కర్ణాటకలో లింగాయత్ ఓటర్లు 17శాతం. ఈ ఒక్క నెంబర్ చాలు అది ఎంత బలమైన వర్గమో చెప్పడానికి. లింగాయత్ ఓటర్ల మద్దతు కోసం అన్ని పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తాయి. లింగాయత్ ఓటర్లకు కోపం తెప్పించే ఏ పనీ పార్టీలు చేయవు. అలాంటిది బీజేపీ తెలిసి తెలిసీ అదే తప్పు చేసింది. తనకు అండగా ఉన్న లింగాయత్ ఓటర్లను చేజేతులా దూరం చేసుకుంది. చివర్లో మేలుకుని ఆకులు పట్టుకున్నా అప్పటికే చేతులు కాలాయి.
యడ్యూరప్పను దూరం చేసుకోవడం లింగాయత్‌ల ఆగ్రహానికి ప్రధాన కారణం. ఆయనకు లింగాయత్‌లపై గట్టి పట్టుంది. ఆయన బరిలో ఉంటే సీట్లు, ఓట్లు గ్యారెంటీ. కానీ రెండేళ్ల క్రితం యడ్యూరప్పను బీజేపీ అవమానకరంగా తప్పించింది. దాంతో లింగాయత్ నేతలు రగిలిపోయారు. ఆ తర్వాత అదే వర్గానికి చెందిన బొమ్మైను ముఖ్యమంత్రిగా నియమించింది కమలం అధిష్ఠానం. ఆ నష్టాన్ని ఇలా పూడ్చుకోవాలని భావించింది. అయితే బొమ్మై లింగాయతే అయినా ఆ వర్గంపై ఆయనకు పట్టులేదు. వారి మద్దతూ లేదు. పైగా యడ్యూరప్ప మద్దతు లేదు. ఇక ఎన్నికల సమయంలో సీట్ల పంపిణీలోనూ యడ్యూరప్ప మాట నెగ్గలేదు. నష్టం జరుగుతోందని ఆలస్యంగా కళ్లు తెరిచిన బీజేపీ… దిద్దుబాటు చర్యలకు దిగినా ఆ ప్రయత్నం ఫలించలేదు.
నాడు కాంగ్రెస్.. నేడు బీజేపీ..!
1989లో కాంగ్రెస్ కర్ణాటక సీఎంగా వీరేంద్ర పాటిల్‌ను ప్రకటించింది. ఓ లింగాయత్ నేతను కాంగ్రెస్ సీఎం సీటులో కూర్చోబెట్టడం అదే మొదటిసారి. అయితే 1990 చివర్లో రాజీవ్‌గాంధీ చేసిన పని కాంగ్రెస్ కొంపముంచింది. వీరేంద్రపాటిల్ గుండెపోటుకు గురయ్యారు. ఆ సమయంలోనే కర్ణాటకలో మతకలహాలు రేగాయి. వెంటనే కర్ణాటక వచ్చిన రాజీవ్‌గాంధీ.. ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత వీరేంద్రపాటిల్‌ను పరామర్శించారు. తిరిగి వెళ్లడానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాజీవ్ షాకింగ్ నిర్ణయం ప్రకటించారు. కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోబోతున్నట్లు దీనికి పాటిల్ కూడా అంగీకరించినట్లు ప్రకటించారు. అయితే పాటిల్ మాత్రం తనతో రాజీవ్ దానిపై ఏం మాట్లాడలేదని తాను తప్పుకోబోనని ప్రకటించారు. రాజకీయసంక్షోభంతో రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చింది. దీంతో లింగాయత్‌లు తమ వర్గాన్ని కావాలనే అవమానపరిచారని భావించారు. అప్పుడు దూరమైన లింగాయత్‌లు ఇప్పటివరకూ కాంగ్రెస్‌కు దగ్గర కాలేదు. బీజేపీని ఓన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు యడ్యూరప్పను పక్కనపెట్టిన తీరుతో వారి ఓట్లలో చీలిక వచ్చింది. కాంగ్రెస్‌కు లాభించింది.
బ్రాహ్మణ సీఎం ప్రచారం.!
బీజేపీని ముంచిన మరో అంశం బ్రాహ్మణ ముఖ్యమంత్రి ప్రచారం. కర్ణాటకలో అధికారంలోకి వస్తే ఓ బ్రాహ్మణ నేతను సీఎం చేస్తారన్న ప్రచారం బాగా జరిగింది. ఆ వ్యూహంతోనే సీట్ల పంపిణీ నుంచి తమ వర్గానికి అన్యాయం చేశారని భావించారు. కొందరు ఢిల్లీ ముఖ్యనేతల పాత్ర దీని వెనక ఉందన్న ప్రచారం జరిగింది. జగదీష్ షెట్టార్, లక్ష్మణ్ సవాదీ వంటి లింగాయత్ నేతలకు సీట్లు నిరాకరించడం అందుకేనని చెప్పుకున్నారు. 17శాతం ఉన్న తమను కాదని కర్ణాటకలో 3శాతం మాత్రమే ఉన్న బ్రాహ్మణ వర్గానికి సీఎం సీటు ఇస్తారన్న అనుమానం లింగాయత్‌ల్లో పెరిగిపోయింది. బీజేపీ దాన్ని ఖండించే ప్రయత్నం చేసినా చాపకింద నీరులా జరగాల్సిన ప్రచారం జరిగిపోయింది. అందుకే చివర్లో లింగాయత్ పెద్దలు బీజేపీకి మద్దతు ఇవ్వబోమని ప్రకటించారు.
మొత్తంగా చూస్తే లింగాయత్‌లు తమను విడిచి ఎక్కడికీ పోరన్న అతి దీమా బీజేపీ కొంపముంచింది. ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయిన ఆ పార్టీ చివర్లో యడ్యూరప్పను ప్రచారంలోకి తీసుకొచ్చినా లాభం లేకపోయింది.