Jagan Master Plan: అమరావతిలో ఇళ్లపట్టాల పంపిణీ.. జగన్ మాస్టర్ ప్లాన్..!

ఇక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే వాళ్ల దగ్గర మంచి పేరు కొట్టేయొచ్చు. పైగా రాజధానిలో స్థలాలిచ్చామని చెప్పుకోవచ్చు. వీళ్లంతా ఓటేసినా చాలు ఈ ప్రాంతంలోని 2-3 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఇదే జగన్ ప్లాన్.

  • Written By:
  • Publish Date - May 27, 2023 / 12:31 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతికి మాత్రమే పరిమితం చేయకుండా సీఎం జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జగన్ అమరావతిపై కక్షగట్టారని.. అందుకే ఇక్కడ రాజధానిని లేకుండా చేయాలనుకుంటున్నారని ఆ ప్రాంతవాసులు ఆరోపించారు. టీడీపీని కాదని వైసీపీని గెలిపించినా కూడా ఇక్కడి ప్రాంత ప్రజలపై వైసీపీ కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. అయితే అమరావతి ప్రజా రాజధాని కాదని, ఇది కమ్మ కులానికి మాత్రమే రాజధాని అని వైసీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. దీంతో ఈసారి అమరావతిలో వైసీపీ దెబ్బతినడం ఖాయమనుకున్నారు. కానీ జగన్ మాత్రం మాస్టర్ ప్లాన్ వేశారు.

వాస్తవానికి అమరావతిని కాదని మూడు రాజధానులను ప్రతిపాదించగానే భూములిచ్చిన రైతులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పెద్దఎత్తున ఉద్యమాలు చేశారు. మరోవైపు ఈ అంశంపై కోర్టును ఆశ్రయించారు. నాడు అమరావతికి మద్దతిచ్చిన జగన్.. ఇప్పుడు ఇలా వ్యవహరిస్తారనుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమకు అమరావతిపై కోపం లేదని, ఇది శాసన రాజధానిగానే ఉంటుందని వైపీసీ నేతలు చెప్పుకొచ్చారు. కానీ వాళ్ల మాటనలను నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరించి ఇక్కడ అభివృద్ధి పనులను ఆపేయడంతో స్థానికులు పూర్తి ఆగ్రహంతో ఉన్నారు.

ఎన్నికలు సమీపిస్తున్నాయ్.. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయ్.. మూడు రాజధానుల నిర్ణయం మేలు చేస్తోందో.. కీడు చేస్తోందో అర్థం కావడం లేదు. సర్వేలు కూడా పరిస్థితి బాగాలేదనే రిపోర్ట్ ఇస్తున్నాయి. దీంతో ఇలాంటి సమయంలో అస్సలు రిస్క్ తీసుకోకూడదని జగన్ భావించారు. అందుకే వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అమరావతిపై జగన్ తీసుకున్న నిర్ణయం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈసారి తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం. అందుకే ఈ ప్రాంతంలో గూడుకట్టుకున్న వ్యతిరేకతను ఎలాగైనా పోగొట్టుకోవాలనుకున్నారు. అందుకే ఇళ్ల పట్టాల పంపిణీతో ముందడుగు వేశారు.

అమరావతి చాలా మందికి కలల రాజధాని. చంద్రబాబు గ్రాఫిక్స్ రూపంలో దీనిపై అమాంతం అంచనాలు పెంచేశారు. దీంతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకోవాలని చాలా మంది అనుకున్నారు. కానీ అక్కడ కొనడం సాదాసీదా మనుషులకు సాధ్యమయ్యేది కాదు. ఇక్కడే జగన్ తన మాస్టర్ మైండ్ అప్లై చేసారు. అమరావతిలో బోలెడు భూమి ఉంది. పైగా ప్రభుత్వ భూమి. అక్కడ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే వాళ్ల దగ్గర మంచి పేరు కొట్టేయొచ్చు. పైగా రాజధానిలో స్థలాలిచ్చామని చెప్పుకోవచ్చు. అందుకే అటు గుంటూరు, ఇటు కృష్ణా జిల్లాలకు చెందిన 50వేల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేశారు. వీళ్లంతా ఓటేసినా చాలు ఈ ప్రాంతంలోని 2-3 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంటుంది. ఇదే జగన్ ప్లాన్.