JP Nadda: కేసీఆర్ ట్రాపులో పడొద్దు.. వివాదాలు పక్కనపెట్టండి.. తెలంగాణ నేతలకు నద్దా హెచ్చరిక

పార్టీ నేతలు వివాదాల్ని పక్కనపెట్టాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్.. రెండూ ఒకటే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బీర్ఎస్, కేసీఆర్‌‌తో ఎలాంటి దోస్తీ లేదన్నారు.

  • Written By:
  • Publish Date - July 10, 2023 / 09:40 AM IST

JP Nadda: తెలంగాణ బీజేపీ నేతల మధ్య నెలకొన్న సంక్షోభాన్ని నివారించేందుకు అధిష్టానం ప్రయత్నిస్తోంది. పార్టీ వ్యవహారాల్ని చక్కదిద్దే పనిలో పడింది. పార్టీ నేతలు వివాదాల్ని పక్కనపెట్టాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్.. రెండూ ఒకటే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బీర్ఎస్, కేసీఆర్‌‌తో ఎలాంటి దోస్తీ లేదన్నారు. తెలంగాణ బీజేపీ కోర్ కమిటీతో పార్టీ జాతీయాధ్యక్షుడు నద్దా ఆదివారం భేటీ అయ్యారు. బీజేపీకి చెందిన దక్షిణాది రాష్ట్రాల నేతలతో సుదీర్ఘ సమావేశం తరువాత నద్దా ఈ భేటీ నిర్వహించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మూడో సారి కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణాది అత్యధిక సీట్లు గెలవాలని, దక్షిణాదిన 170 సీట్లు గెలవడమే లక్ష్యంగా పని చేయాలని పార్టీ నేతలకు సూచించారు. దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని రాష్ట్రాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు.
బీజేపీ.. బీఆర్ఎస్ ఒక్కటి కాదు
తెలంగాణకు సంబంధించి నద్దా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కిషన్ రెడ్డి నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలి అనే అంశంపై చర్చించారు. పార్టీ అంతర్గత విషయాలు, నేతల మధ్య విబేధాలు, రాష్ట్ర కమిటీలో మార్పులు, చేర్పులు, తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించారు. ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో నిజం లేదన్నారు. రెండు పార్టీలూ ఒక్కటి కాదని, పార్టీల మధ్య ఎలాంటి స్నేహం లేదని, ఈ విషయంలో కేసీఆర్ ట్రాపులో పడొద్దని నేతలకు సూచించారు. నిజానికి ఈ అంశంలో కొందరు నేతలు నద్దాను ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ ప్రచారం జరుగుతోందని, తాజా పరిణామాలు కూడా అలాగే ఉన్నాయని, ఈ విషయంలో ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని నద్దాను ప్రశ్నించారు. దీంతో పార్టీకి నష్టం జరుగుతోందని నద్దా దృష్టికి తెచ్చారు. దీనిపై నద్దా స్పందిస్తూ రెండు పార్టీల మధ్య ఎలాంటి ఒప్పందం లేదనే విషయాన్ని ప్రధాని మోదీ, తాను ఇప్పటికే చెప్పామన్నారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రచారం చేస్తున్నారని, మైండ్ గేమ్ ఆడుతున్నాడన్నారు. బీజేపీని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ కుట్రపన్నారని, అందుకే ఈ ప్రచారం చేస్తున్నారని నద్దా వివరించారు. దీనికి అనుగుణంగానే బీజేపీతో సయోధ్య ఉన్నట్లు రాజకీయ వాతావరణాన్ని కేసీఆర్ సృష్టిస్తున్నట్లు, అందువల్లే ఎప్పుడూ లేనిది మంత్రులు ఢిల్లీకి వస్తున్నారని చెప్పారు. ఢిల్లీ వచ్చిన బీఆర్ఎస్ మంత్రులను కలిస్తే.. రెండు పార్టీలు కలిసిపోయినట్లు ప్రచారం చేసుకుంటారని, కలవకపోతే అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శిస్తారని నద్దా అన్నారు. ఈ విషయంలో కేసీఆర్, బీజేపీ ప్రయత్నాల్ని తిప్పికొట్టాలని నద్దా.. పార్టీ నేతలకు సూచించారు.
దిశా నిర్దేశం
తెలంగాణలో ఎన్నికల సందడి కనిపిస్తోందని, ఈ సమయంలో విబేధాలు పక్కనపెట్టాలని నేతలకు నద్దా సూచించారు. నేతలు పని విభజన చేసుకుని, కలిసి పని చేయాలని దిశానిర్దేశం చేశారు. దీనికి అనుగుణంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక కార్యాచరణతో జనంలోకి వెళ్లాలని ఆదేశించారు.