YS Jagan: చంద్రబాబు పరామర్శిస్తుంటే నువ్వేం చేస్తున్నావ్‌ జగన్‌.. అన్నదాతను ఆదుకునే టైమ్ కూడా లేదా..?

ఇదేం కాలమో.. ఇదేం కలకలమో అర్థం కావడం లేదు ఎవరికీ ! రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయనుకుంటే.. అన్నదాతల బతుకులను కూల్చే వానలు పడుతున్నాయ్. వరి పంట కోతకు వచ్చిన సమయం ఇది. కల్లాల్లో ఏవి నీళ్లో, కన్నీళ్లో అర్థం కాని పరిస్థితి. దేవుడిని, బతుకులను తిట్టుకొని.. నీళ్లు నిండిన కళ్లతో ఆశగా ప్రభుత్వం వైపు చూస్తున్నాడు రైతన్న ఇప్పుడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి.

  • Written By:
  • Publish Date - May 4, 2023 / 03:30 PM IST

నమ్మి ఎంచుకున్న నాయకులు వచ్చి ఇప్పటికిప్పుడు ఏదో సాయం చేస్తారని కాదు.. కాస్త ధైర్యం చెప్పకపోరా అనే చిన్న ఆశ పాపం అన్నదాతది ! తెలంగాణ సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం భిన్నంగా కనిపిస్తోంది పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీగా ధైర్యం చెప్పాల్సిన వాళ్లెవరు కనిపించడం లేదు రైతు దగ్గర ! జగన్‌ కరెక్ట్‌ కాదు.. ఇక జగన్‌తో కాదు అని.. చంద్రబాబు రంగంలోకి దిగారు. అన్నదాతలను పరామర్శిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పర్యటనలు చేపడుతున్నారు.

విపక్ష నేతలు క్షేత్రస్థాయిలో రైతులకు అండగా ఉంటే.. జగన్ మాత్రం తాడేపల్లిలో కూర్చొని.. సమీక్షలు చేపడుతున్నారు ఎప్పటిలాగే ! రైతులను ఆదుకుంటామని కామెంట్లు చేస్తున్నారు.. ఇదీ ఎప్పటిలానే ! ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణం అవుతోంది. ఏ పార్టీకి అయినా.. అధికారం దక్కడంలో రైతుల పాత్ర కీలకం. అలాంటి రైతు కష్టాల్లో ఉన్నప్పుడు.. ఓదార్చే సమయం లేదా జగన్ మీకు అని ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు జనాలంతా ! పంటలు చేతికొచ్చిన సమయంలో అకాల వ‌ర్షాలు.. రైతన్న నడ్డి విరిచాయి. మరోవైపు తుఫాన్‌ హెచ్చరికలు.. అన్నదాతను మరింత భయపెడుతున్నాయి. అకాల వర్షాల కారణంగా.. లక్షలాది ఎకరాల్లో పంట‌లు నీటిపాలయ్యాయి. కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి. కోతకొచ్చిన పంటలు నీట మునిగాయి. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దగా మారాయి.

మామిడి, బొప్పాయి, అరటిలాంటి ఉద్యాన పంటలు వేసిన రైతుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. మ‌రికొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న, ప‌సుపు, మిర్చి పంట‌ల‌ు తీవ్రంగా నష్టపోయాయ్. పంటలు నష్టపోయి రైతులంతా ఇబ్బంది పడుతుంటే.. సీఎం జగన్ మాత్రం సమీక్షలకే పరిమితం అవడం.. ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. నష్టపోయిన పంటలను పరిశీలించి.. రైతుల‌ను పరామర్శిస్తే వచ్చే ఇబ్బంది ఏంటి జగన్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయ్. జగన్ తీరు మీద సొంత పార్టీలోనే కన్ఫ్యూజన్ మొదలైంది. అప్పుడెప్పుడో ఎన్నికల ముందు పాదయాత్ర పేరుతో జనాల్లో కనిపించారు. ఈ నాలుగేళ్లలో కనీసం అడ్రస్‌ కూడా లేరు. సభల్లో తప్పితే.. జగన్ బయట కనిపించింది లేదు. అన్ని పనులకు కేరాఫ్‌ తాడేపల్లే అనే మాట వినిపిస్తోంది జగన్ నుంచి.

ఇన్నాళ్లు అంటే వేరు.. ఇప్పుడు ఎన్నికల టైమ్.. దీనికోసం అయినా జనాల్లోకి రావాలి కదా.. అదీ చేయడం లేదు జగన్ మరేంటో! రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ప‌రామ‌ర్శించ‌కుండా ఇంటికే ప‌రిమితం కావ‌డంపై వైసీపీ శ్రేణులు కూడా అవాక్కవుతున్న పరిస్థితి ఏపీలో. రైతు కళ్లల్లో ఆనందం చూశాం.. రైతు సంతోషం కోసమే పాలన సాగిస్తున్నామని చెప్పడం కాదు జగన్.. రైతులకు ధైర్యంగా నిలబడాలి. అన్నదాతకు భయం వేస్తే అండగా కనిపించాలి. అప్పుడే నిజమైన రైతు బాంధవుడు అనిపించుకునేది. తాడేపల్లి దాటి బయటకు రాను. అన్నీ ఇక్కడి నుంచే.. అంతా ఇక్కడి నుంచే అంటే.. అదే తాడేపల్లిని దూరం చేస్తారు జాగ్రత్త అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్ ఏపీ రాజకీయాల్లో.