ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. దీంతో పార్టీలన్నీ ఎలక్షన్ మూడ్లోకి వెళ్లిపోయాయి. అధికారంలో ఉన్న వైసిపి ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. టిడిపి, జనసేన, బిజెపి ఇంకా పొత్తులపై క్లారిటీ కి రాలేదు.. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీని ఓడించేందుకు ఎవరితోనైనా కలిసి పని చేసేందుకు సిద్ధమయ్యారు. బిజెపి, టిడిపి, జనసేన కలిస్తే వైసీపీని ఓడించడం ఈజీ. ఇందుకోసం బిజెపిని ఒప్పించేందుకు పవన్ కళ్యాణ్ ఇన్నాళ్లూ గట్టిగా కృషి చేశారు. అయితే బిజెపి హై కమాండ్ నుంచి సానుకూల పరిణామాలు కనిపించలేదు.
బిజెపిని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పుడు బిజెపి జనసేన మధ్య పొత్తు నడుస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే నాలుగైదు సీట్లు కూడా వస్తాయని నమ్మకం లేదు. పైగా ఓట్ల చీలిక వైసిపికి లబ్ధి చేకూరుస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ కు ఎంత మాత్రం ఇష్టం లేదు. వైసీపీని ఓడించాలంటే కచ్చితంగా టిడిపితో వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే బీజేపీని కూడా ఒప్పించి టిడిపి కూటమిలోకి తీసుకొచ్చేందుకు ఎంతో ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. దీంతో బిజెపిని వదిలేసి టిడిపితో కలిసి ప్రయాణం చేసేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమైపోయారు.
ఇటీవల కాలంలో టిడిపి అధినేత చంద్రబాబును పవన్ కళ్యాణ్ మూడు సార్లు కలిశారు. వీళ్ళ మధ్య ప్రధాన చర్చ పొత్తుల గురించే. ఎలాగైనా బీజేపీని కలుపుకుపోయేందుకు రెండు పార్టీలు కృషి చేస్తుంటే కమలం పార్టీ నేతలు మాత్రం బెట్టు చేస్తున్నారు. దీంతో ఇక తమదారుకుతాము చూసుకోవడమే బెటర్ అని టిడిపి, జనసేన అధినేతలు ఒక నిర్ణయానికి వచ్చేసారు. బిజెపి ఒంటరిగా వెళ్తే ఆ పార్టీకే ఎక్కువ నష్టం. కూటమిలో కలిసి వస్తే కొన్ని సీట్లు అయినా గెలిచేందుకు అవకాశం కలుగుతుంది. కానీ బిజెపి అందుకు సిద్ధంగా లేదు. దీంతో ఆ పార్టీని వదిలేసి ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు.
టిడిపితో వెళ్ళొద్దని తమతోనే ఉండాలని పవన్ కళ్యాణ్ కు బిజెపి హై కమాండ్ స్పష్టం చేసింది. తమను కాదని వెళ్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. దీంతో ఇంతకాలం పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేశారు. టిడిపి తో వెళ్లాలా వద్దా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించారు. అయితే బిజెపిని నమ్ముకుంటే మొదటికే మోసం వస్తుందని పవన్ కళ్యాణ్ క్లారిటీకి వచ్చారు. అందుకే బీజేపీని వదిలేసి టిడిపితో కలిసి సైకిల్ తొక్కేందుకు సిద్ధమైపోయారు.