందుకే పవన్ వ్యూహాత్మకంగా ఆ అంశాన్ని లేవనెత్తారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఆ రెండు జిల్లాల్లోనే 35 అసెంబ్లీ స్థానాలున్నాయి. విశాఖ జిల్లాలోనూ కాపు వర్గం ఎక్కువే. అందుకే పవన్ తనకు బలమున్న ప్రాంతాలపైనే ఫోకస్ చేశారు. ఈ జిల్లాల్లో సత్తా చాటితే తానే కింగ్ మేకర్ అవుతానని పవన్ భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇకపై కష్టమని పవన్‌కు తెలుసు. అందుకే గట్టిగా పోరాడుతున్నారు. దాని ఫలితమే పవన్ గ్రాఫ్ పెరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపోటములు ఎంత కీలకమో వైసీపీకి తెలుసు. ఈ రెండు జిల్లాల్లో ఓడిపోవడం అంటే అధికారాన్ని కోల్పోవడమే. అందుకే పవన్ మేనియా వైసీపీని కలవరపెడుతోంది.