Janasena Song: జగన్‌ను ఏకిపారేసిన జనసేన పాట.. సోషల్ మీడియాలో వైరల్!!

వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ లక్ష్యంగా "సారు.. ఓ సీఎం సారూ" టైటిల్ తో ఒక పాటను స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ఒకే ఒక్క రోజులో 1.50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక యూట్యూబ్ ఛానల్ లో "సారు.. ఓ సీఎం సారూ" పాటకు మొదటి 19 గంటల్లోనే 73వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

  • Written By:
  • Publish Date - August 12, 2023 / 01:00 PM IST

జనంలోకి చొచ్చుకెళ్లేందుకు, జగన్ సేనను టార్గెట్ చేసేందుకు పాటల అస్త్రాలను జనసేన సంధిస్తోంది. ఈక్రమంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం, వైఎస్సార్ సీపీ చీఫ్ జగన్ లక్ష్యంగా “సారు.. ఓ సీఎం సారూ” టైటిల్ తో ఒక పాటను స్వయంగా జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. పాట రిలీజ్ కు సంబంధించిన ఒక వీడియోను ఆయన జనసేన ట్విట్టర్ పేజీ వేదికగా పోస్ట్ చేశారు. ల్యాప్ ట్యాప్ ముందు కూర్చొని.. ఆ పాటను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ శ్రద్ధగా వింటున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. ఈ పోస్ట్ కు ట్విట్టర్ లో ఒకే ఒక్క రోజులో 1.50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇక యూట్యూబ్ ఛానల్ లో “సారు.. ఓ సీఎం సారూ” పాటకు మొదటి 19 గంటల్లోనే 73వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.

పవర్ స్టార్ భావజాలాన్ని ప్రతిబింబించేలా..

“సారు.. ఓ సీఎం సారూ” పాటలోకి వెళితే.. అందులోని లిరిక్స్ ఎంతో పవర్ ఫుల్ గా పవర్ స్టార్ భావజాలాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. సీఎంగా ఉన్న జగన్ ను గట్టిగా నిలదీయడం.. అవినీతిపై కడిగిపారేయడం.. పేదల కష్టాలు కన్నీళ్లను ఎత్తిచూపడం అనే థీమ్ తో ఈ పాట సాగుతుంది. ప్రాస పదాలను జబర్దస్త్ గా, నేచురల్ గా పాటలో ఇమిడిపోయేలా ప్రయోగించారు. “ముందు నుంచి ముద్దులొద్దురో సీఎం సారు.. వెనక నుంచి గుద్దులొద్దురో జగన్ సారు..” అనే ప్రయోగం వినసొంపుగా జోష్ తెచ్చేలా ఉంటుంది. సీఎం జగన్ ఆత్మీయతతో ప్రజలపై ముద్దుల వర్షం కురిపించి.. తీరా ఎన్నికల్లో గెలిచాక ఆ ఆత్మీయతను మర్చిపోయారనే సందేశాన్ని జనంలోకి పంపేలా ఈ లైన్ ఉంది.
“రాయలసీమ గుండె పగిలి రగులుతుందిరా.. కోనసీమ కళ్లెర్ర చేసుకుందిరా.. ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున ఉడికిపోయెరా..” అంటూ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఈ పాటలో ప్రాతినిధ్యం కల్పించే ప్రయత్నం చేశారు. తద్వారా ఆయా ప్రాంతాల జనసేన క్యాడర్ స్థానికంగా ఎన్నికల ప్రచారానికి వాడుకునేటందుకు అనుగుణంగా ఈ పాటలోని పదాలను ఏర్చి కూర్చారు.

నిన్ను నమ్ముకుంటే అమ్ముకుంటివో…

“సారూ.. ఓ సారూ.. సారూ సీఎం సారూ.. నిన్ను నమ్ముకుంటే అమ్ముకుంటివో ఓ సీఎం సారూ.. అడుగుతుంటే నవ్వుతున్నవో.. ఓ జగన్ గారూ. మా సొమ్ము దోచుకున్న నీకు ఉన్న ఇళ్లు ఎన్ని ? బాధలెన్నో పెట్టి నువ్వు కొన్న భూములెన్ని ? మా కడుపుకొట్టి కూడబెట్టుకున్న ఆస్తులెన్ని ? నిన్ను నమ్ముకొని ఓటువేస్తిమో సీఎం సారూ.. తాచుపాములాగ కాటు వేస్తివో జగన్ గారు. చేసినము పొరపాటురో.. సీఎం సారు.. దించినావు పెద్ద పోటురో జగన్ గారు. రాయలసీమ గుండె పగిలి రగులుతుందిరా.. కోనసీమ కళ్లెర్ర చేసుకుందిరా.. ఉత్తరాంధ్ర ఉవ్వెత్తున ఉడికిపోయెరా.. కంటికి కనబడ్డవంటెరో ఓ జగను సారు.. ఇంటికి నిను పంపిస్తమురో ఓ సీఎం సారు. కంటపడితే వెంటబడతము ఓ సీఎం సారు.. ఇంటికి నిను పంపిస్తమురో ఓ సీఎం సారు. నీ పథకమొద్దు పాడు వద్దు.. పిచ్చిలేపె పనులు వద్దు.. నువ్వొద్దు నీపాలన అసలే వద్దు ఛల్.. ముందు నుంచి ముద్దులొద్దురో సీఎం సారు.. వెనక నుంచి గుద్దులొద్దురో జగన్ సారు.. ’’ అంటూ పాట సాగింది.