బ్రేకింగ్: సిఎంకు షాక్ ఇచ్చిన గవర్నర్

  • Written By:
  • Publish Date - August 17, 2024 / 01:38 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై విచారణకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేసారు. ఈ మేరకు ప్రాసిక్యూషన్ కు ఆయన అనుమతిచ్చారు. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) స్థల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయంటూ ప్రదీప్ కుమార్, టిజె అబ్రహం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు వ్యక్తులు పిటీషన్ దాఖలు చేయగా… ఈ ప్రాసిక్యూషన్ ను ఏర్పాటు చేస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రిపై అవినీతి నిరోధక చట్టం, 1988లోని సెక్షన్ 17 మరియు సెక్షన్ 218 ప్రకారం విచారిస్తారు.

గత నెలలో సిద్దరామయ్యకు షోకాజ్ నోటీసులు పంపారు గవర్నర్. మీపై వచ్చిన ఆరోపణలకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వాల్సిందే అని ఎందుకు విచారణ చేయవద్దో చెప్పాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రిపై విచారణకు వ్యతిరేకంగా మంత్రి వర్గం తీర్మానం చేసింది. సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి మైసూరు పరిసరాల్లో 14 స్థలాల కేటాయింపు చట్టవిరుద్ధమని ఆ ముగ్గురు ఆరోపించారు. ఈ కేటాయింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ 45 కోట్ల నష్టం వాటిల్లిందని లోకాయుక్త పోలీసులకు జూలై నెలలో ఫిర్యాదు చేసారు.

ఈ ఫిర్యాదులో సిద్ధరామయ్య, భార్య, కుమారుడు ఎస్ యతీంద్ర, ముడా సీనియర్ అధికారులు ఉన్నారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి… ఆ భూమిని తన బావమరిది మల్లికార్జున 1998లో కానుకగా ఇచ్చాడని పేర్కొన్నారు. అయితే కృష్ణ మాత్రం… 2004లో మల్లికార్జున అక్రమంగా సేకరించి ప్రభుత్వ, రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఫిర్యాదు చేసారు. బిజెపి అధికారంలో ఉన్న సమయంలోనే ఆమెకు పరిహారం వచ్చిందని సిద్దరామయ్య పేర్కొనడం గమనార్హం.