JC Diwakar Reddy: మళ్లీ రాయల తెలంగాణ డిమాండ్..! జేసీకి మతి పోయిందా..?

జేసీ కుటుంబాన్ని జగన్ ఓ రేంజ్ లో తొక్కేస్తున్నారు. ఇప్పటికే జేసీ వ్యాపారాలు కుదేలయ్యాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే జేసీ ఫ్యామిలీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. కానీ ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ విషయం జేసీకి కూడా తెలుసు.

  • Written By:
  • Publish Date - April 25, 2023 / 04:15 PM IST

ఆంధ్రప్రదేశ్ విడిపోయి తొమ్మిదేళ్లు దాటిపోయింది. ఏపీ, తెలంగాణ తమదైన బాటలో ముందుకు వెళ్తున్నాయి. అయితే విభజన గాయాలు మాత్రం ఇప్పటికీ మానలేదు. ఇప్పటికే అనేక అంశాలు పెండింగ్ లోనే ఉన్నాయి. వీటిని పరిష్కరించాలంటూ అటు ఏపీ, ఇటు తెలంగాణ కేంద్రప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం మాత్రం దొరకట్లేదు. ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ అలాగే కంటిన్యూ అవుతోంది. ఏపీ వెనుకబడిపోయిందని, తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందనే వాదనలు ఉన్నాయి. అందుకే ఇప్పటికీ పలువురు ఆంధ్రులు.. తాము తెలంగాణలో కలిసుంటే బాగుంటుందని కోరుకుంటున్నారు.

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాయలసీమను తెలంగాణలో కలపాలంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. దాదాపు పదేళ్లవుతున్నా ఇప్పటికీ కలిసే ఉండాలన్న డిమాండ్ హాస్యాస్పదమనేది తెలంగాణ వాదుల వాదన. అయితే విభజన తర్వాత ఏపీలో రాయలసీమ వెనుకబడిందని.. తెలంగాణలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని జేసీ చెప్తున్నారు. అమరావతిని కాదని వైజాగ్ కు రాజధాని తరలిపోతే రాయలసీమకు మరింత అన్యాయం జరుగుతుందనేది జేసీ చెప్తున్న మాట. సీఎం జగన్ రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నాడని.. అందుకే సీమను తెలంగాణలో కలిపేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

రాయలసీమను తెలంగాణలో కలపాలనే డిమాండ్ ముందు నుంచీ ఉంది. ముఖ్యంగా జేసీ దివాకర్ రెడ్డి దీనికోసం రాష్ట్ర విభజన సమయంలో కూడా పోరాడారు. రాయలసీమ మొత్తాన్నీ కాకపోయినా కనీసం అనంతపురం, కర్నూలు జిల్లాలను కలిసి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరారు. కానీ మిగిలిన సీమవాసులు అందుకు ఒప్పుకోలేదు. ఇటు తెలంగాణ వాసులు కూడా రాయలసీమను తమలో కలపొద్దని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ కాలం పాలించింది సీమవాసులే. తెలంగాణకు అన్యాయం చేసిందే వాళ్లయినప్పుడు మళ్లీ వాళ్లతో కలవడమా.. అని ఎదురు ప్రశ్నించారు. దీంతో అది సాధ్యం కాలేదు.

ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి మళ్లీ రాయల తెలంగాణ డిమాండ్ చేయడంతో ఈ టాపిక్ మరోసారి చర్చనీయాంశమైంది. అయితే జేసీ దివాకర్ రెడ్డి తన రాజకీయ మనుగడ కోసం ఇలా మాట్లాడుతున్నారు తప్ప ప్రాంత ప్రయోజనాలకోసం కాదు. జేసీ కుటుంబాన్ని జగన్ ఓ రేంజ్ లో తొక్కేస్తున్నారు. ఇప్పటికే జేసీ వ్యాపారాలు కుదేలయ్యాయి. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే జేసీ ఫ్యామిలీకి మరిన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్త డిమాండ్ ను తెరపైకి తెస్తున్నారు. కానీ ఇది సాధ్యమయ్యేది కాదు. ఈ విషయం జేసీకి కూడా తెలుసు.