New Ministers: జగన్ కేబినెట్‌లో ఆ ముగ్గురే కొత్తగా మంత్రులు కాబోతున్నారా…?

2022లో కెబినెట్ విస్తరణ తర్వాత మంత్రివర్గ కూర్పుపై పార్టీలోనే అంత సంతృప్తి లేదు. వారిలో 90శాతం మందికి నెగెటివ్ మార్కులే పడ్డాయి. ఇప్పుడు వారిలో కొందరిని తప్పించాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - March 15, 2023 / 10:01 AM IST

ఏపీలో మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. ఏకంగా కేబినెట్ సమావేశంలోనే పనితీరు బాగోలేకపోతే ఇద్దరు ముగ్గుర్ని మార్చడానికి వెనకాడనని స్పష్టంగా చెప్పేశారు. ఇది వార్నింగ్ కాదని మంత్రివర్గ విస్తరణకు సంకేతమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ జగన్ ఎవరిని తీసేస్తున్నారు… ఎవరికి కొత్తగా అవకాశం ఇవ్వబోతున్నారు..?

మంత్రివర్గంలో ఎలాంటి మార్పులుంటాయన్నదానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎమ్మెల్సీలకే అవకాశం ఉండటంతో ఎవరెవరికి అవకాశం దక్కుతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను తప్పిస్తారన్న ప్రచారం గట్టిగానే సాగుతోంది. ఆయన శెట్టి బలిజ సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో ఆ సామాజికవర్గానికే చెందిన పశ్చిమగోదావరి జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఉండి ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్న కవురు శ్రీనివాస్‌ పేరు తెరపైకి వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ సామాజికవర్గం ఎక్కువ. అందుకే ఆ సామాజికవర్గానికే చెందిన వారికి మంత్రివర్గంలో ఖచ్చితంగా చోటు దక్కుతుంది. దీంతో వేణును తప్పించి కవురు శ్రీనివాస్‌కు చోటు గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది.

మండపేట ఇన్‌ఛార్జ్‌గా ఉన్న తోట త్రిమూర్తులు ఈసారి మంత్రిగా ప్రమాణం చేయడం గ్యారెంటీ అంటున్నారు. మంత్రి అనిపించుకోవాలన్నది ఆయన కల కూడా. దాడిశెట్టి రాజాను తప్పించి తోటకు అవకాశం ఇస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాడిశెట్టి, తోట త్రిమూర్తులు ఇద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారే… అయితే గతేడాది మంత్రిగా ప్రమాణం చేసిన దాడిశెట్టి రాజా తీరుపై సీఎం జగన్ సంతృప్తిగా లేరని చెబుతున్నారు. కాపుల్లో జనసేన బలం పుంజుకుంటున్నా ఆయన గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో ఆయన్ను తప్పించి ఉభయ గోదావరి జిల్లాల్లో కాపుల్లో మంచి పట్టున్న తోట త్రిమూర్తులకు అవకాశం ఇస్తే కాపులను తమవైపే ఉంచుకోవచ్చన్నది సీఎం జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక వేణు, తోట త్రిమూర్తులు నియోజకవర్గాలు పక్కపక్కనే ఉంటాయి. దీంతో త్రిమూర్తులుకు అవకాశం ఇవ్వాలంటే వేణును తప్పించక తప్పని పరిస్థితి.

ఇక చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే మర్రిరాజశేఖర్ జగన్‌కు నమ్మిన బంటు. 2019లో ఆయన తన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎన్నికల ప్రచారంలో మర్రికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని సీఎం జగన్ బహిరంగంగా ప్రకటించారు. మంత్రిగా అవకాశం ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆయనకు అవకాశం ఇస్తే తన మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది. సామాజికవర్గానికి ప్రస్తుత మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చోటు లేదు. ఇప్పుడు మర్రికి అవకాశం ఇస్తే ఆ లెక్క కూడా సరిచేసినట్లవుతుంది. అయితే చిలకలూరిపేట నుంచి గెలిచిన విడుదల రజని మంత్రిగా ఉన్నారు. ఆమెను తప్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇటీవల సీఎం రజనీకి గట్టిగా క్లాస్ పీకారన్న ప్రచారం కూడా సాగింది.

కర్నూలు జిల్లాకు మంత్రి జయరామ్‌పై కూడా కత్తి వేలాడుతోంది. ఆయనపై పలు వివాదాలున్నాయి. ఈఎస్‌ఐ స్కామ్‌లో ఆయన కుమారుడి పేరు వినిపించింది. స్వగ్రామంలో పేకాట ఆడిస్తారన్న అపవాదు ఉంది. అలాగే రైతుల భూములను లాక్కున్నారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆయన బోయ వర్గానికి చెందిన ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆ వర్గానికే చెందిన మంగమ్మకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మరి ఆయన్ను తప్పించి ఆమెకు ఛాన్స్ ఇస్తారా అన్న అనుమానాలూ లేకపోలేదు. ఇక మంత్రైన దగ్గర్నుంచి వివాదాల మధ్య గడుపుతున్న అనంతపురం జిల్లాకు చెందిన ఉషశ్రీ చరణ్ తీరుపై కూడా సీఎం అంత సంతృప్తిగా లేరు. దీంతో ఆమెపై కూడా వేటు పడుతుందా అన్న అనుమానాలున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన మంత్రి జోగి రమేష్‌ పనితీరు కూడా అంతంతమాత్రమే అంటున్నారు. అయితే గౌడ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే ఆయనొక్కరే కావడంతో ప్రస్తుతానికి ఇబ్బంది ఉండకపోవచ్చంటున్నారు.

మొత్తంగా చూస్తే 2022లో కెబినెట్ విస్తరణ తర్వాత మంత్రివర్గ కూర్పుపై పార్టీలోనే అంత సంతృప్తి లేదు. వారిలో 90శాతం మందికి నెగెటివ్ మార్కులే పడ్డాయి. ఇప్పుడు వారిలో కొందరిని తప్పించాలన్నది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. కొంతమంది ఐదారుగురిని తప్పిస్తారని భావిస్తుంటే మెజారిటీ మాత్రం ముగ్గురినే అంటున్నారు. మరి జగన్ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

(KK)