Jaya Prada: సీనియర్ హీరోయిన్ జయప్రద బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఆమె కారెక్కి.. తెలంగాణలో రయ్‌మంటూ దూసుకెళ్లబోతున్నారు. ఈ మేరకు పార్టీ పెద్దలతో సంప్రదింపులు పూర్తైనట్లు సమాచారం. జయప్రద బిఆర్ఎస్‌లో చేరాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. జయసుధ బీజేపీలో చేరగానే జయప్రదని టిఆర్ఎస్‌లో చేర్చు కోవడానికి రంగం సిద్ధమైంది. జయప్రద ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ మధ్య చెన్నై థియేటర్ల కేసులో శిక్ష కూడా పడింది. హైకోర్టు కెళ్ళి ఆ తీర్పుపై స్టే తెచ్చుకుందనుకోండి.. అది వేరే విషయం.
ఒకప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో ఒక వెలుగు వెలిగారు జయప్రద. ఆమెకు అండగా నిలిచిన అమర్ సింగ్ చనిపోయిన తర్వాత రాజకీయాల్లో జయప్రద పూర్తిగా తన అడ్రస్ వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజ్‌వాది పార్టీకి ఇప్పుడు జయప్రదని తిరిగి ఎన్నికల్లో నిలబెట్టేంత ఆసక్తి లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి తిరిగి వచ్చి బీజేపీలో చేరాలని మొదట జయప్రద భావించింది. ఆ మధ్య రాజమండ్రిలో జరిగిన ఈ సమావేశాలకు కూడా హాజరైంది. రాజమండ్రి ఎంపీ సీటు తనకి ఇస్తే బీజేపీ నుంచి పోటీ చేస్తానని అగ్ర నేతలు దగ్గర అర్జీ పెట్టుకుంది. వాళ్లు ఉలకలేదు.. పలకలేదు. జాగ్రత్తగా గమనిస్తే బీజేపీకి ఆంధ్ర, తెలంగాణ రెండు చోట్ల ఎక్కడా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ నుంచి ఆర్థిక సాయం కూడా పెద్దగా ఉంటుందని ఆశ కూడా లేదు.
ఏపీలో బీజేపీ పరిస్థితి మరీ దారుణం. అక్కడ జయప్రద చేరినాఎన్నికల్లో గెలిచే అవకాశం లేదు. ఆమె వెంట పెద్ద క్యాడర్ కూడా లేదు. ఇప్పుడున్న నాయకులు జయప్రదని గెలిపిస్తారని ఆశ కూడా లేదు. పోనీ తెలంగాణ బీజేపీకి వచ్చి ఏదైనా చేద్దామంటే ఇక్కడ ఇప్పటికే విజయశాంతి, కొత్తగా జయసుధ కర్చీఫులు వేసుకొని కూర్చున్నారు. ఏదో పార్టీ పనైనా చేసుకొని బిజెపి అధికారంలోకి వస్తే ఢిల్లీలో ఏదైనా పొజిషన్ సంపాదించాలని ఆలోచనలో కూడా మొదట్లో జయప్రద ఉన్నారు. కానీ అది ప్రాక్టికల్ గా ఎక్కడా సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదు. అందుకే అన్నీ ఆలోచించుకొని బిఆర్ఎస్‌లో చేరిపోవడం బెటర్ అనే నిర్ణయానికి వచ్చేసారు. బిఆర్ఎస్‌లో చేరితే వీలైతే తెలంగాణ నుంచి.. వీలు కాకపోతే మహారాష్ట్ర నుంచి.. ఏదైనా అవకాశం ఉంటే యూపీ నుంచైనా ఆమెను కెసిఆర్ రంగంలోకి దింపవచ్చు. ఇండియాలోనే ఆర్థికంగా అత్యంత బలమైన బిఆర్ఎస్ పార్టీ… జయప్రదను ఎక్కడ నుంచైనా ఎన్ని కల్లో నిలబెట్టగలదు. ఈ ఆశతోనే బీఆర్ఎస్ పంచన చేరుతున్నారు. ఒకప్పటి కంటే ఆమె ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఆ రోజుల్లో అమర్ సింగ్ ఆమెకు అన్ని రకాలుగా అండ దండగా ఉండి గ్లామర్ మీద జయప్రదనీ గెలిపిస్తూ వచ్చారు.
అమర్ సింగ్ మరణం తర్వాత జయప్రద పూర్తిగా ఒంటరి అయిపోయారు. పొలిటికల్‌గా పెద్ద పరిజ్ఞానం కూడా ఆమెకు లేదు. ఎవరో ఒకరి అండదండలతోనే నెట్టుకు రావాల్సిందే. అందుకనే బీఆర్ఎస్ వెంట ఉంటే ఆర్థికంగానూ వెసులుబాటు ఉంటుంది. అదృష్టం కొద్ది గెలిస్తే మళ్లీ ఢిల్లీ చేరుకోవచ్చు. ఇది జయప్రద ప్లాన్. ఈ గొడవ అంతా ఎందుకు హాయిగా ఏపీ టీడీపీలో చేరిపోవచ్చు కదా.. ఏదో ఒక పోస్ట్ ఇస్తారు కదా అని కొందరు జయప్రద కి సలహా ఇచ్చారట. చంద్రబాబు పేరు ఎత్తగానే కస్సుమని లేచిన జయప్రద బాబు తనకు చేసిన అన్యాయాన్ని చచ్చే వరకు మర్చిపోలేను అంటూ.. టిడిపి పంచన చేరే పరిస్థితి రాదని తగేసి చెప్పేసిందట. అయినా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్లంతా ఒకప్పటి టిడిపి లీడర్లే కదా జయప్రద వస్తే తప్పేంటి అని టిఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఇక టిఆర్ఎస్ కి కూడా సినిమా గ్లామర్ వచ్చేసినట్లే.