JD Lakshmi Narayana: దూకుడు పెంచిన జేడీ లక్ష్మీనారాయణ.. విశాఖలో పాగా వేయడం ఖాయమా ?

గత ఎన్నికల్లో విశాఖ నుంచి జనసేన నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ.. కారణాలు ఏవైనా ఆ తర్వాత గ్లాస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. సింగం సింగిల్ అనే రేంజ్‌లో ఒంటరిగానే పోరాడుతా.. ఒంటరిగానే పోరులో నిలబడతా అంటూ.. ఎన్నికలయుద్ధానికి సిద్ధం అవుతున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ.. ఇలా పార్టీల నుంచి వరుస ఆఫర్లు వస్తున్నా.. పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు ఆయన ! ఓట్ల ప్రకారమే తాను విశాఖలో ఓడిపోయానని.. జనాల నమ్మకం, ప్రేమ గెలుచుకోవడం సక్సెస్ అయ్యానని అంటున్నారు. దీంతో ఇప్పుడు మళ్లీ ఎన్నికల యుద్ధానికి సిద్ధం అవుతున్నారు.

  • Written By:
  • Updated On - April 15, 2023 / 07:23 PM IST

ప్రతీ క్షణం జనాలకు అందుబాటులో ఉంటూ.. తన మార్క్ అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యవహారం రచ్చ రేపుతుండగా.. అవసరం అయితే జనాల తరఫున తాను బిడ్డింగ్‌లో పాల్గొంటానంటూ ప్రకటించి.. తన వ్యూహాలు ఏంటో.. లక్ష్యం ఏంటో చెప్పకనే చెప్పారు లక్ష్మీనారాయణ. 2019లో పోటీ చేసిన అనుభవంతో ఈసారి విశాఖ ఎంపీ స్థానాన్ని కొట్టాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఐతే సింగిల్‌గా, స్వతంత్ర్యంగా పోటీ చేస్తే లక్ష్మీనారాయణకు కలిసివస్తుందా అంటే.. అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయనిపిస్తోంది.

2019తో కంపేర్‌ చేసుకుంటే విశాఖలో పరిస్థితులు జేడీకి అనుకూలంగా ఉన్నాయ్. విశాఖ ఎంపీ గెలిచిన ఎంవీవీ సత్యనారాయణపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి ఆయనకు అన్నీ చేదు అనుభవాలే ఎదురవుతున్నాయ్. సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, నిధుల కేటాయింపులు.. ఎంపీ మీద ఒత్తిడి తీసుకొచ్చాయ్. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని జనాల నుంచి డిమాండ్‌ ఎన్నోసార్లు వినిపించింది. వీటికితోడు భూవివాదాలు కూడా ఎంవీవీని చుట్టుముట్టాయ్. ఓ దశలో విజయసాయిరెడ్డితోనూ ఆయనకు మాటా మాట పెరిగిన పరిస్థితి కనిపించింది.

వివాదాలన్నీ వరుసగా కమ్ముకొస్తున్న వేళ.. పార్లమెంట్ విడిచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంవీవీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికితోడు విశాఖ వైసీపీలో గ్రూప్‌లు పెరిగిపోయాయ్. ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడి ఫ్యాన్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వైసీపీ సంగతి ఇలా ఉంటే.. టీడీపీది ఇంకో రకం ఇబ్బంది. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన భరత్‌.. మళ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు.

బీజేపీ నుంచి పోటీ జీవీఎల్‌ పావులు కదుపుతున్నారు. ఐతే ఈ ఇద్దరికి జనాల్లో పెద్దగా పట్టు లేదు. పార్టీ పేరుతో ఓట్లు అడగాల్సిందే తప్ప.. వ్యక్తిగతంగా ఎలాంటి ఇమేజ్‌ లేదు. ఇలాంటి పరిస్థితులన్నీ లక్ష్మీనారాయణకు కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయ్. నిత్యం జనాలకు అందుబాటులో ఉంటూ.. నిజాయితీపరుడిగా గుర్తింపు తెచ్చుకున్న జేడీని.. ఓటర్లకు చాలా దగ్గరయ్యారు. ఇలాంటి వ్యక్తినా ఓడించింది అనే సింపతీ క్రియేట్‌ చేయగలిగారు. ఇప్పుడు విశాఖకు సెంటిమెంట్ అయిన.. స్టీల్‌ప్లాంట్ ఇష్యూను అందుకున్నారు. ఇది జనాలకు మరింత చేరువ చేయడం ఖాయమని.. ఇదే టెంపో కంటిన్యూ చేస్తే.. ఆయనకు అడ్డే ఉండదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.