Janasena Vs Ambati Rambabu: జనసైనికులు తగ్గట్లేదు.. మంత్రి అంబటి రాంబాబును అస్సలు వదలట్లేదు..! మంత్రి ఒకటి అంటుంటే.. జనసైనికులు నాలుగు అంటున్నారు. ప్రెస్‌మీట్ పెట్టి మరీ పవన్‌పై సినిమా తీస్తానని అంబటి ప్రకటిస్తే.. అయితే కాస్కో అంటూ రాంబాబుపై పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా సినిమాకు క్లాప్ కూడా కొట్టారు. జససైనికులు విడుదల చేసిన పోస్టర్ ఇది. మంత్రి అంబటి రాంబాబు పవన్‌పై సినిమా తీస్తానంటూ నాలుగైదు టైటిళ్లు ప్రకటిస్తే.. జనసేన వాళ్లు ఏకంగా పోస్టర్ వదిలేశారు.
అంతేకాదు సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అంబటి లాగా మేకప్ చేసి ఓ నటుడితో డ్యాన్స్ కూడా చేయించారు. టైటిల్ సందులో సంబరాలు శాంబాబు@ రాంబాబు- SSS అంటూ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జనసైనికులు. జగ్గూబాయ్ సమర్పించు అంటూ ఆయన పేరు కూడా లాగేశారు. అంతేకాదు దానికి ప్రొడక్షన్ నెంబర్ 6093 అని పెట్టారు. ఇంతకీ ఈ నెంబర్ ఏంటా అని ఆరా తీస్తే అప్పట్లో చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు జగన్ ఖైదీ నెంబర్ ఇది. జనసైనికుల ఊపు చూస్తుంటే మరింత క్రియేటివిటీతో మంత్రిని ఏకేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రెచ్చిపోతున్న జనసైనికులు.. అబంటిపై పోరును మరో మెట్టు పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక జనసేన నేత పోతిన మహేష్ అయితే అంబటిని టార్గెట్ చేస్తూ కొన్ని టైటిళ్లు కూడా ప్రకటించారు. అద్దెగదిలో అరగంట, తల్లి.. చెల్లి.. ఖైదీ నెంబర్ 6093, డ్రైవర్ డోర్ డెలివరీ, కోడి కత్తి సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి మధ్యలో ఇసుక దిబ్బలు ఇలా పలు టైటిళ్లను చూపించారు.
బ్రో సినిమాలో అంబటి రాంబాబును పోలిన శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టడంపై వివాదం రాజుకుంది. సంక్రాంతి సంబరాల్లో అంబటి డ్యాన్స్ చేసినప్పుడు వేసిన డ్రస్‌నే 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీకి వేయించారు. అంతేకాకుండా నెక్స్ట్ సెక్స్ అన్న డైలాగ్ కూడా ఉంది. దానిపై పవన్ కామంట్ అంబటిని కిర్రెక్కించింది. నన్ను టార్గెట్ చేశారంటూ మంత్రి పవన్‌పై విమర్శలు గుప్పించారు. పవన్ పెళ్లిళ్లను ప్రస్తావించారు. రెమ్యునరేషన్ ఎంత, బ్రో బడ్జెట్ ఎంత అంటూ ప్రశ్నలు సంధించారు. అక్కడితో ఆగకుండా పవన్ సినిమాలు చేయాలో వద్దో కూడా తానే చెప్పేశారు. సినీ నిర్మాతలు, రైటర్లకు కూడా వార్నింగ్ ఇచ్చేశారు అంబటి. పవన్‌ను ఓ మాటంటేనే ఊరుకోని జనసైనికులు అంబటి ఈ స్థాయిలో అంటే ఊరుకుంటారా..? పైగా పవన్‌పై సినిమా తీస్తానంటే అసలు ఆగుతారా..? అంబటిని ఏకేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
జనసైనికుల పోస్టర్ వ్యవహారం మంత్రి అంబటికి కూడా చేరింది. దీనిపై ఢిల్లీలో కంప్లయింట్ చేసేందుకు అంబటి సిద్ధమవుతున్నారు. బ్రో సినిమా లావాదేవీలపై ఆయన వైసీపీ ఎంపీలతో కలసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయనున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.