Politics: జనసేన, టీడీపీ పొత్తులు.. పైఎత్తుల లెక్కలు ఇవేనా..?

బీజేపీకి జనసేన బైబై చెప్పింది. అంతా అయిపోయిందని కమలం పార్టీ నేతలు పవన్ మీద ఘాటు మాటలు కూడా వదులుతున్నారీ మధ్య ! అనౌన్స్‌మెంట్‌ రాలేదు కానీ.. టీడీపీతో పొత్తులో ఉన్నట్లే ఇప్పుడు ! ఎవరు ఎన్ని.. ఎవరికి ఎన్ని అని.. రెండు పార్టీల మధ్య సీట్ల లెక్కలు కూడా మొదలైనట్లు కనిపిస్తోంది సీన్ ! పవన్‌ 50 అడుగుతున్నారు.. చంద్రబాబు 20 ఇస్తా అంటున్నారు.. అక్కడ పడింది లాక్ !

  • Written By:
  • Publish Date - March 24, 2023 / 09:30 PM IST

ఇప్పట్లో తేలుతుందా ఏం జరుగుతుందనే చర్చ మొదలైంది చాలామందిలో! మరోసారి బలిపశువు అయ్యేది లేదని.. అటు బీజేపీకి, ఇటు టీడీపీకి ఆవిర్భావ దినోత్సవ వేదికగా రెండుపార్టీలకు ఒకేసారి మెసేజ్ పంపారు పవన్. ఇన్ని రోజులు చంద్రబాబు చెప్పినట్లు ఆడిన సేనాని.. ఇప్పుడు మాత్రం తాము కోరినన్నీ సీట్లు ఇవ్వాలి.. కోరిన సీట్లు ఇవ్వాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. 50 స్థానాలకు తగ్గేది లేదని అంటున్నా. ఐతే జనసేనకు కేవలం 15 సీట్లు మాత్రమే కేటాయించి.. గెలిస్తే ఎమ్మెల్సీ స్థానాల రూపంలో ఆ పార్టీకి అవకాశం కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఐతే పవన్‌ మాత్రం ఆ విషయంలో చాలా వ్యతిరేకతో ఉన్నారని టాక్.

తమకు కనీసం 50సీట్లు కేటాయించి తీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేస్తున్నారన్నది అంతర్గత టాక్. ఈ నంబర్ వెనక ఎవరి లెక్క వారికి ఉంది. గతంతో కంపేర్ చేస్తే జనసేనకు ఓటు బ్యాంక్ పెరిగింది. 7 స్థానాలు ఖాయంగా గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్నాయ్. ఉభయ గోదావరి జిల్లాల్లో మినహా.. ఏ జిల్లాలోనూ పెద్దగా ప్రభావం ఉండదని నివేదికలు చెప్తున్నాయ్. అలాంటి పార్టీకి 50 సీట్లు కేటాయిస్తే.. రిస్క్‌కు రెడ్‌ కార్పెట్ వేసినట్లే అన్నది టీడీపీ ఆలోచన. అందుకే 15 నుంచి 20 సీట్లు ఇచ్చేందుకు.. ఆ మాటకు ఒప్పించేందుకు సైకిల్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఐతే జనసేన వాదన మాత్రం ఇంకోలా ఉంది.

2019 ఎన్నికల్లో చాలాచోట్ల వైసీపీ గెలిచిన మెజారిటీ కంటే.. జనసేనకు పోలైన ఓట్లే ఎక్కువ! 2019 ఎన్నికల్లో జనసేన 9శాతం ఓట్ షేర్ సాధించింది. ఇప్పుడు అది 12శాతానికి పెరిగిందని ఆ పార్టీ నమ్మకం. ఒంటరిగా పోటీ చేసినా కనీసం 20స్థానాల్లో గెలుస్తామని… అందుకే పొత్తులో కనీసం 50సీట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తోంది. ఐతే ఇప్పటికిప్పుడు పవన్‌ కింగ్‌ కాకపోయినా.. కచ్చితంగా కింగ్‌మేకర్ అవుతాడు ! యువత ఓట్ల లెక్కలు చూసుకున్నా.. కాపు సామాజికవర్గ ఓటర్ల లెక్క తీసుకున్నా.. అదే ప్రూవ్ చేస్తోంది. పవన్‌ను టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకునే అవకాశం లేదు. అండ ఉంటే కొండైనా దాటొచ్చు అంటారు.

వైసీపీని ఓడించడమే లక్ష్యంగా సాగుతున్న రెండు పార్టీలు.. ఒకరికొకరు అండగా నిలవాలి. దీంతో 35 నుంచి 40 సీట్లు జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధం అయిందని తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఎన్నికల ఖర్చు అంతా సైకిల్ పార్టీ భరించేందుకు సిద్ధం అవుతోంది. రెండు పార్టీలు ఈ నిర్ణయానికి దాదాపు స్టిక్ అయినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఫలితాలతో ఇప్పటికే టీడీపీలో కాన్ఫిడెన్స్ నింపగా.. ఇప్పుడీ పొత్తుల వ్యవహారం కూడా దాదాపు ఫైనల్ కావడం.. రెండు పార్టీల్లోనూ జోష్‌ కనిపిస్తోంది.