రాష్ట్ర కాంగ్రెస్‌పై, పెద్దలపై మళ్లీ అసంతృప్తి వెళ్లగక్కారు. గతంలోనూ రేవంత్ టార్గెట్‌గా జగ్గారెడ్డి విమర్శలు చేశారు. ఐతే కాంగ్రెస్ అధిష్టానం సర్దిచెప్పింది. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు కూడా ! ఇప్పుడు మళ్లీ కామెంట్లు మొదలుపెట్టారు. గాంధీభవన్‌లో ప్రశాంతత లేకుండా పోయిందని.. 5నెలలుగా రాలేని పరిస్థితి ఉందని అంటూ జగ్గారెడ్డి చేసిన కామెంట్లు ఇప్పుడు ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయి. ఈ మాటలతో ఓ లేఖ రాసి అధిష్టానానికి పంపించారు కూడా ! ఇప్పటివరకు జగ్గారెడ్డి చేసిన కామెంట్లు వేరు.. ఇప్పుడు ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు వేరు.
ఇది ఎన్నికల కాలం.. ఏ మాట అన్నా కచ్చితంగా కలకలం. ఇప్పటివరకు పార్టీ నేతలతో గొడవపడ్డ జగ్గారెడ్డి.. ఇప్పుడు ఏకంగా అధిష్టానంతోనే లేఖ రాసి గొడవకు దిగడం వెనక రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. తనను వాడుకోవడం చేతకాదు అంటూ లేఖ రాయడం వెనక.. జంపింగ్‌కు సిద్ధం అవుతున్నానని చెప్పకనే చెప్పారా అనే చర్చ జరుగుతోంది. నిజానికి కాంగ్రెస్ నుంచి జంప్ చేసే నేతల లిస్టులో ప్రతీసారి జగ్గారెడ్డి పేరే వినిపించింది. కారణం ఏదైనా ఇప్పటివరకు ఆ జంపింగ్ జరగలేదు అంతే ! ఇప్పుడు అన్నింటికి సిద్ధమై.. జగ్గారెడ్డి.. కాంగ్రెస్ అధిష్టానం మీద ఇలాంటి మాటల యుద్ధం మొదలుపెట్టారా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచినా.. ఓడినా.. జగ్గారెడ్డి బీఆర్ఎస్‌లో చేరడం ఖాయం అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు.. జగ్గారెడ్డి ఆప్తులు. నిజానికి హరీష్‌కు ఇష్టం లేకపోయినా.. జగ్గారెడ్డిని కేటీఆర్ ప్రత్యేకంగా ఆదరిస్తున్నారు. ఇక ఆర్థికంగానూ జగ్గారెడ్డి పరిస్థితి అంతంతమాత్రమే. ఇంకా గట్టిగా చెప్పాలంటే.. చితికిపోయారు ఆయన. ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. వచ్చినా.. రేవంత్ వర్గం జగ్గారెడ్డిని దగ్గరికి రానిచ్చే అవకాశం లేదు.
దీంతో వచ్చే ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలిచినా.. ఓడినా.. గులాబీ పార్టీలోకే వెళ్లిపోతారనే టాక్ నడుస్తోంది. తానే ఎన్నికల ఖర్చు భరించి.. కాంగ్రెస్‌లో కొందరు నేతలను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. ఆలిస్టులో జగ్గారెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎలా చూసినా బీఆర్ఎస్‌లో జగ్గారెడ్డి చేరిక ఖాయం అనే చర్చ నడుస్తోంది.