Kasireddy Narayan Reddy: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడి నారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతోపాటు పలువురు ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఇతర నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో శుక్రవారం కసిరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. తమ పార్టీ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన కసిరెడ్డిపై అనర్హత వేటు వేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బీఆర్ఎస్ లేఖ ఇవ్వనుంది. కసిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరనుంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్సీ రాములు నాయక్ పై మండలి చైర్మన్‌కి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ అనర్హత వేటు వేయించింది.
కాగా, కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కసిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ నాతో పాటు ఎంపీటీసీ, జడ్పిటిసి, సర్పంచులు, ఇతర నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చి కాంగ్రెస్ లో చేరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలని, నిరుద్యోగం లేకుండా పోవాలని యువత కోరుకుంది. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి ఉన్నా, లేకున్నా కల్వకుర్తిలో మాత్రం అభివృద్ధి జరగడం లేదు. ప్రాజెక్ట్ కు కల్వకుర్తి పేరు పెట్టారు తప్ప నీళ్ళు మాత్రం పారలేదు. భూ సమీకరణకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు. పెద్ద మొత్తం కూడా కాదు. ఎన్నో సార్లు అడిగాం. రైతుల భూములు పోయాయి. కానీ, ఆ కాలువ ద్వారా నీళ్లు రాలేదు. భూములు కోల్పోయిన రైతులకు రైతుబంధు రావడం లేదు. నేను 10వ తరగతి చదువుకున్న స్కూల్లో జూనియర్ కాలేజీ నడుస్తోంది.
డిగ్రీ కాలేజీ లేదు. ఎమ్మెల్సీ పదవి ఉండి కూడా కల్వకుర్తికి ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఆ పార్టీలో ఎమ్మెల్యేకు మాత్రమే ప్రాధాన్యం ఉంది. నేను అక్కడ ఒక అసహాయ నేతగా మిగిలిపోయాను. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రజలకు పనికొస్తాయని నేను నమ్ముతున్నాను. అందుకే కాంగ్రెస్ లో చేరాను. నన్ను ప్రజలు తీసుకొచ్చారు. గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజలపై ఉంది. కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే నా ప్రాంత అభివృద్ధికి శాయశక్తులా పనిచేస్తాను” అని కసిరెడ్డి నారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.