KCR: కేసీఆర్ రాజకీయ చాణక్యుడు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ ఆయనే. ఎలాంటి పరిస్థితిలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలో గులాబీ బాస్‌కు బాగా తెలుసు. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ జోష్, కొత్త చేరికల ఊపుతో మంచి ఫామ్ లో ఉన్న కాంగ్రెస్ కు చెక్ పెట్టేందుకు కేసీఆర్ కొత్త అస్త్రాన్ని రెడీ చేస్తున్నారట. ఆ ఒక్క అస్త్రంతో కాంగ్రెస్ కష్టమంతా నీళ్లలో కలిసిపోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత ఎన్నికల్లో చంద్రబాబుపై విమర్శలతో తెలంగాణ సెంటిమెంట్ ను రగల్చడంలో సక్సెస్ అయిన కేసీఆర్.. అదే కోవకు చెందిన మరో అస్త్రాన్నిరెడీ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈసారి షర్మిల, కేవీపీపై విమర్శల ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆంధ్రా వద్దు తెలంగాణలోనే పాలిటిక్స్ చేస్తానని అంటున్న షర్మిల రూపంలో.. తెలంగాణ వాడిలాగా గుర్తించండి అంటున్న వైఎస్సార్ ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు రూపంలో తమకు కొత్త విమర్శనాస్త్రాలు రెడీ అవుతున్నాయని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. వాటిని బలంగా సంధించి 2018 ఫలితాలను రిపీల్ చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ప్రతి దేశ పౌరుడికి ఉంది. అయితే తెలంగాణ సెంటిమెంట్ పునాదిపై ఏర్పడిన బీఆర్ఎస్ పార్టీ.. ప్రతిసారి లోకల్ సెంటిమెంట్ నే నమ్ముకొని బరిలోకి దిగుతోంది. తెలంగాణపై ఆంధ్ర లీడర్ల పెత్తనానికి కాంగ్రెస్ పార్టీ తలుపులు తెరుస్తోందనే విమర్శలతో ఈసారి జనంలోకి వెళ్లాలని గులాబీదండు భావిస్తోందట. కేవీపీ, షర్మిల తెలంగాణ కాంగ్రెస్ పై పట్టు కోసం యత్నిస్తున్నారనే అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని అనుకుంటోందట. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేని వారికి, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వారికి కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారుతోందనే విషయాన్ని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయట.
‘‘నేను గత నాలుగు దశాబ్దాలుగా తెలంగాణ నుంచే రాజకీయాలు చేస్తున్నా. ఏపీ పాలిటిక్స్ లో చొరవ చూపలేదు. నా భార్య, పిల్లలు అందరూ తెలంగాణలోనే ఉంటున్నారు. వాళ్ల మీద ఒట్టేసి చెబుతున్నా.. నేను ఇక్కడి మట్టిలోనే కలిసిపోతాను.. తెలంగాణ వాడిలాగా గుర్తించండి..’’ అని ఇటీవల వైఎస్సార్ ఆప్త మిత్రుడు కేవీపీ రామచంద్రరావు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లను కోరారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న కేవీపీ ఏ రకమైన వ్యూహం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయాలు చేసేందుకు సిద్ధమవుతున్న వైఎస్ షర్మిలకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేవీపీ ఈవిధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేవీపీ, షర్మిల చేరికతో కాంగ్రెస్ కు తెలంగాణలో పెద్దగా లబ్ధి చేకూర్చదని అంటున్నారు. వారి సేవలను ఏపీలో వాడుకుంటే సత్ఫలితాలు వస్తాయని సూచిస్తున్నారు. బీఆర్ఎస్ చేతికి రాజకీయ ఆయుధం ఇవ్వకుండా ఆచితూచి వ్యవహరిస్తేనే కాంగ్రెస్ కు ప్రస్తుతమున్న పాజిటివ్ వేవ్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించే అవకాశం ఉంటుంది. తొందరపాటుతో ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే 2018 ఎన్నికల ఫలితాలే మళ్లీ రిపీట్ అయినా ఆశ్చర్యం ఉండదు.