ఓడలు బళ్లవుతాయి… బళ్లు ఓడలవుతాయి… ఈ సామెత ఎమ్మెల్సీ కవితకు సరిగ్గా సరిపోతుంది. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కవిత ఇప్పుడు ఎక్కడా బతుకమ్మ వేడుకల్లో కనిపించడం లేదు. దసరా సంబురాలు మొత్తం తన చుట్టూ తిప్పుకున్న కేసీఆర్ బిడ్డ ఇప్పుడు కనీసం మొహం కూడా చూపించలేని స్థితిలో పడిపోయారు. ఏడాదిలో ఎంత మార్పో…!
గతేడాది దసరా సంబురాల వరకు బతుకమ్మ అంటే కనిపించే పేరు కవిత… తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి హోదాలో బతుకమ్మ వేడుకలను తన చుట్టూ తిప్పుకున్నారు. బీఆర్ఎస్ మహిళా నేతలంతా కవిత చుట్టూ చేరేవారు. అంతేనా కోట్లు ఖర్చు పెట్టి విదేశాల్లో కూడా వేడుకలు నిర్వహించేవారు. అసలు బతుకమ్మ అంటేనే కవిత అనేలా సీన్ ఉండేది. బతుకమ్మ పాటకు గాత్రం కూడా అందించారు కవిత. ఆల్బమ్ లు రిలీజ్ చేశారు కూడా. ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో వేడుకలు నిర్వహిస్తూ వచ్చారు.
ఈసారి మాత్రం కవిత లేకుండానే బతుకమ్మ సంబురాలు జరిగిపోతున్నాయి. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ గా చెప్పుకున్న కవిత ఇప్పుడా పేరు కూడా తలవడం లేదు. చాలా రోజుల క్రితమే జైలు నుంచి బయటకు వచ్చిన కవిత ఇప్పుడు దసరా సంబరాల పేరెత్తడం లేదు. జనం ముందుకు రావడానికి మొహం చెల్లక తప్పించుకు తిరుగుతున్నారు. బతుకమ్మపై ప్రశ్నలు వస్తాయని ముందుగానే అర్థం చేసుకుని అనారోగ్యం పాట పాడారు. సంబరాలకు ముందు హాస్పిటల్ లో చేరారు. ఆ కారణంతోనే బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉన్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. అయితే అసలు కారణమేంటన్నది బహిరంగ రహస్యమే… నిజానికి జైలు నుంచి బయటకు వచ్చాక ఆమె జనానికి పెద్దగా కనిపించలేదు. అనారోగ్య సమస్యల పేరుతో మౌనంగా ఉంటున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడైతే కవిత పేరు వచ్చిందో అప్పట్నుంచే ఆమె ప్రభ తగ్గింది. కేసీఆర్ కుమార్తె మద్యం కుంభకోణంలో చిక్కుకోవడాన్ని తెలంగాణ సమాజం స్వీకరించలేదు. వేరే ఏ స్కామ్ లో ఆరోపణలు వచ్చినా పట్టించుకునే వారు కాదు కానీ మందు వ్యాపారంతో ఆమెకు ఏం పని అన్న ప్రశ్నలు వచ్చాయి. ఎప్పుడైతే ఆమెను ఈడీ, సీబీఐ అరెస్ట్ చేసిందో పూర్తిగా అప్రతిష్ట పాలయ్యారు. ఇటీవలే బీజేపీతో ఎలాగోలా రాజీ చేసుకుని పార్టీని పణంగా పెట్టి మరీ కేసీఆర్ కూతుర్ని బెయిల్ పై బయటకు తీసుకువచ్చారు. జనానికి కూడా ఇది అర్థమైంది. పార్టీ ఈ స్థాయికి పడిపోవడానికి కారణం కవితే అని బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బలంగా నమ్ముతున్నారు. కేసీఆర్ పై ఉన్న గౌరవంతో ఆ మాటను బయటకు అనలేకపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో కవిత బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సరికాదని కేసీఆర్ భావించినట్లు తెలుస్తోంది. అసలు జనంలోకి వెళ్లొద్దని కేసీఆర్ కూతురికి ఆయనే సలహా ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు జనంలోకి వెళితే చీకొడతారు కాబట్టి కొన్ని రోజులు అంతా మర్చిపోయే దాకా ఆగమని చెప్పినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమె వేడుకల్లో పాల్గొంటే బీజేపీ, కాంగ్రెస్ లు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే అవకాశాలున్నాయి. అందుకే కవిత బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఆమె అభిమానులు మాత్రం అనారోగ్యంతోనే వేడుకలకు దూరంగా ఉంటున్నారని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కొందరు బీఆర్ఎస్ నేతలు బతుకమ్మతో కవిత రీఎంట్రీ ఇస్తారని ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ సలహాతో కవిత సైలెంటైపోయారు,.
నిజానికి కేసీఆర్ కే జనంలోకి రావడానికి మొహం చెల్లట్లేదు. గత దసరా నాటికి ఈ దసరా నాటికి పరిస్థితి మారిపోయింది. ఓడలు బళ్లయ్యాయి. తలెత్తుకుని గర్వంగా తిరిగిన కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వం కోసం పోరాడుతున్నాయి. ఈ సమయంలో వేడుకల్లో పాల్గొని లేనిపోని తలనొప్పులు ఎందుకనే కవిత బతుకమ్మకు దూరమయ్యారన్నది బహిరంగ రహస్యం.