ఏపీలో చంద్రబాబు సారధ్యంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క కొత్త పథకం కూడా చబాబు సర్కార్ ప్రారంభించలేకపోయింది. తెల్లారి లేచిన దగ్గర్నుంచి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే అజెండా పై ఉంటారు. జగన్ ఐదేళ్లపాటు విధ్వంసం సృష్టించాడని… ఆ విధ్వంసాన్ని సరిదిద్దడానికి చాలా సమయం పడుతుందని ప్రతిరోజు చెప్తూనే ఉంటారు. రాష్ట్రంలో ఏం జరిగినా దానికి జగన్ సర్కార్ చేసిన దారుణాలే కారణమని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ ఉంటారు.
చెప్పిన మాటలే చెప్పి చెప్పి జనం బుర్రల్లోకి ఎక్కించడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు నాయుడు అదే పాత టెక్నిక్ ని మళ్లీ మళ్లీ జనం పై ప్రయోగిస్తున్నారు. శ్వేత పత్రాల పేరుతో జగన్ సర్కారు చేసిన అరాచకాలను చెప్పుకుంటూ మొదటి నెల అంతా గడిపేసారు. అప్పటినుంచి ఏం జరిగినా ప్రతి సంఘటనకు అప్పటి జగన్ సర్కార్ కారణమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ చిన్నాభిన్నం చేసేసాడని, అందువల్లే తాము కొత్తగా ఏమీ చేయలేకపోతున్నామని, ప్రతి రూపాయికి ఆలోచించాల్సి వస్తుందని ఇలా ఏం జరిగినా జగన్ మీదకి నెట్టేయడం మొదలుపెట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.
ఇక మంత్రులు ,ఎమ్మెల్యేల మాట చెప్పనే అక్కర్లేదు. అధినాయకులు ఏం చెప్తారో, ఏం చేస్తారో దానిని తూచా తప్పకుండా అమలు చేసే మంత్రులు ఎమ్మెల్యేలు ….బాబు పవన్ కంటే వేగంగా ….ఓడిపోయి ఇంటికెళ్లిపోయిన జగన్ నీ ఇంకా తిట్టిపోస్తూనే ఉన్నారు. ఎక్కడైనా రేప్ జరిగితే…. దానికి కారణం జగనేనని , జగన్ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని, దాని ఫలితమే ఇప్పుడు రాష్ట్రంలో మానభంగాలు జరుగుతున్నాయని చెప్పుకొస్తారు చంద్రబాబు, ఆయన మంత్రులు. బుడమేరు కి గండ్లు పడి బెజవాడ మునిగిపోతే దానికి కారణం జగనేనని మళ్లీ పాతపాటే అందుకున్నారు టిడిపి జనసేన నేతలు.
జగన్ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేసేసాడని, అతని విధ్వంసానికి భయపడి తనకి ఎవరూ అప్పులు ఇవ్వట్లేదు అని చెప్పుకున్నారు చంద్రబాబు నాయుడు. ఇక బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని గుద్దుకుంటే… ఆ బోట్లు కూడా వైసిపి వాళ్ళవేనని, బ్యారేజ్ ని కూల్చి వేయడానికి జగన్ కుట్ర చేశాడని మరో కొత్త పాట అందుకున్నారు చంద్రబాబు ఆయన మంత్రులు. కొత్త పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అని ఎవరైనా ప్రశ్నిస్తే, జగన్ ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేసేసాడని…. అందువల్లే రూపాయి అప్పు పుట్టడం లేదని, కొత్త పథకాలు ప్రారంభించలేకపోతున్నామని కవర్ చేస్తున్నారు టిడిపి నేతలు. కొత్త పరిశ్రమలు, ఉద్యోగాలు ఎప్పుడు తీసుకొస్తారు అంటే జగన్ కి భయపడిపోయి పెట్టుబడులు పూర్తిగా ఆగి పోయాయని, ఇన్వెస్టర్లకి ఇంకా నమ్మకం కుదరట్లేదు అని అందుకే త్వరగా రావడం లేదని చెప్పుకొస్తున్నారు.
ఏపీలో ఏం జరిగినా దానికి ఎప్పుడో ముగిసిపోయిన జగన్ పాలనే కారణమని చెప్పడం చంద్రబాబు అండ్ టీం కి రోజువారి ప్రాక్టీస్ అయిపోయింది. కానీ ఇక్కడ టిడిపి జనసేన నేతలు మర్చిపోతున్నది ఒకటే. ఈ తప్పుడు పనులన్నీ చేసినందునే జగన్ కి జనం శిక్ష వేశారు. అతనినీ దారుణంగా ఓడించారు.11 సీట్లకు పరిమితం చేశారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రక్షిస్తారు అన్న ఆశతోనే వాళ్లకు చరిత్రలో కనీవినీయరుగని 164 సీట్లు ఇచ్చి అందలం మీద కూర్చోబెట్టారు. అధికారంలోకి వచ్చాక రోజు జగన్ ని తిట్టడానికి, ఆడిపోసుకోవడానికి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ కి జనం అధికారం ఇవ్వలేదు. జగన్ సర్కారులో జరగని అభివృద్ధిని బాబు పవన్ చేసి చూపిస్తారని ఆశతో వాళ్ళకి అధికారం ఇచ్చారు. జగన్ కి చేతకాకే ప్రజాగ్రహానికి గురై, దారుణంగా ఓడిపోయి ఇప్పుడు ఇంట్లో కూర్చొని గోళ్లు గిల్లుకుంటున్నాడు.
జగన్ అరాచకం చేశాడని, ఆర్థిక వ్యవస్థను బ్రష్టు పట్టించాడని, కొత్త ఉద్యోగాలు లేవని, రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని, రాష్ట్రంలో క్రైమ్ పెరిగిందని జనం బలంగా నమ్మారు. అందుకే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని జగన్ని ,వైసీపీని మళ్లీ లేవకుండా పాతాళానికి తొక్కి పడేశారు ప్రజలు. ఆ ఎపిసోడ్ అయిపోయింది. జగన్కు వేయాల్సిన శిక్ష జనం వేసేసారు. అందుకు అర్హుడు కూడా జగన్. జగన్ నీ జనమే శిక్షించిన తర్వాత, ఇప్పుడు మూడు నెలల వరకు చంద్రబాబు పవన్ రోజు జగన్ నామస్మరణ చేయడం ఎంతవరకు సబబు.? జగన్ అండ్ కో పనిచేయలేదు కనుక జనం వాళ్ల నీ ఓడించారు. పాలన ఇస్తారని నమ్మకంతోనే బాబు పవన్ లకు అధికారం ఇచ్చారు.
ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి తప్ప….. ఓడిపోయిన జగన్ ని రోజు తిడుతూ కూర్చుంటే అభివృద్ధి జరుగుతుందా? కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ని నిత్యం తిడుతూ డ్యామేజ్ చేస్తూ అది ఒక నిత్య కార్యక్రమం లా కొనసాగిస్తూ ఈ ఐదేళ్లు ఏమి చేయకుండా కాలం గడిపేయడమే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల ,వ్యూహంలా కనిపిస్తోంది. ఈ ఐదేళ్లు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయరు, ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చరూ. ఒకవేళ జనం నిలదీస్తే జగన్ పై చాడీలు చెపుతారు. అతను రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేశాడని, ఆ వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికి చాలా సమయం పడుతుందని చంద్రబాబు చెప్పుకొస్తారు. ఆయన చెప్పిన మాటల్ని పవన్ కళ్యాణ్ యధావిధిగా తూచా తప్పకుండా వల్లిస్తారు. చంద్రబాబు తన పాత వ్యూహాల్ని మళ్లీ మళ్లీ అమలు చేస్తున్నారు.
2019 నుంచి 24 వరకు ఐదేళ్లు ఏ పనులు చేయకుండానే జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కనుక, దాన్ని చక్కదిద్దే పనిలో ఉన్నానని మాట మార్చేస్తాడు చంద్రబాబు. ఒక్క విషయం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుర్తించాలి. సమర్ధుడు కానందునే, జగన్ని అధికార పీఠం నుంచి కింద పడేశారు జనం. జగన్ పాలన మొత్తం అరాచకమయం కనకే అతనికి మళ్లీ అధికారం ఇవ్వలేదు. చంద్రబాబు సంపదలు సృష్టిస్తాడని, అద్భుతాలు చేస్తాడని, నమ్మి అధికారం కట్టబెట్టారు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయి చంద్రబాబు ఇంకా జగన్ తిట్టడం, జగన్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారంటూ కథలు చెప్పడం, జనానికి వెగటు విసుగు రెండు పుట్టిస్తున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఇప్పటివరకు కొత్తది ఒక్కటి కూడా మొదలు కాలేదు. వృద్ధులకు పెన్షన్లు మాత్రం యధావిధిగా ఒకటో తారీకు ఉదయం అందజేస్తున్నారు. అంతకుమించి మూడు నెలల్లో ప్రభుత్వం ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు.
ఈ దురదృష్టానికి వరదలు రావడంతో దానిపై మరో నెల రోజులు కొట్టుకుపోయింది. చంద్రబాబు, ఆయన వెనకున్న సామాజిక వర్గం మీడియా సంస్థలు మాత్రం చంద్రబాబు గొప్పతనాన్ని వర్ణిస్తూ ఇలాంటి కష్టకాలంలో చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఇంకా ఎన్నికలనాటి ప్రచారాన్ని రిపీట్ చేస్తున్నారు. విశ్లేషకులు అంచనాలు ప్రకారం రాబోయే రెండు మూడేళ్ల వరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా సింగిల్ పాయింట్ అజెండా మీద పనిచేస్తాయి. జగన్ వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడని, వ్యవస్థల్ని బాబు గారు పునర్ నిర్మించే సమయంలో అందరూ అర్థం చేసుకోవాలని ఇలా రకరకాల కాకమ్మ కథ లు వదులుతున్నారు. ప్రతి సంక్షోభాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే చంద్రబాబు ఇప్పుడు కూడా పది రోజుల నుంచి బస్సులోనే ఉంటూ, ఇంటికి కూడా వెళ్లకుండా , చివరికి పెళ్లిరోజు కూడా బస్సులోనే జరుపుకొని జననాయకుడిగా కావలసినంత పేరు తెచ్చుకున్నారు.
బెజవాడ వరదల్లో సర్వం పోగొట్టుకున్న వాళ్ళకి చేయగలిగినంత చేశారు కూడా. దాన్ని కాదు అనలేము. అయితే చేయాల్సింది చాలా ఉంది. చంద్రబాబు ఇవన్నీ వదిలేసి ప్రతి వైఫల్యానికి, ప్రతి సంఘటనకి జగనే కారణం అంటూ గొంతు ఎత్తి అరిస్తే మొదట్లో వినడానికి బాగానే ఉంటుంది. ఆ తర్వాత రివర్స్ అవుతుంది. అది చంద్రబాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. మొదటి ఆరు నెలలు జగన్ చెబుతూ, వైఫై జానకి సంక్షోభానికి జగనే కారణం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేసే ప్రచారం జనం వింటారు. ఆ తర్వాత తిరగబడతారు. ఇదే ఐదేళ్లు కంటిన్యూ అయితే
2029లో ఫలితాలు మారిపోతాయి. ప్రతిసారి …నేనేం చెప్తే అదే వింటారు అదే నమ్ముతారు అని అనుకోవడం అమాయకత్వం. జగన్ అవినీతిపరుడు, చేతకానివాడు, అరాచక వాది జనం గుర్తించారు కనుక చంద్రబాబుని గెలిపించారు. అదే విషయాన్ని చంద్రబాబు పదేపదే జనానికి కృషి చేసిన అవసరం. ఎందుకు గెలిపించారో ఆ పని చేస్తే చాలు.