ఏపీలో ఎన్నికలకు ముందు.. వైసీపీ నేతలు నోరు తెరిస్తే.. ఫస్ట్ టార్గెట్ చేసి పవన్ కల్యాణ్‌నే. రాజకీయాలకు పనికిరాడు అని కొందరు.. మూడు పెళ్లిళ్లు అని ఇంకొందరు.. ఇలా పవన్ టార్గెట్‌గా వైసీపీ నేతలు చాలాసార్లు నోరు జారారు. టీడీపీ కంటే ఓ స్టేజీలో జనసేనను, పవన్‌ను టార్గెట్ చేసినట్లు కనిపించారు. మరికొందరు అయితే.. కుటుంబసభ్యులను లాగేసి నోటితో చెప్పలేని.. మాటలు వదిలారు. కట్ చేస్తే.. వైసీపీకి పవన్ దెబ్బ భారీగా పడింది. సేనాని వెనక ఉన్న బలమైన సామాజికవర్గానికి వైసీపీ అనుకోకుండానే శత్రువుగా మారిపోయింది.
తమ పవర్ ఏంటో ఎన్నికల్లో చూపించారు. వీళ్లకు పవన్ ఫ్యాన్స్ తోడయ్యారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు అంటే.. ఇదీ ఓ కారణమే. వైసీపీ అన్న ప్రతీ మాట.. పవన్‌లో పట్టుదల పెంచినట్లు కనిపించింది. అందుకే ముందుండి కూటమిని నడిపించారు. పొత్తులకు దారి చూపించారు. వైసీపీని ఓడించాలనే ఏకైక అజెండాతోనే 2024 ఎన్నికల్లో బరిలోకి దిగి… వైసీపీ గొంతుకలు అన్నీ మూగబోయేలా చేశాడు పవన్. కూటమి దెబ్బకి ఫ్యాన్ పార్టీ కుదేలయింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అంతా అనుకున్నట్లుగా గడిచిన మూడు నెలలలో.. ఎక్కడా జగన్ మీద, వైసీపీ మీద పవన్ కానీ, జనసేన కానీ ఘాటు వ్యాఖ్యలు చేయలేదు.
రాజకీయం అంటే తిట్టుకోవడం కాదు.. అన్నట్లుగా పవన్ వ్యవహరించారు. ఇక అటు వైసీపీ కూడా సేమ్ టు సేమ్. వైసీపీ కూడా గత 3నెలలుగా ఆయనను ఒక్క మాట అంటే ఒక్కమాట కూడా అనడంలేదు. పవన్‌ని ఒక్క మాట అన్నా.. ఆయన వెనక ఉన్న బలమైన సామాజికవర్గం ఎంతలా దెబ్బేస్తుందో వైసీపీకి తెలిసొచ్చిందనే చర్చ జరుగుతోంది. దీంతో జనసేనను పక్కన పెట్టి… వైసీపీ తన రాజకీయాన్ని టీడీపీతో మాత్రమే చేస్తున్నట్టు కనిపిస్తోంది. టీడీపీ కూటమిలో 3 ప్రధాన పార్టీలు ఉన్నా… చంద్రబాబునే వైసీపీ టార్గెట్ చేస్తోంది. వరదల సమయంలో.. పవన్ కనిపించకపోయినా.. వైసీపీ పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసింది. రోజాలాంటి ఒకరో ఇద్దరో వదిలేస్తే.. పెద్దగా ఎవరూ పవన్ పేరు కూడా ఎత్తలేదు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన జగన్.. చంద్రబాబును టార్గెట్ చేశారే తప్ప.. డిప్యూటీ సీఎం ఎక్కడ అని కనీసం ప్రశ్నించలేదు. పవన్ పేరు ఎత్తేందుకే వైసీపీ భయపడుతోందా.. లేదంటే ఇది కొత్త గేమా అనే చర్చ జరుగుతోంది.