Jailer: జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. వరుస ఫ్లాప్‌ల్లో ఉన్న రజనీ ఫ్యాన్స్‌కు సినిమా కొత్త ఊపునిచ్చింది. రజనీ స్టైల్ ఫిదా చేస్తోంది ప్రతీ ఒక్కరిని. డార్క్ కామెడీ పొట్ట చెక్కలయ్యేలా చేస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. ఇప్పుడు సినిమా చుట్టూ తెలుగులో కొత్త వివాదం కనిపిస్తోంది. సినిమాలో రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ అయిన రజనీ.. విలన్ రాజా రావుకు ఎలా బుద్ది చెప్పాడు అన్నదే కథ. దీనికి తన మార్క్ కామెడీ యాడ్ చేసి నవ్వులు పూయించాడు డైరెక్టర్ నెల్సన్.
అనిరుధ్ బీజీఎం అదిరిపోగా.. టేకింగ్ కూడా చాలా కొత్తగా, స్టైలిష్‌గా ఉంది. జైలర్ మూవీ సంగతి ఎలా ఉన్నా.. రాజారావు పాత్ర జగన్‌ను ఉద్దేశించే క్రియేట్ చేశారా అనే చర్చ జరుగుతోంది. అవినీతి, కుంభకోణాలు చేసి తీహార్ జైలులో ఉండే రాజారావు.. హీరో ఫ్యామిలీ మీద కుట్రలు చేస్తుంటాడు. ఇది జగన్‌ను ఉద్దేశించే చేశారని.. వైసీపీ వ్యతిరేకవర్గం సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి రజనీ సినిమాలు అంటే వివాదాలకు దూరంగా ఉంటాయి చాలావరకు. ఐతే జైలర్ విషయంలో మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలకు విజయవాడ వచ్చినప్పుడు టీడీపీని, చంద్రబాబును పొగుడుతూ రజనీ మాట్లాడిన తర్వాత వైసీపీ నేతలు రెచ్చిపోయారు. రజనీని టార్గెట్ చేశారు. ఆ వ్యవహారం కూల్ అవుతుంది అనుకునేలోపు.. జైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రజనీ చేసిన వ్యాఖ్యలు రచ్చరేపాయి.
మొరగని కుక్కలేదు.. విమర్శించని నోరు లేదు.. ఇవి రెండూ జరగని ఊరు లేదు.. మనం మన పని చేసుకుంటూ పోతూనే ఉండాలి.. అర్ధమయ్యిందా రాజా అంటూ రజనీ డైలాగులు వదిలాడు. వైసీపీ నేతలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఇప్పుడు రాజారావు పాత్ర జగన్‌దే అంటూ జరుగుతున్న చర్చతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. అంబటి రాంబాబు పాత్రను పోలి ఉండే శాంబాబు పాత్రను బ్రో సినిమాలో క్రియేట్ చేశారని రచ్చ జరుగుతుండగానే.. ఇప్పుడు జైలర్ మూవీ వివాదంలో చిక్కుకోవడం హాట్‌టాపిక్ అవుతోంది.