Jupally Krishna Rao: బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభ వర్షం కారణంగా వాయిదా పడింది. ఇటీవలి కాలం వరకు జూపల్లి బీఆర్ఎస్‌లో కొనసాగిన సంగతి తెలిసిందే. కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన జూపల్లి గతంలో మంత్రిగా కూడా పని చేశారు. అనంతరం పరిణామాల నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ పక్కనబెట్టింది.
దీంతో జూపల్లి ఆ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇటీవలే పొంగులేటి ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో జూపల్లి కూడా తన సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీలో చేరాలనుకున్నారు. ఈ నెల 30న భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకా గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరాలనుకున్నారు. పాలమూరు ప్రజా భేరి పేరుతో, మూడు లక్షల మందితో సభ నిర్వహించాలనుకున్నారు.
ఈ సభలో ప్రియాంక సమక్షంలో తనతోపాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనుచరులు, కీలకనేతలను కూడా కాంగ్రెస్‌లో చేర్చేందుకు జూపల్లి రంగం సిద్ధం చేశారు. జూపల్లితోపాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఇతర నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకొంటారు. ఈ సభలోనే ప్రియాంకా గాంధీతో బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కూడా కాంగ్రెస్ నిర్ణయించింది. మహబూబ్ నగర్ జిల్లాతోపాటు తెలంగాణ అంతా గొప్పగా చెప్పుకొనేలా బహిరంగ సభకు ప్లాన్ చేశారు. కానీ, వర్షాల కారణంగా 30న జరిగే సభ వాయిదా పడింది. దీంతో జూపల్లి, ఆయన అనుచరులు నిరాశకు లోనయ్యారు. అయినప్పటికీ మరోరోజు బహిరంగ సభ భారీగా నిర్వహిస్తామని జూపల్లి అనుచరులు చెబుతున్నారు.
నిజానికి ఈ నెల 20నే సభ నిర్వహించాల్సి ఉంది. కానీ, ప్రియాంకా గాంధీ బిజీగా ఉండటం వల్ల 30కి వాయిదా వేశారు. ఇప్పుడు వర్షం వల్ల మరోసారి వాయిదా పడింది. అధికారికంగా జూపల్లి చేరిక పూర్తైతే.. పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీలవుతుంది. ఆయన కూడా నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. దీనికోసం ఆయన ఎప్పటినుంచో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వర్షాలు తగ్గితే వచ్చే వారమే బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.