YS Jagan: తెలుగు రాష్ట్రాల రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పు సంచలనంగా మారగా.. ఇప్పుడు ఏపీకి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌లోపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణతోపాటే ఏపీలోనూ ఎన్నికలు నిర్వహిస్తే తనకు కలిసొస్తుందని జనగ్ భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు సహకరించాల్సిందిగా జగన్ కేంద్రాన్ని కోరబోతున్నారు. దీనికోసమే జగన్ తాజా ఢిల్లీ పర్యటన అని అంచనా.
వైసీపీపై వ్యతిరేకత
నిజానికి ఏపీలో వచ్చే ఏడాదే అసెంబ్లీ, పార్లమెంట్‌కు ఎన్నికలు జరగాలి. అయితే, ఇది జగన్‌కు ఇష్టం లేదు. ఏపీలో వైసీపీపై వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఎన్నికలు ఆలస్యం అయ్యేకొద్దీ మరింతగా ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుంది. అసలే ఏపీ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. రోజులు గడిచే కొద్దీ పథకాల అమలుకు ఇబ్బంది తప్పదు. వచ్చే ఏడాది ఎన్నికల వరకు అయితే.. ప్రజల్లో తిరుగుబాటు రావొచ్చు. పైగా ఈసారి వర్షాభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగానికి ఇబ్బంది. దీన్ని ఎదుర్కోవడం జగన్ వల్ల కాదు. అందుకే అంత వ్యతిరేకత పెరగకముందే ఎన్నికలకు వెళ్తే మంచిదని జగన్ భావిస్తున్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని, ఈ అంశంపై సీఎం జగన్ ఎన్నికల సంఘం అధికారులను కలిశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల చెప్పారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇదే అంచనాతో ఉన్నారు. త్వరలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ విషయంలో జగన్ వేసే ఎత్తుల గురించి పవన్ కల్యాణ్, చంద్రబాబుకు పూర్తి స్పష్టత ఉందని అర్థమవుతోంది. దీనికి అనుగుణంగానే ఇద్దరూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే పవన్ వారాహి యాత్ర ప్రారంభించి, ప్రజల్లోకి వెళ్తున్నారు.
కేంద్రం అనుమతిస్తే చాలు
ప్రస్తుతం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. అక్కడ కేంద్ర పెద్దలను కలిసి కోరుతారు. అసెంబ్లీని రద్దు చేయబోతున్నట్లు, ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నట్లుచి వివరిస్తారు. ఎన్నికలకు సహకరించాల్సిందిగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తారు. గతంలోనే దీని గురించి మోదీ, అమిత్ షాలను అడిగినట్లు తెలిసింది. అటు కేంద్రం.. ఇటు ఎన్నికల సంఘం అనుమతిస్తే జగన్ త్వరలోనే తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం ఖాయం.