YCP – Janasena: జనసేన ట్రాప్‌లో వైసీపీ.. పవన్‌కు జగన్‌ బూస్టింగ్ ఇస్తున్నారా?

ప్రతి చిన్న విషయానికీ పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తోంది వైసీపీ. అయితే ప్రధాన ప్రతిపక్షాన్ని వదిలేసి జనసేనను హైలైట్ చేయడం ద్వారా జగన్ పవన్ కల్యాణ్ ట్రాప్ లో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. జగనే పవన్ కల్యాణ్ ను ఎక్కువగా ఊహించుకుంటున్నారా?

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 07:29 PM IST

యుద్ధం మొదలుపెట్టడం కాదు మ్యాటర్‌.. సరిగ్గా కంటిన్యూ చేయడమే అసలైన టాస్క్ ! రాజకీయాలకు పక్కాగా సరిపోయే మాట ఇది. వ్యూహం కాస్త అటు ఇటు అయినా.. అది బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ విషయంలో అదే జరిగిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. పవన్‌ను టార్గెట్ చేస్తున్న వైసీపీ.. జనసేనకు బూస్టింగ్ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పవన్‌ పావులు కదుపుతున్నారు. పొత్తులకు, ఎత్తులకు తగ్గేదే లే అంటున్నారు. దీంతో వైసీపీ కూడా అదే స్థాయిలో రియాక్ట్‌ అవుతోంది. ప్రతీ విషయంలో సేనానిని టార్గెట్‌ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తోంది.

అప్పుడెప్పుడో విశాఖ ఎపిసోడ్‌ నుంచి.. ఆ తర్వాత చంద్రబాబును కలిసిన వ్యవహారం.. ఆ తర్వాత వారాహి విషయంలోనూ పవన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించింది వైసీపీ. కొందరు నేతలు అయితే ఓ అడుగు ముందుకేసి.. వారాహి ఎలా తిరుగుతుందో చూస్తామంటూ సవాళ్లు కూడా విసిరారు. ఈ మాటలు కూడా పవన్‌కు ప్లస్ అయినట్లే కనిపించాయ్. ఒకప్పటితో పోలిస్తే.. ఏపీలో జనసేన గ్రాఫ్‌ భారీగా పెరుగుతోంది. పవన్‌లోనూ అదే నమ్మకం కనిపిస్తోంది. అందుకే ముందుగా ఓట్లు చీలనిచ్చేది లేదన్న సేనాని.. ఆ తర్వాత ఒక్క చాన్స్ అడగడం మొదలుపెట్టారు. మాములుగానే పవన్ రంగంలోకి దిగితే అటెన్షన్‌ ఎక్కువ ఉంటుంది. జనాల్లో రీచ్‌ ఎక్కువ ఉంటుంది. అలాంటిది సేనాని దూకుడు మీద కనిపిస్తున్నారు. దీంతో పొలిటికల్ ఫోకస్ అంతా జనసేన చుట్టే తిరుగుతోంది. ఈ పరిస్థితికి ఒకరకంగా కారణం వైసీపీనే అనిపిస్తోంది. అప్పుడు వైజాగ్ ఎపిసోడ్‌.. ఆ తర్వాత ఇప్పటం పర్యటన.. ఇప్పుడు వారాహి రంగు.. ప్రతీ విషయంలో వైసీపీ తీరే.. జనసేన హైలైట్‌ కావడానికి కారణం అయింది.

అప్పుడు విశాఖ గర్జన రోజే.. పవన్ వైజాగ్ వచ్చారు. ఆయన్ను హోటల్‌లోనే నిర్బంధించడం.. ఆ హోటల్ చుట్టూ పోలీసులను భారీగా మోహరించడం.. ఈ ఘటనతో జనసేన హైలైట్ అయంది. ఆ తర్వాత ఇప్పటం వ్యవహారంలోనూ వైసీపీ కౌంటర్లతో జనసేనకే పొలిటికల్ మైలేజ్ వచ్చిన పరిస్థితి. ఈ రెండే కాదు.. సినిమాల నుంచి పర్యటనల వరకు.. ప్రతీసారి పవన్‌ను అడ్డుకునేందుకు వైసీపీ సర్కార్‌ ప్రయత్నిస్తోందన్న ప్రచారాన్ని జనసేన జనాల్లోకి తీసుకెళ్లగలిగింది. ఇలా ఒకరకంగా జనసేన ఉచ్చులో వైసీపీ చిక్కుకుందా అనిపిస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల లెక్కల పరంగా చూస్తే.. వైసీపీ సూపర్‌స్ట్రాంగ్‌గా ఉంది. అలాంటిది జనసేనను అలా వదిలేస్తే పోయేది కదా అన్న చర్చ నడుస్తోంది. చంద్రబాబు, పవన్ మధ్య దూరం పెంచే ప్రాసెస్‌లో జనసేనకు జగన్‌ పొలిటికల్‌ మైలేజ్‌ తీసుకువస్తున్నారనే చర్చ నడుస్తోంది. అవకాశం వచ్చినప్పుడు ఊరికే ఉండడాన్ని మించిన ఉత్తమమైన పని లేదు. మౌనంగా ఉండే అవకాశం ఎప్పుడో కానీ రాదు.. అదీ రాజకీయాల్లో అసలే రాదు. ఏమీ మాట్లాడకుండా ఉండడం అనేది గొప్ప అవకాశం. ఆ అవకాశాన్ని వదులుకోవద్దు.. మౌనంగానే ఉండాలి. లేదంటే ఇలా ప్రత్యర్థి పార్టీకి మైలేజ్ ఇచ్చినట్లు అవుతుంది. వైసీపీ చేసినా.. జగన్ చేసినా.. జనసేన విషయంలో ఇప్పుడు అదే కనిపిస్తోంది..