Jr NTR: ఎన్టీఆర్ ఫ్లెక్సీల వెనుక ఐప్యాక్ టీం.. టీడీపీలో చిచ్చుపెట్టే యత్నం.. టీడీపీ ఆరోపణ

ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని పార్టీ శ్రేణుల్లో కొందరు కోరుకుంటున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ దీనికి సిద్ధంగా లేరు.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 12:12 PM IST

Jr NTR: టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ అంశం కలకలం సృష్టిస్తోంది. నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏపీలో పలు చోట్ల ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌‌కు అనుకూలంగా, నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు ఉంటున్నాయి. ఇటీవల ఒంగోలులో నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ‘అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే’ అంటూ ఎన్టీఆర్ ఫొటోతో రూపొందిన ఫ్లెక్సీ మరోసారి వివాదాస్పదమైంది. టీడీపీ నేతల పేరుతోనే ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నప్పటికీ, వీటి వెనుక వైసీపీకి చెందిన ఐప్యాక్ టీం, కొందరు వాలంటీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చిచ్చుపెట్టేందుకే ఐప్యాక్ టీం ఈ పని చేస్తున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీకి నాయకత్వ సమస్య ఉంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాలి అనుకుంటున్నారు. ఆయన తర్వాత తన తనయుడు నారా లోకేశ్.. ఆ పార్టీని నడిపించాలని భావిస్తున్నాడు. అయితే, నారా లోకేశ్‌కు అంత పరిణతి రాలేదు. రాజకీయంగా ఆయన ఇంకా తడబాటుకు గురవుతున్నారు. తెలుగు మాట్లాడటంలోనే ఏదో ఇబ్బంది. అనేక అంశాల మీద అవగాహన తక్కువ. ప్రసంగాలు ఆకట్టుకునేలా ఉండవు. నాయకత్వ లక్షణాలు కూడా కనిపించవు. చంద్రబాబు కొడుకు అనే ఒకే అర్హత తప్ప ఏ రకంగానూ లోకేశ్‌ నాయకుడు అయ్యేందుకు తగిన అర్హతలు లేవనిపిస్తుంది. దీనికి తోడు గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనను వైసీపీ శ్రేణులు పప్పు అంటూ ప్రచారం చేస్తుంటాయి. టీడీపీ శ్రేణుల్లోనే లోకేశ్‌పై సానుకూలత లేదు. పార్టీని ఆయన నడిపించలేరని చాలా మంది భావన. ఇది ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాలుగా మారింది. దీంతో లోకేశ్‌ను ఎలాగైనా నాయకుడిగా తీర్చిదిద్దాలనుకుంటున్నారు. దీనికోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ, జనంలోకి వెళ్లారు. కానీ, అది సత్ఫలితాన్నివ్వడం లేదు. సొంత మీడియా, సోషల్ మీడియాలో లోకేశ్ మారిపోయాడంటూ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ వాస్తవం వేరేలా ఉంది. ఇదే సమయంలో టీడీపీని నడిపించాల్సింది ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆరే అంటూ మరో వర్గం ప్రచారం ప్రారంభించింది. టీడీపీలోని కొందరు కూడా ఇదే కోరుకుంటున్నారు.
ఎన్టీఆర్‌‌ పేరు ప్రచారం వెనుక ఐప్యాక్ టీం
ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని పార్టీ శ్రేణుల్లో కొందరు కోరుకుంటున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ దీనికి సిద్ధంగా లేరు. వారి వారసుడిగా నారా లోకేశ్.. టీడీపీ బాధ్యతలు తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో టీడీపీలో ఎన్టీఆర్ కొంత యాక్టివ్‌గా కనిపించినప్పటికీ, నారా లోకేశ్ కోసం నెమ్మదిగా ఎన్టీఆర్‌‌ను పక్కనబెట్టారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు, చివరకు కుటుంబ కార్యక్రమాలకు కూడా దూరం పెడుతూ వస్తున్నారు. ఎన్టీఆర్ కూడా తనకేం సంబంధం లేనట్లే ఉంటున్నారు. అయితే, ఎన్టీఆర్ పేరును పదేపదే తెరమీదకు తెచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా వైసీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియాలో టీడీపీకి అసలైన వారసుడు ఎన్టీఆరే అంటూ ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ సభలు, యాత్రల్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, బ్యానర్లు కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్‌‌కు అనుకూలంగా నినాదాలు వినిపిస్తుంటాయి. గతంలో కుప్పంలో కూడా ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, జెండాలు కనిపించాయి. అయితే, దీనంతటి వెనుక ప్రశాంత్ కిషోర్‌‌కు చెందిన ఐప్యాక్ టీం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జనం మధ్యలో చేరిన కొందరు వైసీపీ నేతలు ఎన్టీఆర్ పేరుతో నినాదాలు చేస్తూ, హంగామా చేస్తున్నారని ఆరోపిస్తుంది టీడీపీ.
టీడీపీలో చిచ్చుపెట్టే యత్నం
వైసీపీ చేస్తున్న ఈ ప్రయత్నాలు టీడీపీలో చిచ్చుపెట్టేందుకే అని ఆ పార్టీ నేతలంటున్నారు. ఎన్టీఆర్ పేరును తెరపైకి తేవడం వల్ల టీడీపీకి నష్టం కలిగించాలని వైసీపీ ప్రయత్నిస్తోందంటున్నారు. దీనివల్ల ఎన్టీఆకు అనుకూలంగా ఒక వర్గం, వ్యతిరేకంగా మరో వర్గాన్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ చేస్తున్న కుట్రగా దీన్ని అభివర్ణిస్తున్నారు టీడీపీ నేతలు.