Jr NTR: ఏపీ రాజకీయం అంతా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం చుట్టే తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలోనూ చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నిరసనకు దిగుతున్నారు. జాబ్‌లోంచి తీసేస్తామని బెదిరించినా వాళ్లు లెక్క చేయడం లేదు. ఇదంతా ఎలా ఉన్నా.. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఎన్టీఆర్ నుంచి చిన్న రియాక్షన్ కూడా రాలేదు. ఏ విషయం అయినా.. ట్విట్టర్ వేదికగా స్పందించే తారక్.. చంద్రబాబు అరెస్ట్ అయినా కూడా కనీసం ట్వీట్ చేయలేదు.
పైగా ఇలాంటి సమయంలో దుబాయ్‌కు వెళ్లారు. దీంతో ఎన్టీఆర్ ఎందుకు రాలేదు.. ఎందుకు మాట్లాడడం లేదు.. నేషన్ వాంట్స్ టు నో అన్నట్లగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ వ్యవహారంలో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. ఐతే టీడీపీ అనుకూల మీడియా అని పేరున్న కొన్ని టీవీ చానెల్స్ మాత్రం ఎన్టీఆర్ వ్యవహారంలో రేపుతున్న రచ్చ అంతా.. ఇంతా.. కాదు. పేరు మార్చుకో ఎన్టీఆర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక అటు ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ పేరుతో రెచ్చిపోతున్నారు. తారక్‌కు అనుకూలంగా కొందరు.. తారక్‌ను విమర్శిస్తూ మరికొందరు ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది.
నందమూరి కుటుంబసభ్యుడిగా మాత్రమే తారక్‌ను గౌరవిస్తున్నామని.. అలాంటిది ఆ ఇంటి ఆడపడుచుకు కష్టం వచ్చినా ఎందుకు స్పందించడం లేదని.. నీ మొండితనం భరించలేక.. మౌనాన్ని అర్థం చేసుకోలేక.. నీపై ప్రేమ చంపేసుకుంటున్నా.. నువ్ చల్లగా ఉండు ఎన్టీఆర్ అని కొందరు ఘాటుగా పోస్టులు పెడుతుంటే.. ఎన్టీఆర్‌కు తనకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు ఉంటాయని.. ఇష్టపడిన వ్యక్తి నిర్ణయాలను గౌరవించలేని వాళ్లు.. ఉన్నా లేకున్నా ఒక్కటేనని.. అలాంటి కపట అభిమానులు అవసరం లేదని ఇంకొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ ఒక్కడు కాదు.. ఒక శక్తి అని.. ఆయనకు తామంతా అండగా ఉంటామని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మావాడివే కానీ మాలో ఒకడివి కాలేవు అంటూ ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు. ఇది చినికిచినికి గాలివానగా మారే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి. మరి ఈలోపు ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారో లేదో చూడాలి మరి.