జనసేనకు 35శాతం ఓటింగ్ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయ్. అనకాపల్లి జిల్లాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నాగబాబు.. నాలుగేళ్లలో పార్టీ ఎదుగుదలపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన ఏడు శాతం ఓటింగ్ సాధించగా.. అది కాస్త ఇప్పుడు 35 శాతానికి పెరిగిందన్నది నాగబాబు అంచనా. అంటే ఏకంగా 5రెట్లు బలం పెరిగిందన్నమాట. కరోనా రెండేళ్లు తీసేస్తే.. మిగిలిన ఈ రెండేళ్లలోనే పార్టీ బలం 5రెట్లు పెరగడం ఎలా సాధ్యమైందన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. నాగబాబు లెక్కల ప్రకారం గడిచిన సమయం.. పెరిగిన ఓటింగ్ శాతం లెక్కలేసుకుంటే.. ఎన్నికల నాటికి జనసేన బలం 45శాతానికి పెరుగుతుంది. అదే జరిగితే ఏపీలో జనసేనదే అన్నమాట.
దీని చుట్టే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జోకులు పేలుతున్నాయ్. జనసేన.. తనను తాను ఎక్కువ ఊహించుకుంటుందనే చర్చ జరుగుతోంది. ఇలా అనుకునే.. నాలుగేళ్ల కింద జరిగిన ఎన్నికల్లో సింగిల్‌గా బరిలోకి దిగి.. సింగిల్ స్థానంలో మాత్రమే విజయం సాధించి బొక్కాబోర్లాపడింది. పవన్, జనసేన ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తున్నారా అనే డిస్కషన్ నడుస్తోంది. ఒక్కటి మాత్రం నిజం.. గతంతో కంపేర్ చేస్తే జనసేన బలం పెరిగింది. సర్వేలు చెప్తోంది కూడా అదే. 7 శాతం నుంచి 12శాతానికి అటు ఇటుగా జనసేన బలం పెరిగిందని సర్వేలు చెప్తున్నాయ్. ఐతే నాగబాబు మాత్రం ఏకంగా 35శాతానికి పెరిగిందని కామెంట్ చేయడం.. జనసేన ఓవర్ కాన్ఫిడెన్స్‌కు నిదర్శనంగా కనిపిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్.
2019 తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ జనసేన కనిపించలేదు. మరి ఏ ఓటర్‌ను లెక్కలేసుకొని జనసేన బలం 35శాతానికి పెరిగిందని చెప్తున్నారనే విషయం నాగబాబుకే తెలియాలి మరి! క్షేత్రస్థాయిలో బలం లేదు.. ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఐనా సరే ఓటింగ్ శాతం 35శాతానికి పెరిగిందంటే.. ఆ సీక్రెట్ ఏందో చెప్పరాదు నాగబాబు అని సెటైర్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇలాంటి అర్థంలేని లెక్కలు వేసుకోవడం.. ఆ తర్వాత అడ్డంగా బుక్ కావడం.. జనసేనకు కొత్తేం కాదు. 2019 ఎన్నికల్లోనూ అదే జరిగింది. తనను తాను ఎక్కువగా ఊహించుకున్న పవన్.. టీడీపీతో పొత్తుకు బ్రేకప్ చెప్పారు.
అసలు బలమే లేని కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నారు. కట్ చేస్తే బొప్పి కడితే జండూబామ్ కూడా రాసే వారు లేకుండా పోయారు. ఇప్పుడు కూడా పవన్, జనసేన అదే తప్పు చేస్తోందా.. తనను తాను ఎక్కువ ఊహించుకుంటోందా అంటే.. నాగబాబు లెక్కలు చూస్తుందే అదే అనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. పవన్, నాగబాబు.. ఇంకా ఎవరైనా సరే ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రకటనలు చేస్తే నవ్వులపాలు కావడం ఖాయం. నిజాయితీగా ఉన్న బలాన్ని చెప్పుకుంటేనే అనుకున్నలక్ష్యాన్ని చేరుకుంటారని మరికొందరు సలహా ఇస్తున్నారు. మరి ఏమో.. నిజంగా బలం 35శాతానికి పెరిగిందేమో.. ఫలితాలే అది చెప్తాయేమో ! అదే జరిగితే.. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటో అడిగేందుకు జనసేన పార్టీ ఆఫీస్ ముందు భారీ క్యూలు కనిపిస్తాయన్నది మాత్రం క్లియర్.