నాలుగు రోజుల సస్పెన్స్ తరువాత ఈ ఉత్కంఠకు తెర వేసింది కాంగ్రెస్ పార్టీ. అవినీతి లేని క్లీన్ ఇమేజ్ సిద్ధరామయ్యను మరోసారి కర్ణాటక సీఎంను చేసింది. ఇది మాత్రమే కాదు.. సిద్ధరామయ్య సీఎం అవ్వడానికి చాలా విషయాలు అనుకూలించాయి. కర్ణాటకలో వెనుకబడ్డ కులంగా ఉండే కురుబ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి సిద్ధరాయ్య.1983లో మొదటిసారిగా కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ విజయంతో సిద్ధరామయ్య పేరు మైసూర్ ఓల్డ్ రీజియన్‌లో మార్మోగింది. ఆ తరువాత జనతాద్ పార్టీలో చేరి 1994లో మొదటిసారిగా మంత్రి అయ్యారు సిద్ధరామయ్య.
జనతాదల్ రెండుగా విడిపోయిన తరువాత దేవే గౌడ నేతృత్వంలోని జేడీఎస్‌లో చేరారు. 1999లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తరువాత 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత జేడీఎస్ మద్దతుతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. కాంగ్రెస్, జేడీఎస్ కూటమిలో సిద్ధరామయ్య డెప్యుటీ సీఎంగా పని చేశారు. 2018లో మరోసారి జేడీఎస్, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో సిద్ధరామయ్యా సీఎం అయ్యారు. కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం పని చేశారు.
సిద్ధరామయ్య సీనియర్ నేత అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా పేరు తెచ్చుకున్నారు. దీనికి తోడు అవినీతి రహిత బ్యాగ్రౌండ్ ఆయనకు మరింత బలంగా మారింది. కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తరువాత డీకే శివకుమార్‌కు సిద్ధరామయ్యకు మధ్య పోటీ ఏర్పడింది. అన్ని సమీకరణాలు చెక్ చేసుకున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్యనే సీఎంగా ఎనౌన్స్ చేసింది. 135 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 90 మంది సిద్ధరామయ్యకే మద్దతు తెలిపారు. మాస్ లీడర్‌గా గుర్తింపు ఉండటం.. కురుబ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అవడం సిద్ధరామయ్యకు మరింత కలిసివచ్చింది. ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేయడం ద్వారా.. ఆ వర్గం ఓట్‌బ్యాంక్‌ను తమవైపు తిప్పుకోవచ్చని కాంగ్రెస్ భావించింది. ఇది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా మారుతుంది.
దీనికి తోడు సీఎం పోటీలు ఉన్న శివకుమార్ మీద అవినీతి ఆరోపణ కేసులున్నాయి. భవిష్యత్తులో ఇవి పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే చాన్స్ ఉంది. దీంతో శివకుమార్‌కు వేరే ఆఫర్ ఇచ్చి సీఎం రేసు నుంచి తప్పించింది హైకమాండ్. డెప్యుటీ సీఎం పదవి దాంతో పాటే విద్యుత్, ఇరిగేషన్ శాఖలు ఇవ్వనున్నట్టు సమాచారం. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా శివకుమార్‌నే హైకమాండ్ కంటిన్యూ చేయనుంది. దీంతో సిద్ధరామయ్యకు లైన్ క్లియర్ ఐంది. నాలుగు రోజుల సస్పెన్స్ తరువాత కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరు ఖరారైంది. రేపు అంగరంగవైభవంగా సిద్ధరామయ్య కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేస్తారు.