జగన్ షర్మిల ఒకవైపు ,…..కేటీఆర్ కవిత మరోవైపు

రాఖీ పండుగ అంటే అందరి ఇళ్లల్లో అన్నా చెల్లెళ్లకు ఒక పెద్ద వేడుక. ఏడాది మొత్తం ఆ రోజు కోసం ఎదురు చూసే కుటుంబాలు లేకపోలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాజకీయ కుటుంబాల్లో మాత్రం ఈ ఏడాది రాఖి అనుకోని విషాదాన్ని నింపింది.

  • Written By:
  • Publish Date - August 20, 2024 / 10:28 AM IST

రాఖీ పండుగ అంటే అందరి ఇళ్లల్లో అన్నా చెల్లెళ్లకు ఒక పెద్ద వేడుక. ఏడాది మొత్తం ఆ రోజు కోసం ఎదురు చూసే కుటుంబాలు లేకపోలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాజకీయ కుటుంబాల్లో మాత్రం ఈ ఏడాది రాఖి అనుకోని విషాదాన్ని నింపింది. ఒకటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం అయితే. రెండోది కేసీఆర్ కుటుంబం.అనూహ్యంగా ఈ ఇద్దరి ఇళ్లల్లోనూ ఈ ఏడాది రాఖీ పండగ జరగలేదు. అందుకు రాజకీయ కారణాలు, వర్గ విభేదాలు, ఆస్తి గొడవలే కారణం.

ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఆయన చెల్లెలు షర్మిల ప్రతి ఏడాది రాఖీ కడుతూ ఉంటారు. అన్న రాజకీయ జీవితంలో ఒకప్పుడు చాలా కీలక పాత్ర పోషించారు షర్మిల. జగన్ జైలుకెళ్లిన నాడు స్వయంగా పాదయాత్ర చేసి జనంలో కావలసినంత సానుభూతిని సంపాదించగలిగారు. ఆయన ముఖ్యమంత్రి అయ్యేవరకు వెన్నంటే ఉండి అన్నను అందలం ఎక్కించారు. కానీ ఆస్తి వివాదాలు, రాజకీయాలు అన్నా చెల్లెలను విడదీసాయి. అన్నకు వ్యతిరేకంగా ఏకంగా పార్టీ పెట్టి, చివరికి దాన్ని కాంగ్రెస్లో విలీనం చేసి… జగన్ ఓటమికి పరోక్షంగా కారణమయ్యారు షర్మిల. ఆస్తి ,రాజకీయ పదవి రెండు ఇవ్వని అన్నని నిత్యం తిట్టిపోసి, జనం దృష్టిలో చులకన చేసి ఓడిపోయేటట్టు చేయగలిగారు షర్మిల. అందుకే ఈ ఏడాది వాళ్ళ ఇంట్లో రాఖీ లేదు. పగలు ప్రతీకారాలతో రగిలిపోతున్న ఆ అన్నా చెల్లెలు కి రాఖీ ఎక్కడి నుంచి వస్తుంది.?

ఇక కెసిఆర్ ఇంట్లో కథ మరో రకం . కెసిఆర్ కుమారుడు, బి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి ఆయన చెల్లెలు కవిత ప్రతి సంవత్సరం తప్పకుండా రాఖీ కట్టేవాళ్ళు. కుటుంబంలో రాజకీయంగా ఎన్ని విభేదాలు, వైరుధ్యాలు ఉన్న పైకి చాలా అనుబంధాలు, ఆప్యాయతలు కనపరిచేవారు అన్నా చెల్లెలు ఇద్దరు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితురాలుగా అరెస్టై ఈ డి ,సి బి ఐ కేసుల్లో తిహార్ జైల్లో ఉన్నారు కవిత. ఇప్పటికే ఆమె జైలుకెళ్లి ఐదు నెలలు దాటిపోయింది. ఈ కేసు లో కవిత బెయిల్ కోసం కేటీఆర్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఫలితం లేదు. ఏడాది రాఖీ పండగ కవిత లేకుండానే అయిపోయింది. ఎంతోమంది పార్టీ మహిళా కార్యకర్తలు కేటీఆర్ కి రెండు చేతుల నిండా రాఖీలు కట్టినా, సొంత చెల్లెలు లేని లోటు ఆయనకి స్పష్టంగా కనిపించింది. చాలా ఆవేదనగా ఈ రాఖీ కి నువ్వు లేవు అంటూ బాధపడుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. ఇలా రెండు రాజకీయ కుటుంబాల్లోనూ ఆడపడుచులు లేకుండానే రాఖీ పండుగ ముగిసిపోయింది. షర్మిల రాజకీయ విభేదాలతో అన్నకు దూరమైతే, కవిత లిక్కర్ స్కామ్ లో జైలుకెళ్ళి సోదరుడికి దూరమైంది. వచ్చే ఏడాది రాఖీ కైనా ఈ చెల్లెలు ఇద్దరు తిరిగి అన్నలను చేరుకుంటారని ఆశిద్దాం.