కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ వచ్చేయడంతో పార్టీలు అభ్యర్థులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డాయి. ఇప్పటికే కొంతమందిని ప్రకటించగా మిగిలిన వారిని కూడా ఖరారు చేసి ప్రచారంలోకి దూకాలని భావిస్తున్నాయి. ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యే..
కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది కమలమే.. గత ఎన్నికల్లో మెజారిటీ రాకపోయినా గోడదూకిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దక్షిణాదిలో ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే.. ఇక్కడ ఏమైనా తేడావస్తే ఉత్తరాది పార్టీగానే మిగిలిపోతుంది. దీంతో కన్నడనాట ఎలాగైనా గెలవాలన్నది కమలం లక్ష్యం. బీజేపీకి ఈసారి ఇక్కడ అంత సానుకూలంగా ఏం లేదన్న విషయం బీజేపీ పెద్దలకూ తెలుసు.. కర్ణాటక ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో అవినీతి విమర్శలున్నాయి.
యడ్యూరప్ప ఉన్న సమయంలో పర్లేదనిపించినా.. బొమ్మై సర్కార్ వచ్చాక అవినీతికి ఆకలి పెరిగిపోయింది. ఏ పని జరగాలన్నా 40శాతం కమిషన్ చెల్లించాల్సి వచ్చింది. చివరకు కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోవాలస్సి వచ్చింది. ఎమ్మెల్యేలు కూడా లంచాలు తీసుకుంటూ దొరికిపోయారు. అవినీతితో పాటు బొమ్మై సర్కార్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా వివాదాస్పదమయ్యాయి. తాజాగా ముస్లింలకు ఓబీసీల్లో ఉన్న రిజర్వేషన్లను రద్దుచేసి దాన్ని నిర్ణయాత్మకమైన లింగాయత్, వక్కలిగ సామాజికవర్గాలకు కేటాయించారు. ఇది దుమారాన్ని రేపే అవకాశం కనిపిస్తోంది. ఇన్ని సమస్యలున్నా అభివృద్ధి మంత్రం తమను గట్టెక్కిస్తుందని బీజేపీ భావిస్తోంది. ప్రజావ్యతిరేకతను గుర్తించే మళ్లీ యడ్యూరప్పను రంగంలోకి దించింది. మోడీతో ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించేశారు. ఇక బీజేపీ నేతలు మఠాధిపతుల చుట్టూ తిరుగుతున్నారు. ఇక ఇక్కడ ఎంఐఎం పోటీ చేయడం కూడా బీజేపీకి కలసి వచ్చే అంశం. ముస్లిం ఓట్లను చీల్చితే అది తమకు లాభం కలిగిస్తుందని నమ్ముతోంది.
కాంగ్రెస్‌కు ఈ ఎన్నికలు అత్యంత కీలకం. మరోసారి ఓడితే రాష్ట్రంలో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే గట్టిగా పోరాడుతోంది. సర్వేలు కొంతమేర ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. 16శాతం ఉన్న లింగాయత్, 11శాతానికి పైగా ఉన్న వక్కలిగ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది హస్తం. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్‌గా ఉండటంతో వక్కలిగల్లో కొంతమేర కాంగ్రెస్‌కు పట్టు పెరిగింది. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు సెంటిమెంట్ తమకు కలసి వస్తుందని నమ్ముతోంది. బీజేపీ ప్రభుత్వ అవినీతిని కొంతమేర జనంలోకి తీసుకెళ్లిన కాంగ్రెస్… ఈ ఎన్నికల్లో అదే తమను గెలిపించే అస్త్రమని నమ్ముతోంది. కరెప్షన్ ఫ్రీ కర్ణాటక మంత్రాన్ని జపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే నేతల మధ్య అనైక్యత పార్టీని దెబ్బతీస్తోంది. పైకి అంతా బాగున్నట్లే ఉన్నా డీకే, సిద్ధూ, ఖర్గే ఎవరి వర్గం వారిదే.
జేడీఎస్ మాత్రం ఆటలో అరటిపండే.. గత ఎన్నికల్లో ఆ పార్టీ భారీగా దెబ్బతింది. ఆ తర్వాత కోలుకోలేదు. దేవెగౌడ జనంలోకి వెళ్లే పరిస్థితిలో లేరు. కుమారస్వామి పార్టీని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. నేతలు జారిపోయారు. పార్టీ పట్టు తగ్గింది. ఈసారి మాదే అధికారమని చెబుతున్నా.. ఆ పార్టీ 30-40 స్థానాల వరకు గెలిస్తే గొప్పేనని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎవరికీ మెజారిటీ రాకపోతే 2018లో లాగా తాము మరోసారి కింగ్‌మేకర్ అవుతామని ఆ పార్టీ భావిస్తోంది. వక్కలిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఓల్డ్ మైసూరు బెల్ట్‌లో ఆ పార్టీకి ఇంకా పట్టుంది. అయితే డి.కె.శివకుమార్ ఎంట్రీతో కొంతమేర వక్కలిగలు అటు షిఫ్టయ్యారన్న అంచనాలు ఎంతమేర నిజమో ఎన్నికల్లో తేలనుంది. వక్కలిగలను దాటి ఎదగలేకపోవడం జేడీఎస్‌కు మైనస్. 1999లో జేడీఎస్ ఏర్పడిన నాటి నుంచి రెండుసార్లు ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఎప్పుడూ తన సొంతబలంతో రాలేదు. ఓసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్ సాయంతో సీఎం సీటును సంపాదించింది.
2018 ఎన్నికల్లో కర్ణాటక ఓటర్లు ఏ పార్టీకి మెజారిటీ కట్టబెట్టలేదు. అతిపెద్ద పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ముచ్చటగా మూడో రోజే బలాన్ని నిరూపించుకోలేక తప్పుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అండతో కుమారస్వామి సీఎం అయ్యారు. అది కూడా 14నెలలకే కుప్పకూలింది. ఆ తర్వాత బీజేపీ తన మార్కు రాజకీయంతో పదవిలోకి వచ్చింది. మరి ఈసారి కన్నడ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు..? మరోసారి కమలానికి ఓటేస్తారా..? కాంగ్రెస్‌కు ఊపిరి పోస్తారా..? కింగ్‌మేకర్ అవుదామనుకున్న జేడీఎస్ కల నెరవేరుతుందా..? తేలాలంటే ఫలితాలు వచ్చే మే13వరకు ఆగాల్సిందే.