పడుకుంటే కల్లోకి వస్తాడు…. మేల్కొన్నా కళ్లముందే ఉంటాడు… వదల బొమ్మాళి అంటూ వేధిస్తున్నాడు… ఎప్పుడు ఏ బాంబ్ పేలుస్తాడో తెలియదు… సోనూసూద్ కాదు ఇండియన్స్ పట్ల ట్రంపోడు…. అమెరికాలో ఉన్న భారతీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్. ఆ మహానుభావుడి దెబ్బకు అక్కడి భారతీయులు భయంతో వణికిపోతున్నారు. ఒక్క వీసా ప్లీజ్ అంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.
జనవరి 20… ఈ డేట్ ఇండో అమెరికన్ల పాలిట డెడ్ లైన్… ఆ రోజు దగ్గర పడేకొద్దీ మనవాళ్ల బీపీ అంతకంతకూ పెరిగిపోతోంది. అన్ని పర్మిట్లు ఉన్నవాళ్లు కాస్త ప్రశాంతంగా ఉంటే లేనివాళ్లు మాత్రం భయంతో వణికిపోతున్నారు. ట్రంపోడు వచ్చేలోపు వీసా పొందాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్లీజ్ ప్లీజ్ అంటూ వెంట పడుతున్నారు. ప్రస్తుతం H1Bవీసాల కోసం మనోళ్లు గజనీ మహ్మద్్లా దండయాత్రలు చేస్తున్నారు. అమెరికా ఎలక్షన్ ఇయర్ లో వీసా తిరస్కరణ రేటు తగ్గింది. గతేడాది వీసా డినయల్ రేట్ 3.5శాతంగా ఉంటే ఈ ఏడాది అది 2.5శాతానికి పడిపోయింది. నిజానికి ఇది శుభవార్తే… కానీ ముందున్న రోజులు చూస్తే ఈ తీపి కూడా చేదుగానే కనిపిస్తోంది. ట్రంప్ అధికారంలోకి వస్తే వీసాల తిరస్కరణ పెరిగిపోవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. గతంలో 2016లో ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీసాలకు కటకట ఏర్పడింది. అందుకే ఇప్పట్నుంచే మనోళ్లు జాగ్రత్త పడుతున్నారు. సాధ్యమైనంత త్వరగా వీసాలు పొందడానికి ట్రై చేస్తున్నారు. ఇక డిపెండెంట్ వీసా కోసం కూడా దరఖాస్తులు పెరుగుతున్నాయి. పెళ్లికాని వారు సాధ్యమైనంత త్వరగా పెళ్లిచేసుకుని అమెరికాలో అడుగుపెట్టాలని…. జనవరి20లోపు డిపెండెంట్ వీసా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
ట్రంప్ వస్తే అంత ఇబ్బందా అంటే ఖచ్చితంగా ఇబ్బందే. 2016లో ట్రంప్ అన్న ఓ మాట ఇప్పటికీ మనవాళ్లకు గుర్తుంది. H1B వీసా అసలు అవసరం లేదని దానివల్ల అమెరికన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని ట్రంప్ అన్నాడు. ఈ ఒక్కమాట చాలు ఈ వీసాలపై తనకున్న వ్యతిరేకత చెప్పడానికి.
గతంలో ట్రంప్ చేసింది చూస్తే ఎవరికైనా టెన్షన్ పుట్టక తప్పదు. ఒబామా హయాంలో 2015లో H1B వీసా తిరస్కరణ రేటు 3.2శాతంగా ఉంటే ట్రంప్ హయాంలో 2018లో అది 24శాతానికి, 2020లో ఏకంగా 30శాతానికి చేరింది. అంటే వందమంది అప్లయ్ చేస్తే 30మందికి నిరాశ తప్పేది కాదన్నమాట. డెమొక్రాట్ల హయాంలో అది భారీగా తగ్గిపోయింది. కాస్త ఉదారంగానే వ్యవహరించారు. మళ్లీ ట్రంప్ ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనుండటంతో ఆ రోజులు మళ్లీ వస్తాయని ఇండియన్లు భయపడుతున్నారు. అందుకే ఉద్యోగాలకు సంబంధించిన H1B వీసా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఏటా 85వేల H1B వీసాలు ఇస్తోంది. అందులో 20వేలు అక్కడ డిగ్రీ చేసిన వారికి కేటాయిస్తున్నారు. వచ్చే ఏడాదికి సంబంధించి H1B వీసాల కోసం ఇప్పటికే అప్లికేషన్లు భారీగా అందాయి. ఇక ఈ వీసాల కోసం ఎక్కువగా దరఖాస్తు చేస్తున్న వారిలో భారతీయులే అధికమని లెక్కలు చెబుతున్నాయి. 2023లో అమెరికా H1B వీసాలు పొందినవారిలో 72.3శాతం మంది భారతీయులు. అయితే ఈ ఏడాది అమెరికా కంపెనీలు ఈ వీసాల కోసం స్పాన్సర్ చేయడం తగ్గించేశాయి. అమెజాన్, గూగుల్, IBMలతో పాటు దేశీయ సంస్థలు HCL, TCS, ఇన్ఫీ వంటి సంస్థలు కూడా వీసాల దరఖాస్తులను తగ్గించాయి. ఎందుకంటే ఈ వీసాలు పొందినవారు అమెరికన్ల కంటే ఎక్కువ జీతాలు పొందుతున్నారు. తమకంటే ఇతర దేశాల వారికి భారీగా వేతనాలు ఉండటం ట్రంప్ ఏ మాత్రం సహించలేరు.
స్టూడెంట్ వీసాలున్నవారు కూడా ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదు. మళ్లీ వెనక్కు రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయోనని భయపడుతున్నారు. F1వీసాపై ఉన్నవారి స్టేటస్ ఎప్పుడు మారిపోతుందో కూడా వారికి అర్థం కావడం లేదు. చదువు పూర్తయ్యాక తమకు H1B వీసా వస్తుందో రాదో వారికి తెలియడం లేదు. ఇక అప్లికేషన్లు పరిశీలనలో ఉన్న వారికి కూడా టెన్షన్ తప్పడం లేదు. తమ అప్లికేషన్ పరిశీలనకు వచ్చేలోపు ఎక్కడ తమను డిపోర్ట్ చేస్తారోనని భయంతో చస్తున్నారు.
ట్రంప్ తో పాటు ఇండియన్స్ స్టీఫెన్ మిల్లర్ అనే మరో వ్యక్తి గురించి కూడా భయపడుతున్నారు. ఇతను వైట్ హౌస్ డిప్యుటీ చీఫ్ ఆఫ్ స్టాప్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. ఇతడు మనవాళ్ల పాలిట ఓ విలన్ అన్నమాట. 2016లో సీనియర్ అడ్వైజర్ కింద ఉన్నాడు. అప్పుడు వీసాలు తిరస్కరించడానికి ప్రధాన కారణం ఇతడే. కఠినమైన ఆంక్షలు పెట్టి వేధించాడు. ఈసారి కూడా మరిన్ని అధికారాలతో అలాంటి నిబంధనలే పెట్టడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే భారతీయులు అతడి గురించి నెట్ లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారట.
అన్ని కష్టాలు పడి అక్కడెందుకు ఉండాలి వచ్చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తాయి. కానీ అది అవకాశాల స్వర్గం… అక్కడ డాలర్లలో వెనకేసుకుంటే ఇక్కడ లక్షల్లో మిగులుతుంది. అందుకే అక్కడకు వెళ్లిన మనవాళ్లెవరూ తిరిగి రావడానికి అంత ఇష్టపడరు. ఇప్పుడు అదే అతిపెద్ద సమస్య కానుంది. చూడాలి ట్రంప్ ఎంతమంది ఇండియన్స్ ను వెనక్కు పంపిస్తాడో… ఇప్పటికైతే మొదటి దశలో 18వేల మంది తేలారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్య ఎంతకు పెరుగుతుందో చూడాల్సి ఉంది.