పేరుకే పొత్తు.. ఏనాడూ కూడా జనసేనతో కలిసి బీజేపీ అడుగులు వేసింది లేదు. ఇద్దరి కలయిక 2019లోనే జరిగినా ఇప్పటివరకు ఏదో కలిసి ఉన్నామంటే ఉన్నాం అన్నట్టే ఉన్నారు. టీడీపీ-బీజేపీ-జనసేన కలిసి రానున్న ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలన్నది పనవ్ స్ట్రాటజీ. దానికి బీజేపీ ఇప్పటివరకు గట్టిగా ఓకే చెప్పింది లేదు. విషయాన్ని చివరి వరకు నాన్చాలనే ధోరణిలోనే కమలం పార్టీ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మూడు పార్టీలను ఓకే తాటిపైకి తీసుకురావడానికి జనసేనాని చేయాల్సిందంతా చేస్తూ వస్తున్నారు. ఇప్పుడుప్పుడే ఈ పొత్తు ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ కనిపిస్తున్న సమయంలో బీజేపీ నేతల తీరు ఒక్కసారిగా మారిపోయింది. అసలు పవన్‌తో కటీఫ్ చెప్పుకునేందుకు బీజేపీ రెడీగా ఉందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతికి వచ్చారు. బహిరంగ సభలోనూ మాట్లాడారు.. వైసీపీపై విమర్శలు చేశారు..వెళ్లిపోయారు..! వవన్ మాట మాత్రం ఎత్తలేదు…అతని ఊసే రాలేదు..! దీంతో జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందా.. లేదా అన్న అనుమానం వస్తోంది. నిజానికి ఈ ఇద్దరి ఫ్రెండ్‌షిప్ మొదటి నుంచి పేపరపైనే కనిపించింది తప్పా… రియాల్టిలో ఎప్పుడూ కనిపించలేదు. కలిసి పోరాటాలు కూడా చేసింది లేదు. అటు గతంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడుచోట్ల గెలిచింది..బీజేపీ పోటీ చేసి చెల్లని ఓట్లు కంటే తక్కువ ఓట్లు తెచ్చుకుని డిపాజిట్లు కోల్పోయింది. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు..కానీ బీజేపీకి మద్దతూ ఇవ్వలేదు..పరోక్షంగా టీడీపీకి సపోర్ట్ ఇచ్చినట్లు కనిపించింది. దీంతో బీజేపీ రగిలిపోయింది.
అటు ఫస్ట్ నుంచే ఎవరికి వారు సెపరేట్‌గా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా విశాఖ అమిత్ షా సభకు కూడా పవన్‌ను మాట వరుసకైనా పిలవలేదు.. పైగా పిలవలేదన్న విషయాన్ని బయటకు చెప్పారు. బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. జరగబోయేది పూర్తిగా బీజేపీ సభ అని అందుకే పవన్‌ని పిలవలేదని సమాధానం చెప్పాడు. బీజేపీ ఆధ్వర్యంలో జరగబోతున్న బహిరంగసభే కానీ బీజేపీ కార్యవర్గ సమావేశమో లేకపోతే బీజేపీ కోర్ కమిటి మీటింగో కాదు. బహిరంగ సభలకు మిత్రపక్షాల నేతలను ఫార్మాలిటికైనా పిలుస్తుంటారు. బీజేపీ ఆ పని చేయలేదు.. తన పని తాను చేసుకుపోతోంది. తమకేదో ఏపీలో పట్టు ఉందని ఫీల్ అవుతుంది. జనసేన-టీడీపీ లేకుండా బీజేపీ ఒంటరిగా వెళ్తే నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రావు.. మరి పవన్‌ను కమలం పార్టీ ఎందుకు దూరం పెడుతుందో తెలియడం లేదు.. ఇక పవన్ ఎప్పుడో అడిగిన రూట్ మ్యాప్ గురించి ఇప్పటివరకు ఓ క్లారిటీ లేదు. బీజేపీ ఏ మ్యాపూ ఇవ్వలేదు..పవన్ మాటలను అసలు పట్టించుకోలేదు. అందుకే పవన్ కూడా బీజేపీని లైట్ తీసుకుంటూ వస్తున్నారు. విడాకులకు తక్కువ కాపురానికి ఎక్కువ అన్నట్టు ఉంది ఈ రెండు పార్టీల పొత్తు పరిస్థితి.