Pawan Kalyan: సీట్ల పంపకాలపై వచ్చేవారం పవన్-చంద్రబాబు భేటీ..?

రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్.. పోటాపోటీగా చెరో రెండు సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ కార్యకర్తల్లో విబేధాలు పెరిగే అవకాశాలున్నాయి.

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 05:01 PM IST

Pawan Kalyan: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఒకవైపు వైసీపీ అధినేత జగన్.. సిద్ధం అంటూ ఎన్నికల శంఖారావం పూరించారు. మరోవైపు రా.. కదలిరా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి వెళ్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఫిబ్రవరి మొదటివారంలో అనకాపల్లి నుంచి ప్రచారం ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా, టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్‌కు షాక్.. సైఫర్ కేసులో పదేళ్ల జైలు శిక్ష..

అయితే, రెండు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు, పవన్.. పోటాపోటీగా చెరో రెండు సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించేశారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీ కార్యకర్తల్లో విబేధాలు పెరిగే అవకాశాలున్నాయి. అందుకే పొత్తు, సీట్ల సర్దుబాటుపై త్వరగా తేల్చుకోవాలని టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఈ మేరకు ఫిబ్రవరి మొదటివారంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్.. చర్చలు జరపబోతున్నారు. ఇప్పటికే ఇద్దరిమధ్యా జరిగిన చర్చలో సీట్ల విషయంలో ఒక అవగాహనకు వచ్చారు. అయితే, పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏ స్థానాల నుంచి పోటీ చేయాలి వంటి విషయాలపై చర్చించాల్సి ఉంది. చంద్రబాబు, పవన్ ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్నారు. వచ్చే వారంలో రెండు రోజులపాటు సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారు మీదే ఇద్దరూ ఫోకస్ పెట్టనున్నారు. చర్చలు ఒక కొలిక్కి వచ్చిన అనంతరం పవన్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.

సీట్ల విషయంలో స్పష్టత వస్తే.. ఎన్నికల్లో మరింత దూకుడుగా వెళ్లొచ్చు. సీట్ల సర్దుబాటు అనంతరం.. ఉమ్మడి మేనిఫెస్టోపై కూడా చర్చిస్తారు. వచ్చే నెల 4న అనకాపల్లి నుంచి పవన్ రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారు. మరోవైపు.. ఏపీలో సిద్ధం అంటూ జగన్ ప్రచారం ప్రారంభిస్తే.. జనసేన కూడా మేము సిద్ధమే అంటూ కౌంటర్ ఇస్తోంది. జగన్‌ను గద్దె దించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతోంది. టీడీపీ కూడా సంసిద్ధం అంటూ వైసీపీకి కౌంటర్ ఇస్తోంది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ప్రచారం ఊపందుకుంది.