ఈమధ్య తెలంగాణలో చాలామంది నోట కడిగిన ముత్యం అనే మాట బాగా వినిపిస్తోంది. కాలేజీల్లోనూ, కిట్టి పార్టీల్లోనూ…. నువ్వేమైనా కడిగిన ముత్యానివా అని జోక్లు వేసుకుంటున్నారు . ఈ మాటను కెసిఆర్ ,ఆయన కూతురు కవిత అంతగా పాపులర్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి నా కూతురు కడిగిన ముత్యంలా బయటపడుతుంది అని కెసిఆర్ అంటారు. కవిత కూడా లిక్కర్ స్కాం నుంచి కడిగిన ముత్యం లా బయటపడతాను అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు బెయిల్ పై విడుదలై కవిత కడిగిన ముత్యం అయ్యారా లేదా అది పెద్ద చర్చ నడుస్తుంది.
వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత కేవలం షరతులతో కూడిన బెయిల్ పై మాత్రమే బయటికి వచ్చారు. ఆమె ఈ కేసులో నిర్దోషి కాదు. లిక్కర్ స్కామ్ లో కవితపై సిబిఐ, ఈ డి వేరువేరుగా కేసులు పెట్టాయి. ఆ రెండు కేసుల్లోనూ సుప్రీం కోర్ట్ దిసభ్య బెంచ్ కవితకు బెయిల్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం కవిత అరెస్టు ఇప్పటికే ఐదు నెలలు దాటిపోయింది. అంతేకాకుండా ఈ కేసులో చార్జిషీట్లు కూడా సిబిఐ ఈడి వేసేసాయి. చార్జిషీట్ వేసిన తర్వాత
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే నిందితుల్ని రిమాండ్ లో ఉంచుతారు.
సాధారణ పరిస్థితిలో నిందితులు రిమాండ్ లో ఉండాల్సిన అవసరం లేదు. అందువలన కవితకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు.అంతేగాని ఈ కేసులో కవిత నిర్దోషిని కానీ, అసలు ఈ కేసు ఆమెకు సంబంధం లేదని కానీ ఎక్కడ చెప్పలేదు. బెయిల్ ఇచ్చిన 24 గంటల్లోనే కవిత రౌస్ అవెన్యూ కోర్టుకు విచారణకు ఆన్లైన్లో హాజరయ్యారు. ఇకపై ఆమె ప్రతి ట్రయల్ కు కోర్టుకు రావాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ డి ,సి బి ఐ రెండు వేరు వేరు కేసులు గనక ఆమె వేరువేరుగానే హాజరవ్వాల్సి ఉంటుంది. తప్పించుకోవడానికి కుదరదు. లిక్కర్ కేసు విచారణ ఎన్నాళ్ళు జరిగితే అన్నాళ్ళు ఢిల్లీ సిబిఐ కోర్టుకు రావాల్సిందే. ఒకవేళ సిబిఐ కోర్టులో కవిత నిర్దోషిగా బయటపడితే సరి, ఒకవేళ దోషిగా నిరూపితం అయితే ఆమె తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు ఢిల్లీ హైకోర్టు లోను, ఆ పై సుప్రీం కోర్టులోను ఈ కేసులో కవిత పోరాడాల్సిందే. ఇప్పట్లో ఈ కేసు ఏమీ అవ్వదు. కేవలం షరతుల తో కూడిన బెయిల్ పై మాత్రమే కవిత బయటి తిరగ గలుగుతారు.
ఒక రకంగా చెప్పాలంటే కెసిఆర్ పిలక బిజెపి చేతిలో ఉన్నట్లే. కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంతకాలం కెసిఆర్ అన్ని మూసుకొని ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ పార్టీని పన్నెత్తు మాట అనే ప్రయత్నం కూడా చేయకూడదు. భవిష్యత్తులో రాజకీయ సమీకరణా లను బట్టి బిజెపి బీఆర్ ఎస్ లు కలిసి పోటీ చేస్తాయా, విలీనం అవుతాయా అన్నది తేలుతుంది. ఏది ఏమైనా ఢిల్లీ లిక్కర్ స్కాం కోర్టులో నడిచినంత కాలం ,కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంతకాలం కెసిఆర్ బిజెపికి లోబడే ఉండాలి.
అది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. లోక్సభ ఎన్నికల అయిన తర్వాత కెసిఆర్ గానీ, కేటీఆర్ గానీ ఎక్కడ బిజెపి నేతలని పని ఎత్తు మాట అనడం లేదు. అంతేకాదు స్థానిక బిజెపి నేతలు ఏదైనా విమర్శించినా కూడా దానికి ప్రతి విమర్శ కూడా చేయడం లేదు. బి ఆర్ ఎస్ టార్గెట్ కేవలం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాత్రమే. ఈ పరిస్థితులన్నీ చూస్తే ప్రస్తుతానికి కవిత కడిగిన ముత్యం కాదు. ఇప్పటికీ బురద, మరక అంటిన ముత్యమే. అవన్నీ కడుక్కొని బయటకు రావాలంటే చాన్నాళ్లు పడుతుంది. అప్పటివరకు కెసిఆర్ కు, కేటీఆర్ కు సమస్యలు తప్పవు.