JANASENA: టీడీపీ, జనసేన పొత్తు ఖరారు.. 2024 వార్‌ వన్‌ సైడ్‌ ఖాయమా..?

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలిసిన పవన్‌.. పొత్తుల మీద క్లారిటీ ఇచ్చారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని.. బీజేపీ కలిసి వస్తుందని అనుకుంటున్నానని.. కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చారు పవన్‌.

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 04:08 PM IST

JANASENA: ఉన్నా లేనట్లు.. ఉంటుందా లేదా అన్నట్లు.. ఇన్నాళ్లు టీడీపీ, జనసేన మధ్య బంధం కనిపించింది. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలంటే.. బీజేపీని ఒప్పించాలి. దానికి బీజేపీ అంగీకరించే పరిస్థితి కనిపించలేదు. మరోవైపు చంద్రబాబు, పవన్‌ దోస్తీ చూస్తే మాత్రం పొత్తు ఖాయం అని సంకేతాలు వినిపించాయి. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నుంచి రకరకాల సంకేతాలు. ఇలాంటి పరిణామాల మధ్య టీడీపీ, జనసేన మధ్య దోస్తీ వ్యవహారంలో ఏమైనా మలుపు చూస్తామా.. అదే మలుపు జగన్‌ గెలుపునకు కారణం అవుతుందా అని రకరకాల చర్చ జరుగుతున్న వేళ.. మొత్తానికి ఓ క్లారిటీ వచ్చింది.

రాజమండ్రి సెంట్రల్‌ జైలులో చంద్రబాబును కలిసిన పవన్‌.. పొత్తుల మీద క్లారిటీ ఇచ్చారు. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని.. బీజేపీ కలిసి వస్తుందని అనుకుంటున్నానని.. కుండబద్దలు కొట్టినట్లు క్లారిటీ ఇచ్చారు పవన్‌. దీంతో 2024 ఎన్నికల యుద్ధం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత.. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు టీడీపీతో పొత్తు వ్యవహారంలో పవన్ ప్రకటనతో.. ఏపీలో 2024 ఎన్నికల్లో వార్ వన్‌సైడ్ కానుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. రెండు పార్టీల పొత్తు ఖరారు కావడంతో వైసీపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ విధంగా ముందడుగులు వేస్తుంది..? అన్నది కూడా మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. అదే సమయంలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే ప్రశ్నకు కూడా జవాబు దొరకాల్సి ఉంది. పవన్ తీసుకున్న నిర్ణయం నెట్టింట్లో హాట్‌టాపిక్‌ అవుతోంది.

టీడీపీ జనసేన పొత్తుకు బీజేపీ అంగీకరించకపోతే.. కమలం పార్టీకి పవన్ దూరం అవుతారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. టీడీపీ, జనసేన ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఎవరు సీఎం అవుతారనే ప్రశ్న కూడా వెంటాడుతూనే ఉంది. చంద్రబాబు, పవన్ చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉంటే బాగుంటుందని.. సోషల్‌ మీడియాలో కామెంట్లు వినిపిస్తుండగా, టీడీపీ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో మరి. ఏపీలో ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా.. పవన్ కళ్యాణ్ ఒక్క మాటతో లెక్కలు మార్చేశారు. ఏయే నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తుందనే ప్రశ్నకు మరికొన్ని రోజుల్లో సమాధానం దొరకనుంది.