Chandrababu Naidu: చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు వాయిదా..!

క్వాష్ పిటిషన్‌కు సంబంధించి లిస్ట్ ఇంకా పెట్టలేదని, ఆ తర్వాతే వివరాలు చెప్పగలమని లాయర్లు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు జడ్జి.. క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్నందున సీఐడీ కస్టడీపై కూడా తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

  • Written By:
  • Publish Date - September 21, 2023 / 05:59 PM IST

Chandrababu Naidu: చంద్రబాబు కస్టడీ పిటిసన్‌పై తీర్పును ఏసీబీ కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెల్లడించనున్నట్లు జడ్జి వెల్లడించారు. నిజానికి ఈ తీర్పు గురువారమే రావాల్సి ఉంది. చంద్రబాబున తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని అడిగింది. చంద్రబాబును కస్టడీలో విచారిస్తామని కోరింది. దీనిపై వాదనలు మంగళవారమే పూర్తయ్యాయి.

సీఐడీ తరఫు లాయర్లు, చంద్రబాబు తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. అనంతరం తీర్పును గురువారానికి వాయిదా వేశారు. దీని ప్రకారం గురువారం ఉదయం 11:30 గంటలకు తీర్పు ఇస్తామని జడ్జి చెప్పారు. అయితే, గురువారం ఉదయం తీర్పు వెలువడలేదు. సాయంత్రం నాలుగు గంటలకు తీర్పు వాయిదా వేశారు. అయితే, సాయంత్రం బెంచ్‌పైకి వచ్చిన జడ్జి.. చంద్రబాబుపై హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న క్వాష్ పిటిషన్‌పై ఆరా తీశారు. ఈ కేసులో తీర్పు ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. దీనిపై తీర్పును రిజర్వ్ చేశారని, ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. శుక్రవారం ఏమైనా తీర్పు వచ్చే అవకాశం ఉందా అని జడ్జి ప్రశ్నించారు. క్వాష్ పిటిషన్‌కు సంబంధించి లిస్ట్ ఇంకా పెట్టలేదని, ఆ తర్వాతే వివరాలు చెప్పగలమని లాయర్లు జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు జడ్జి.. క్వాష్ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్నందున సీఐడీ కస్టడీపై కూడా తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం తీర్పు వెల్లడిస్తామని చెప్పారు.

చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడిగితే.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందువల్ల కస్టడీకి ఎలా ఇస్తామని సీఐడీ లాయర్లను ప్రశ్నించారు. అయితే, క్వాష్ పిటిషన్‌కు సంబంధించి ఎలాంటి ఆదేశాలొచ్చినా.. వాటికి కట్టుబడి ఉంటామని చెప్పారు. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో చంద్రబాబు కస్టడీ కూడా శుక్రవారం ముగియనుంది. ఆ తర్వాత ఈ కేసులో కస్టడీ కొనసాగిస్తారా.. బెయిల్ ఇస్తారా.. క్వాష్ పిటిషన్ ప్రకారం కేసు కొట్టివేస్తారా అనే ఆసక్తి నెలకొంది.