వైసీపీ అధిష్టానం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భుజాలపై తుపాకీ పెట్టిందా…? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విడకొట్టేందుకు వైయస్ జగన్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా…? కూటమిలో చీలికలు తెచ్చేందుకు జగన్ అండ్ కో తమ వ్యూహాలకు పదును పెడుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత రెండు రోజుల నుంచి వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు చూస్తుంటే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను నానా మాటలన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై సానుభూతి, ప్రశంసలు కురిపించడం చూసి చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కు జాతీయ స్థాయిలో పాపులారిటీ ఉందని… ఎన్డీఏ నాయకులు అందరిలో పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం చాలా బాగుంది అంటూ ఆయన శుక్రవారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రమని 75 ఏళ్ల చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం అని సదరు పోస్టులో విజయసాయిరెడ్డి రాసుకోచ్చారు.
ఇక శనివారం మరో ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు మళ్ళీ తన ఫక్తు రాజకీయ క్రీడలకు తెరతీశాడు అంటూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఆయన ఓ పోస్ట్ రాసుకొచ్చారు. ఈసారి చంద్రబాబు వడ్డించిన చివాట్లు, పరుషమైన దూషణలు, తిట్లు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు… తాజా టార్గెట్ కావడం… అది వారి పుణ్యమో లేక దురదృష్టమో గాని ఇక్కడ గమనించాల్సిన ఆ కీలక శాఖలన్నీ ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ నిర్వహించేవే.
తద్వారా చంద్రబాబు చాలా తెలివిగా నిందను పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా నెట్టివేస్తున్నారు. ఈ తరహా నక్క తెలివితేటలతో ఉపముఖ్యమంత్రి గారి విశ్వసనీయతను దెబ్బతీయటమే ముఖ్యమంత్రి గారి లక్ష్యమని వేరే చెప్పాల్సిన పనిలేదు. పక్కా లెక్కలతో ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తున్న ఈ వ్యూహం చంద్రబాబు మార్క్ రాజకీయం. అంతే కాదు 2014, 2024 ఎన్నికల్లో తన విజయానికి తాను ఏ నాయకుడి జనాదరణ అత్యధికంగా ఉపయోగించుకున్నారో ఆ నాయకుడు పేరు ప్రతిష్టలను మంటగల్పడమే చంద్రబాబు ఎత్తుగడ. భవిష్యత్తులో తన కుమారుడికి ముప్పుగా పరిణమిస్తుంది అనే బలియ శక్తిని అణిచివేయడానికి చంద్రబాబు ఉపయోగిస్తున్న తన ట్రేడ్ మార్క్ వ్యూహం.
ఇది ప్రజలకు అర్థమై ఉంటుంది అంటూ విజయసాయిరెడ్డి శనివారం చేసిన పోస్టులో రాసుకొచ్చారు. వాస్తవానికి వైసీపీ ఘోర ఓటమికి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం. తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోకపోతే వైసీపీ ఈ స్థాయిలో ఓడిపోయి ఉండేది కాదు. వైసీపీ కార్యకర్తలకు కూడా పవన్ కళ్యాణ్ అంటే తీవ్రమైన కోపం ఉంది. గతంలో కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై కూడా అప్పట్లో వైయస్ జగన్ చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.
ఇప్పటికి కూడా జనసేన పార్టీ కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో, ప్రధానంగా కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన కామెంట్ల ఆగ్రహం ఓ రేంజ్ లో ఉంది. అలాంటిది ఇప్పుడు వైసీపీ అనూహ్యంగా పవన్ కళ్యాణ్ పై ప్రేమ కురిపించడం చూసి చాలామంది షాక్ అవుతున్నారు. కూటమీ పార్టీలను విడగొట్టడం ఇప్పుడు వైసీపీ ప్రధాన లక్ష్యం. రాబోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటన కూడా చేశారు.
ఇక పవన్ కళ్యాణ్ కూడా రాబోయే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగాలి అంటూ తన మనోగతాన్ని బయటపెట్టారు. ఇలాంటి టైంలో వైసిపి తన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు నాయుడు ను విడగొట్టేందుకు కూటమిలో ఉన్న విభేదాలను హైలైట్ చేయడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. ఓవైపు జనసేన పార్టీ… వైసీపీని క్రమంగా బలహీనపరిచే ప్రయత్నం చేస్తుంది. వైసీపీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు ను తన వైపుకు తిప్పుకోవడానికి జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు.
వైసీపీలో ఉన్న కీలక నేతలను తన పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే సామినేని ఉదయభాను సహా మరి కొందరు నేతలు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే ఇంకొంతమంది నేతలు కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇది క్రమంగా జగన్ కు ఇబ్బందికర అంశంగానే చెప్పుకోవాలి. అటు షర్మిల తో పవన్ ఓ అంగీకారానికి వచ్చారు అనే కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అందుకే షర్మిల భద్రత విషయంలో తమదే బాధ్యత అంటూ ఆయన ఏలూరు పర్యటనలో భాగంగా ఒక కామెంట్ చేశారు.
ఇవన్నీ అంచనా వేసుకుంటున్న వైఎస్ జగన్… భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను తన వైపుకు తిప్పుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలపై అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలపై ఇప్పుడు వైసీపీ ఎక్కువగా ఫోకస్ పెట్టింది. తాజాగా విజయసాయిరెడ్డి చేసిన పోస్టులో టిడిపి అనుకూల మీడియా వార్తాపత్రిక క్లిప్పును అక్కడ పోస్ట్ చేశారు. ఇక భవిష్యత్తులో జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ కీలకమైన అవకాశం కూడా కనబడుతోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం తీవ్రస్థాయిలో కనపడింది. ఆయన ప్రచారం చేసిన ఐదు నియోజకవర్గాలతో పాటుగా ఇతర నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ ప్రచార ప్రభావం పడింది. దీనితో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా సరే దగ్గర చేసుకునేందుకు జగన్ విజయసాయిరెడ్డిని ప్రయోగించడం మొదలుపెట్టారు జగన్. జగన్ చేసే ఏ కార్యక్రమాలైనా సరే ముందు విజయసాయిరెడ్డి వాటిని భుజానికి ఎత్తుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను తమకు దగ్గర చేసే బాధ్యతను విజయసాయిరెడ్డి తన భుజానికి ఎత్తుకొని పునాదులు వేయటం మొదలుపెట్టారు.
భవిష్యత్తులో ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం కూడా ఉండవచ్చు పవన్ కళ్యాణ్ ను దగ్గర చేసుకుంటే అటు బిజెపి కూడా దగ్గర అయ్యే అవకాశం ఉంటుందనే అంచనాలో జగన్ ఉన్నారు. కాంగ్రెస్ కు షర్మిల ఉండగా దగ్గర కావడం అనేది సాధ్యం కాని పని. తన వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్తుకు బిజెపికి దగ్గర కావడం అనేది జగన్ కు అత్యంత ముఖ్యం. అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డి వెంటనే పని మొదలు పెట్టేసారు. మరి భవిష్యత్తులో కూటమి పార్టీలలో ఏ విభేదాలు వస్తాయో వాటిని వైసిపి ఏ విధంగా వాడుకుంటుందో చూడాలి.