Jr NTR: ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదలకు హాజరుకాని జూనియర్ ఎన్టీఆర్.. అసలు కారణం ఏంటి..?

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమ వేదిక నిండుగా కనిపించింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం మాత్రం లోటుగా అనిపించింది నందమూరి అభిమానులకు. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణాలేమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది.

  • Written By:
  • Updated On - August 28, 2023 / 07:38 PM IST

Jr NTR: తెలుగు ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్రం ఎన్టీఆర్ స్మారక రూ.100 నాణేన్ని విడుదల చేసింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదలైంది. ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ, కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, నారా చంద్రబాబు నాయుడు సహా కుమార్తెలు, కొడుకులు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు చాలా మంది హాజరయ్యారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోవడం సంచలనంగా మారింది. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణమేంటి..? ఆయనకు ఆహ్వానం అందలేదా..? కుటుంబ సభ్యుల నుంచి పిలుపు రాలేదా..?
ఎన్టీఆర్ మినహా అందరూ హాజరు
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమ వేదిక నిండుగా కనిపించింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం మాత్రం లోటుగా అనిపించింది నందమూరి అభిమానులకు. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణాలేమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది. నందమూరి కుటుంబంలో మూడో తరం నటుడిగా, ఎన్టీఆర్‌కు తగ్గ మనవడిగా, నేటి తరంలో అసలైన సినీ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నాడు. ఇంత స్టార్‌డమ్ ఉన్నప్పటికీ నందమూరి కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలతోపాటు, టీడీపీ కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ పెద్దగా కనిపించడం లేదు. అరుదుగా ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో మాత్రమే ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ అనే వాళ్లు ఉన్నారు.
ఆహ్వానం అందలేదా..?
ఎన్టీఆర్ స్మారక నాణెం కార్యక్రమానికి కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించే బాధ్యతను కేంద్రం ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి అప్పగించింది. ఆమె ఎన్టీఆర్ కుమార్తె కావడంతోనే ఈ బాధ్యతల్ని ఆమెకు ఇచ్చారు. ఆమె ఇతర కుటుంబ సభ్యులతోపాటు ఎన్టీఆర్‌కు కూడా ఆహ్వానం పంపే ఉంటారని విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం ఎన్టీఆర్ రాకుండా అడ్డుకునే పరిస్థితుల్లో చంద్రబాబు లేరు. అలాగే ఇది టీడీపీ కార్యక్రమమో.. కుటుంబ కార్యక్రమమో కాదు. పైగా ఎన్టీఆర్ విషయంలో పురందేశ్వరి సానుకూలంగానే ఉంటారు. అందులోనూ కేంద్రం తనకు బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆమె వివక్ష చూపే అవకాశం లేదు. గతంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షానే నేరుగా ఎన్టీఆర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అంటే బీజేపీ.. ఎన్టీఆర్ విషయంలో సానుకూలంగానే ఉంది. అలాంటప్పుడు పురందేశ్వరి కచ్చితంగా ఎన్టీఆర్‌ను పిలిచి ఉండొచ్చని చాలా మంది అంచనా. మరోవైపు షూటింగ్ బిజీగా ఉండటం వల్ల కూడా ఎన్టీఆర్ రాకపోయి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. ఎంత షూటింగ్ ఉన్నా.. ఇలాంటి కీలక సమయంలో వీలు చేసుకుని రావడం పెద్ద కష్టం మాత్రం కాదు.
లోకేశ్ కోసమే దూరం పెట్టారా..?
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేపట్టారు. ఆ తర్వాత ప్రచారానికీ, పార్టీకీ దూరమయ్యారు. అనంతరం జరిగిన పార్టీ కార్యక్రమాలకు కూడా ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందలేదు. దీనికి కారణం.. తన తనయుడు లోకేశ్‌కు చంద్రబాబు ప్రాధాన్యం ఇవ్వడమే అని ప్రచారం జరిగింది. లోకేశ్‌కు పోటీగా మారుతాడని భావించడం వల్లే ఎన్టీఆర్‌ను చంద్రబాబు పక్కన పెట్టారు. లోకేశ్.. బాలకృష్ణకు అల్లుడు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై ఆయన తండ్రి హరికృష్ణ కూడా ఫీలయ్యారనే భావన ఉండేదంటున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్‌ను దూరం పెట్టినట్లుగానే.. ఎన్టీఆర్ కూడా చంద్రబాబుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తనను రాజకీయంగా వాడుకుని వదిలేశారనే భావనలో ఎన్టీఆర్ ఉన్నారని ఆయన సన్నిహితులు అంటూ ఉంటారు. ఒకవేళ ఎన్టీఆర్ ఏదైనా కార్యక్రమానికి హాజరైతే.. దాన్ని టీడీపీ శ్రేణులు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటాయనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ కూడా దూరంగా ఉంటున్నారు. అటు చంద్రబాబు, బాలకృష్ణ, టీడీపీ కూడా ఎన్టీఆర్‌ను అలాగే దూరం పెడుతూ వచ్చింది. అయితే, కుటుంబ కార్యక్రమాలకు మాత్రం ఎన్టీఆర్ హాజరవుతున్నారు. రాజకీయాలకు మొత్తంగా ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నట్లు దీని ద్వారా స్పష్టమవుతోంది.
ఫ్యూచర్ ఎన్టీఆర్‌తోనేనా..?
చంద్రబాబు అండ్ కో.. ఎన్టీఆర్‌ను ఎంతగా దూరం పెడుతున్నా.. లోకేశ్‌ను భావి నేతగా ప్రచారం కల్పిస్తున్నా.. టీడీపీలోని ఒక వర్గంలో అసంతృప్తి ఉంది. అందుకే ఎన్టీఆర్ భవిష‌్యత్తులో తమ పార్టీ పగ్గాలు తీసుకోవాలని కొందరు అభిమానులు, పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే చంద్రబాబు, లోకేశ్ ప్రచారాల్లో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. మరోవైపు.. ఏదో ఒక రోజు టీడీపీ పగ్గాలు తన చేతికి వస్తాయనే ధీమాతో ఎన్టీఆర్ ఉన్నారని, ప్రస్తుతానికి సినిమాలపైనే ఫోకస్ చేశాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుతం రాజకీయంగా సైలెన్స్‌గా ఉన్నప్పటికీ.. తనదైన రోజున పొలిటికల్ రీ సౌండ్ మోగించడం ఖాయమని, ఇందుకు అనుగుణంగా ఎన్టీఆర్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.