Kanna Lakshminarayana: కమలం వీడి సైకిల్‌ సవారీకి సిద్ధమైన కన్నా..! రాజీనామా వెనక ఇంత కథ ఉందా ?

కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. జనసేనలో చేరతారని ఊహాగానాలు వచ్చినా సైకిలెక్కేందుకే ఆయన సిద్ధమైనట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - February 16, 2023 / 06:10 PM IST

అనుకున్నదే జరిగింది.. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పారు. నిజానికి ఈ ప్రచారం ఇప్పటిది కాదు.. ఏడాది ముందు నుంచే బీజేపీకి బైబై చెప్పబోతున్నారనే మాటలు వినిపించాయ్. ఇప్పుడు నిజం అయింది అంతే ! ఇంటి ముందు బీజేపీ బ్యానర్లు తీసేసినప్పుడే.. పార్టీని వీడేందుకు రెడీ అయ్యారని తెలిసింది. నాన్చడం ఎలాగూ నేతలకు అలవాటే కాబట్టి.. కన్నా కూడా అదే చేశారు. సోము వీర్రాజుతో విభేదాలు నిజానికి చిన్న సాకు మాత్రమే ! రాజకీయ భవిష్యత్‌ కోసమే కన్నా పార్టీ మారారన్నది క్లియర్‌. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ గెలవలేమని.. నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే అని కన్నాకు తెలుసు !

బీజేపీకి ఏపీలో పెద్దగా స్కోప్‌ లేదు. జనసేన కూడా ఎలాగూ దూరం అవుతోంది. టీడీపీతో కలిసి పొత్తులో ఉంటుందా అంటే.. అదీ అనుమానమే ! అన్నీ ఆలోచించే.. కమలం పార్టీకి కన్నా కటీఫ్ చెప్పారని అనిపిస్తోంది. టీడీపీలో వెళ్లడం వెనక కూడా ఇలాంట వ్యూహమే ఉంది. జనసేనలో చేరి టికెట్ అడిగే కంటే.. జనసేనకు సీట్లు ఇచ్చే పార్టీలో చేరితే.. పని ఈజీ అవుతుందని.. అందుకే సైకిల్‌పై సవారీకి కన్నా సిద్ధం అయ్యారని అర్థం అవుతోంది. రాజీనామా చేస్తే ఎక్కడకు వెళ్లాలో ఆయనకు ముందే తెలుసు. కాకుంటే అనుచరులతో చర్చించి నిర్ణయించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పడం అనేది ఒక తంతు మాత్రమే ! వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారు. బీజేపీలో ఉంటే అది సాధ్యం కాదని తెలుసు. అందుకే పార్టీ మారాలన్న ఆలోచన 2019ఎన్నికల తర్వాత వచ్చిందన్నది ఆయనకు అత్యంత సన్నిహితులే అంగీకరిస్తారు.

కన్నా లక్ష్మీనారాయణ ఎగ్జిట్ కూడా బీజేపీ పెద్దలకు పెద్దగా ఆశ్చర్యం కలగకపోవచ్చు. ముందుగా ఊహించిందే ! అందుకే కన్నా పార్టీని వీడి వెళ్లినా ఆ పార్టీకి పెద్దగా జరిగే లాభం లేదు. నష్టం లేదు. కన్నా లక్ష్మీనారాయణకు కూడా అదే కావాలి. త్వరగా బయటపడి తాను రాజకీయంగా యాక్టివ్ కావాలి. ఎన్నికలకు ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పింది కాదు అనే చర్చ జరుగుతోంది.