Jharkhand: మన దేశంలో రాజకీయ నేతల నైతికత గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లంచాలు తీసుకుంటూ దొరికిపోవడం, రాసలీలల వీడియోలు, ఆడియో రికార్డ్స్ బయటపడటం, హత్య, కబ్జా ఆరోపణలు వంటివి వచ్చినా ప్రజాప్రతినిధులు పెద్దగా స్పందించరు. ప్రజలు కూడా పట్టించుకోరు. తప్పు చేసి, దొరికిపోయినా నేతలు మాత్రం తప్పించుకునేందుకే చూస్తుంటారు. వీడియో ఎడిటింగ్ అనీ.. కుట్ర అనీ.. ఇలా అనేక రకాలుగా విషయాన్ని మరుగుపర్చేందుకు ప్రయత్నిస్తుంటారు. సక్సెస్ అవుతుంటారు. ఇప్పటివరకు ఇలాంటి వీడియోలతో దేశంలో చాలా మంది దొరికిపోయినా వాళ్ల రాజకీయ జీవితాలకు మాత్రం ఎలాంటి ఆటంకం కలగలేదు. వాళ్లపై ఎవరూ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఇదంతా ఇక్కడ షరా మామూలే. తాజాగా ఝార్ఖండ్ మంత్రికి సంబంధించిన ఒక అసభ్య వీడియో లీకైంది. ప్రస్తుతం దీని గురించి ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.
ఝార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం కలిసి అధికారంలో ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెంది బన్నా గుప్తా ఆరోగ్య శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన ఇటీవల ఒక మహిళతో జరిపిన అసభ్య సంభాషణకు సంబంధించిన వీడియో విడుదలైంది. బీజేపీకి చెందిన ఎంపీ నిషికాంత్ దూబే ఈ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాంగ్రెస్ నేతల అసలు స్వభావం అని, ఆరోగ్య శాఖ మంత్రి వ్యవహారం అని నిషికాంత్ అన్నారు. మంత్రి మహిళల ఆత్మ గౌరవంతో ఆడుకుంటున్నాడని, ఇది నిజమే అయితే కాంగ్రెస్ పార్టీ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. దీనిపై సీఎం హేమంత్ సోరెన్ విచారణకు ఆదేశించాలని, వీడియో నిజమే అని తేలితే మంత్రిపై చర్యలు తీసుకుని, పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడీ వీడియో ఝార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఈ వీడియోలో బన్నా గుప్తా కుర్చీలో కూర్చుని, ఒక మహిళతో చాటింగ్ చేశాడు. ఇందులో ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. ఈ వీడియోపై మంత్రి స్పందించాడు. అది ఫేక్ వీడియో అని, తన ప్రతిష్ట దెబ్బతీయడానికే మార్ఫింగ్ చేసి వీడియో రిలీజ్ చేశారని చెప్పుకొచ్చాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, త్వరగా విచారణ జరపాలని కోరినట్లు చెప్పాడు. ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారని, ఈ కుట్ర వెనుక ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నిజాలు నిగ్గుతేలేనా?
ఈ విచారణలో ఏం తేలుతుందో ఊహించడం పెద్దగా కష్టం కాదు. ఎందుకంటే విచారణ జరిపేది ఆయన ప్రభుత్వంలోని పోలీసులే. గతంలో అనేక రాష్ట్రాల్లో, ఇలాంటి పలు ఘటనల్లో పోలీసులు విచారణ జరిపారు. కానీ, అధికార పార్టీకి చెందిన నేతలు ఎవరికీ వ్యతిరేకంగా నిర్ణయాలు వెలువడలేదు. అసలు ఈ కేసులు ఏమయ్యాయో కూడా ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత మీడియా, ప్రజలు కూడా ఈ విషయాన్ని మర్చిపోతారు. గతంలో ఏపీకి సంబంధించి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఒకటి లీకైంది. అది ఫేక్ వీడియో అని గోరంట్ల వివరణ ఇచ్చుకున్నాడు. దీనిపైనా విచారణ జరిగింది. అయితే, ఈ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. కొద్దిరోజులు ఈ విషయంపై ఏపీ అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇది ఒరిజినల్ వీడియోనే అని టీడీపీ ఆధారాలతో సహా ప్రచారం చేసింది. కానీ, దీన్ని అధికార పార్టీ కొట్టిపారేసింది. ఈ విషయాన్ని జనాలెప్పుడో మర్చిపోయారు. ఇటీవల తెలంగాణలో కూడా ఎమ్మెల్యే రాజయ్య ఒక మహిళా ప్రజా ప్రతినిధిని వేధింపులకు గురి చేసినట్లు ప్రచారం జరిగింది. చివరకు రాజయ్య ఈ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేశాడు. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఒకట్రెండు రోజులు హడావిడి కనిపిస్తుంది. ఆ తర్వాత వివాదం ముగిసిపోతుంది. లేదా మరో కొత్త అంశం తెరపైకి రాగానే ఈ విషయాన్ని అందరూ మర్చిపోతారు.
బాధ్యత లేదా?
అమెరికాలాంటి దేశాల్లో సాధారణంగా పాలకులపై ఇలాంటి ఆరోపణలు రావు. ఒకవేళ ఆరోపణలొస్తే.. వాటిలో నిజం ఉంటే పాలకులు తమ పదవుల్ని వదిలిపెడతారు. గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌పై మోనికా లెవెన్‌స్కీ అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. వాళ్లిద్దరి మధ్యా బంధం ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై బిల్ క్లింటన్ అభిశంసన కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన అప్పట్లో ఈ వార్తలను ఖండించినా, తర్వాత నిజం ఒప్పుకొన్నారు. ఇక బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చలేనందుకే ఆమె తన పదవి నుంచి తనకుతానుగా తప్పుకొన్నారు. ఇంతటి నైతికతను మన నేతల నుంచి ఆశించలేం. సరిగ్గా పాలించకపోయినా.. ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోలేకపోయినా.. అసభ్య వీడియోలతో అడ్డంగా దొరికిపోయినా.. అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయినా పదవుల్ని వదలడానికి ఏమాత్రం ఒప్పుకోరు. ఎదుటివారిపై నిందలు వేసి తప్పించుకునేందుకే చూస్తారు. బాధ్యత లేకుండా ప్రవర్తించే నాయకుల వల్లే ఇదంతా. ప్రజలకు ఈ విషయాలేవీ పట్టవు. మళ్లీ ఇలాంటివాళ్లకే పట్టం కడుతుంటారు.